– జాతీయ స్థాయికి ఎంపికైన 20 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేత
– అభినందించిన సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు IAS.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ (SHVR–2025)’ కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయికి నామినేట్ అయిన 20మంది పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు IAS., ప్రశంసాపత్రాలు అందజేశారు. పాఠశాలల్లో సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రమైన టాయిలెట్లు, సబ్బుతో చేతులు కడుక్కొనే అలవాట్లు, వ్యర్థాల నిర్మూలన, మొక్కలు నాటడం వంటి పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన అంశాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. దేశవ్యాప్తంగా ఎంపికయ్యే 200 పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం రూ. 1 లక్ష చొప్పున నగదు పురస్కారాన్ని మంజూరు చేస్తుంది. ఆ ప్రధానోపాధ్యాయులకు విజ్ఞాన యాత్ర కూడా ఉంటుంది. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఎస్పీడీ మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమని, మంచి పద్ధతులను కేవలం తమ పాఠశాలలకే పరిమితం చేయకుండా, క్లస్టర్, కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలకు కూడా విస్తరించి, వాటిని కూడా హరిత పాఠశాలలుగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రభుత్వ గుర్తింపు తమపై బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో పాఠశాలలను మరింత పర్యావరణహితంగా మారుస్తామని అవార్డు గ్రహీతలు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.హెచ్.వి.ఆర్ రాష్ట్ర నోడల్ అధికారి, సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్. మస్తానయ్య పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News