-ప్రజలపై భారం లేకుండా డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి పెంపు
-జగన్ అనైతిక నిర్ణయాలతో మిగులు నుంచి రూ.30 వేల కోట్ల భారం
-కేంద్ర విద్యుత్ పథకాలనూ నిర్లక్ష్యం చేసిన వైసీపీ ప్రభుత్వం
-స్మార్ట్ మీటర్ల వల్ల నష్టమనేది అపోహ మాత్రమే
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో 132\33 కేవీ సబ్ స్టేషన్ ను మంత్రులు గొట్టిపాటి, కొలుసు పార్థ సారథిలు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ… 2019 వరకు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ జగన్ అనైతిక నిర్ణయాలతో నష్టాల ఊబిలోకి కూరుకు పోయిందన్నారు. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ప్లాంట్లను షట్ డౌన్ చేసి బయట రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడంతో ప్రజలపై రూ.30 వేల కోట్ల భారం పడిందన్నారు. తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ వ్యవస్థను సర్వ నాశనం చేశారని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో మొత్తం విద్యుత్ వ్యవస్థకు సుమారు రూ.1.30 లక్షల కోట్లు నష్టం వాటిల్లిందని వాపోయారు.
రూ.6,000 కోట్లతో సబ్ స్టేషన్లు, మౌలిక సదుపాయాలు…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యుత్ వ్యవస్థను యాథాతథ స్థితికి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ఏటేటా పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి తగిన విధంగా., సుమారు రూ.6 వేల కోట్లతో 220 కేవీ, 400 కేవీ వంటి పెద్ద సబ్ స్టేషన్లతో పాటు 132\33 కేవీ సబ్ స్టేషన్లను కూడా అవసరమైన అన్నిప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కృష్ణపట్నం, వీటీపీఎస్, ఆర్టీపీఎస్ వంటి పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని పెంచి, బయట నుంచి విద్యుత్ కొనుగోళ్లను సాధ్యమైనంత తగ్గించామన్నారు. నాణ్యమైన విద్యుత్ ను తక్కువ ధరకు అందిస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని దానితో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అదే విధంగా సోలార్, విండ్ పవర్ ప్లాంట్లతో పాటు పీఎస్పీలను కూడా పెద్ద ఎత్తున నిర్మిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఒకవైపు విద్యుత్ వ్యవస్థలో మౌలిక వసతులను పెంచుతూనే ఏపీఈఆర్సీ ప్రజలపై వేసిన రూ.5 వేల కోట్ల భారాన్నీ కూటమి ప్రభుత్వమే భరించేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలను మరింత తగ్గించే దిశగా, రాబోయే మూడేళ్లలో యూనిట్ పై రూ.1.19 తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ విద్యుత్ పథకాలను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ వంటి పథకాలను తమకు అవసరం లేదన్న విధంగా గత వైసీపీ ప్రభుత్వ వ్యవహార శైలి ఉందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సంస్కరణలను అమలు చేస్తూ.., డిమాండ్ కు అనుగుణంగా, సరఫరాలో ఇబ్బందులు లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి 10 వేల పీఎం సూర్యఘర్ కనెక్షన్లు లక్ష్యంగా పెట్టామని మంత్రి చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో.. సూర్యఘర్, కుసుమ్ ద్వారా ఏ ఇంటికి సంబంధించి ఆ ఇంటిపై, ఏ పొలానికి సంబంధించి ఆ పొలం వద్దే విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అదే విధంగా వ్యవసాయ భూముల్లో జరిగే విద్యుత్ ప్రమాదాల నివారణకు కవర్ కండక్టర్లను వినియోగించే దిశగా ఆలోచన చేస్తున్నామన్నారు. రైతులు కూడా విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.
స్మార్ట్ మీటర్లపై అపోహలు తొలగాలి….
స్మార్ట్ మీటర్ల వినియోగంతో కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది, నష్టం జరుగుతుందనేది కేవలం అపోహ మాత్రమేనని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. అభివృద్ధి దిశగా మార్పులు జరిగే సమయంలో కొన్ని అపోహలు వస్తుంటాయన్నారు. విద్యుత్ సిబ్బంది, ఇంజనీర్లు స్మార్ట్ మీటర్ల వినియోగం విషయంలో ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని పిలుపునిచ్చారు. వినియోగదారుల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ముందుగా పారిశ్రామిక అవసరాలకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. గృహ అవసరాల నిమిత్తం స్మార్ట్ మీటర్లను బిగించే సమయంలో వినియోగదారులకు చెప్పే చేస్తారని తెలిపారు. పాత మీటర్ కూడా ఉంచి పక్కన కొత్త స్మార్ట్ మీటర్ బిగిస్తారని, దీని వల్ల కరెంట్ బిల్లు ఎంత వస్తుందో తెలుస్తుందన్నారు. అంతే కాకుండా ఏ సమయంలో ఎంత విద్యుత్ వినియోగించామో కూడా తెలుస్తుందన్నారు. దీనితో విద్యుత్ ను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకునే వెసులుబాటు స్మార్ట్ మీటర్ల వలన ప్రజలకు లభిస్తుందన్నారు.
Prajavartha Online Telugu News