తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, నగరి ఎమ్మెల్యే భాను, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జాతీయ జెండాకు వందనం చేసి, తిరుపతి జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో అమలు చేయనున్న పథకాల పురోగతిని వివరించారు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం పోలీస్ విభాగం నిర్వహించిన డాగ్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తిరుపతి ఎన్జీఓ కాలనీలోని ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ కలిసి జాతీయ జెండాకు వందనం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు రాజా రెడ్డి, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తిరుపతి బోథ్ హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో బోథ్ హాస్పిటల్ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ జాతీయ జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన దేశ స్వాతంత్ర్యానికి చేసిన త్యాగాలు, భారత రాజ్యాంగ విలువలు, ప్రజాసేవ ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, సమాజ ఆరోగ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డా. పసుపులేటి హరిప్రసాద్ జాతీయ జెండాకు వందనం చేసి, విద్యార్థులకు దేశభక్తి, క్రమశిక్షణ, రాజ్యాంగ విలువల ప్రాముఖ్యతను వివరించారు. చదువుతో పాటు సమాజ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
తిరుపతి లోని మాధరస మసీద్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో డా. పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం పిల్లలకు మిఠాయిలు పంచి వారి ముఖాల్లో చిరునవ్వులు నింపారు. మత సామరస్యం, సోదరభావం, జాతీయ ఐక్యతతోనే దేశ అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News