రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారి ఆధ్వర్యంలో శనివారం రాజమహేంద్రవరం లోని శ్రీకందుకూరి వీరేశలింగం (SKVT) హై స్కూల్ నందు “జాతీయ బాలిక దినోత్సవం” కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి కె. వాసుదేవరావు జాతీయ బాలిక దినోత్సవం యొక్క ప్రాధాన్యత, బాలికల విద్య యొక్క అవసరాన్ని వివరించారు. అలాగే ప్రభుత్వం బాలికల కోసం విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ, బాలికలు మంచి విద్యను అభ్యసించి జీవితంలో స్థిరపడేలా ప్రోత్సాహక మాటలు తెలిపారు.
విశిష్ట అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం అర్బన్ సిడిపిఓ పద్మ నేటి సమాజంలో బాలికల పరిస్థితి, మొబైల్ వాడకం వారి జీవితాలపై చూపిస్తున్న ప్రతికూల ప్రభావాల గురించి వివరించి, బాలికలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) నుండి హాజరైన LADCలు జగదీష్ మరియు ఉదయ్ గమిని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందుతున్న ఉచిత న్యాయ సేవలు, బాల్య వివాహ నిరోధక చట్టం మరియు పోక్సో చట్టం అంశాలపై వివరించి బాలికలకు అవగాహన కల్పించారు. క్రాఫ్ట్ జిల్లా కోఆర్డినేటర్ బి. రాజ్ కుమార్ బాలల హక్కులు, బాలికల భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఎమ్.వి.ఎమ్. సుబ్రహ్మణ్యం, పాఠశాల సిబ్బంది, జిల్లా బాలల పరిరక్షణ విభాగానికి చెందిన కౌన్సిలర్ అభిషాలోమ్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News