-తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఆర్ అండ్ బి అతిథి గృహంలో అర్జీల స్వీకరణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బ్యాక్‌లాగ్ పోస్టులు, వసతి గృహాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్యలకు ఆదేశాలు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఎస్సీ–ఎస్టీ ఉద్యోగ సంఘ నాయకులు మరియు ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు, వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు కె ఎన్ జవహర్ సూచిస్తూ, వాటిపై సత్వరంగా సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎస్సీ ఉద్యోగుల సమస్యలు, ప్రజల సామాజిక–ఆర్థిక సమస్యలు చైర్మన్‌కు వివరించగా, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రతి నెల ఆఖరి రోజున జరగవలసిన సివిల్ రైట్స్ డేను ప్రతి మండలంలోనూ, జిల్లాలోనూ అమలు చేయాలని వినతిపత్రాల్లో పేర్కొన్నారు. అలాగే ఎస్సీ వసతి గృహ విద్యార్థులకు మెస్ చార్జీలను పెంచాలని, దాదాపు 600 ఎస్సీ వసతి గృహాలు ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందువల్ల తప్పనిసరిగా శాశ్వత భవనాలను నిర్మించాలని కోరారు.
ఎస్సీ వసతి గృహాలలో సిబ్బంది కొరత అధికంగా ఉందని, పదవీ విరమణ చేసిన వెల్ఫేర్ ఆఫీసర్లు, అటెండర్లు, కుక్ పోస్టుల్లో నూతన ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వినతిపత్రాల్లో పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్సీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.7,200 కోట్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. నూతనంగా ఏర్పడిన జిల్లాలలో డా. బీఆర్ అంబేద్కర్ భవనాలను నిర్మించాలని, అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏపీ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా వ్యక్తిగత అర్జీలు సమర్పించిన వారిలో రాజమండ్రికి చెందిన జీ. దేవి తాను నివసిస్తున్న గృహానికి ఇంటి పన్ను, కుళాయి పన్ను చెల్లిస్తున్నప్పటికీ పట్టా ఇవ్వడం లేదని అర్జీ సమర్పించగా, తగు చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు చైర్మన్ సూచించారు.
గోకవరం మండలం గుమ్మల్లదొడ్డి గ్రామానికి చెందిన కె. భీమరాజు తన వ్యవసాయ భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పించాలని, రాజమండ్రికి చెందిన గిరిధర్ తనకు చెందిన ఇసుక ర్యాంప్‌లో ప్రవేశించకుండా కొందరు అడ్డుకుంటున్నారని తగు చర్యలు తీసుకోవాలని అర్జీ సమర్పించారు. అలాగే రాజమండ్రి రూరల్ బొమ్మూరు గ్రామానికి చెందిన ఎం. మంగాయమ్మ తన తండ్రి కోటి గ్రామంలో వీఆర్వోగా పనిచేస్తూ మరణించారని, తనకు కారుణ్య నియామకం కల్పించాలని అర్జీ సమర్పించగా, వాటిపై తగు చర్యలు తీసుకోవాలని చైర్మన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 47 మంది బాధితులు చైర్మన్‌కు అర్జీలు సమర్పించారు. అలాగే కల్లి సుబ్బాయమ్మ అనే విభిన్న ప్రతిభావంతురాలైన మహిళ ఉపాధి కల్పించాలని అర్జీతో ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకోగా, కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ ఆమె వద్దకు స్వయంగా వెళ్లి అర్జీని స్వీకరించి, తగు చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు సూచించారు.
ఈ పర్యటనలో చైర్మన్ వెంట రాష్ట్ర ఎస్సీ కమిషన్ కార్యదర్శి ఎస్. చిన్న రాముడు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎండీ. ఘయాజుద్దిన్, ఉమ్మడి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. సత్యవతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ–ఎస్టీ నాయకులు తాళ్లూరు బాబు రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, పసలపూడి సుభాష్ చంద్రబోస్, దార యేసు రత్నం, ఉసురుమర్తి రామారావు, జంగం సుబ్బారావు, మోత నాగలక్ష్మి, అజరాపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News