Breaking News

ఏపీ తూర్పు తీరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే కూటమి ప్రభుత్వ సంకల్పం: మంత్రి కందుల దుర్గేష్

-అట్టహాసంగా ప్రారంభమైన ‘అరకు ఉత్సవ్-2026’.. పాల్గొన్న పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
-అరకు ఉత్సవ్ లో కళాకారులను ఘనంగా సన్మానించిన మంత్రులు కందుల దుర్గేష్, గుమ్మిడి సంధ్యారాణి
-లంబసింగిలో టెంట్ సిటీ, పోలవరం జిల్లా మారేడుమిల్లిలో హోమ్ స్టేల అభివృద్ధి ఏర్పాటుకు శంకుస్థాపన
-రూ. 29.88 కోట్లతో అంతర్జాతీయ స్థాయికి బొర్రా గుహల అభివృద్ధి, అరకులో రూ. 42.30 కోట్లతో హరిత రిసార్ట్స్ ఆధునీకరణ చేస్తున్నామని వెల్లడి
-ప్రతి ఇంట్లో ఒకరికి పర్యాటక ఉపాధి కల్పించడమే ధ్యేయమని పేర్కొన్న మంత్రి దుర్గేష్
-రేపు అరకు ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారని వెల్లడి
-తమిళ్ లో ప్రసంగిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పై ప్రశంసల జల్లు కురిపించిన మంత్రి దుర్గేష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అరకు వ్యాలీ,అల్లూరి సీతారామరాజు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక ప్రాభవాన్ని ప్రపంచపటంలో నిలబెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ‘అరకు ఉత్సవ్-2026’ ను వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా లంబసింగిలో టెంట్ సిటీ, పోలవరం జిల్లా మారేడుమిల్లిలో హోమ్ స్టేల అభివృద్ధి ఏర్పాటు తదితర పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, స్థానిక కళాకారులను మంత్రులు సన్మానించారు. రాబోయే పదేళ్లలో “ప్రతి కుటుంబానికి ఒక పర్యాటక ఉపాధి” లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి కందుల దుర్గేష్ ఉద్ఘాటించారు.అరకు ఉత్సవ్ మన సంస్కృతిని కాపాడుతూ, మన ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తుందని నమ్ముతున్నానని తెలిపారు.

ఈ సందర్భంగా అరకు ఉత్సవ్ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు మంత్రి దుర్గేష్ తమిళ్ లో ప్రత్యేక అభినందనలు తెలిపి ఆశ్చర్యపరిచారు. అరకును ఆంధ్రా ఊటీ అంటారు.. తమిళనాడు ఊటిని ఆంధ్రా అరకు అనేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. అరకులో అందాలు, సోయగాలు, లోయలు, చల్లని గాలులు, వృక్ష సంపద మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయన్నారు. పర్యాటకుడు ఒక్కరోజు అరకులో ఉండగలిగితే పూర్తిగా ఆనందంలోకి వెళ్తారని నమ్ముతున్నామన్నారు. విశాఖ ఉత్సవ్ లో అరకు ఉత్సవ్ కు అంతర్భాగమని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర మాజీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలకు వెళ్లాల్సి రావడంతో నేటి కార్యక్రమానికి హాజరుకాలేదని, త్వరలోనే వారు అరకు సందర్శిస్తారని మంత్రి దుర్గేష్ తెలిపారు. అలాగే, రేపు (శుక్రవారం) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని వెల్లడించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలుకుదామని పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ద్వారా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నారని, అటవీశాఖ ద్వారా సంపూర్ణ కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద సీ (సముద్రం – విశాఖ), సన్ (సూర్యుడు – అనకాపల్లి), స్కై (ఆకాశం – అరకు) పండుగగా ఈ ఉత్సవాలను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే తమ సంకల్పం అని మంత్రి దుర్గేష్ అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఉన్న ఈ జిల్లా, పర్యాటక రంగంలో ఏఎస్ఆర్ అంటే అడ్వెంచర్, సస్టెయినబుల్, రెస్పాన్సిబుల్ (సాహస, స్థిరమైన మరియు బాధ్యతాయుత పర్యాటకం) పర్యాటకానికి నిదర్శనమని అభివర్ణించారు. “జల్-జంగిల్-జమీన్” (నీరు-అడవి-భూమి) స్ఫూర్తితో అరకును పర్యావరణహిత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. నేడు కేంద్ర ప్రభుత్వ నిధులతో పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించడం గర్వకారణంగా ఉందన్నారు. ఇప్పటి వరకు స్వదేశీ దర్శన్ 2.0, ప్రసాద్, శాస్కి, సీబీడీడీ తదితర స్కీమ్ ల ద్వారా దాదాపు 450 కోట్ల నిధులు తీసుకొచ్చి పర్యాటకాభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తద్వారా అఖండ గోదావరి, గండికోట, సూర్యలంక బీచ్ అభివృద్ధి, నాగార్జున సాగర్, అహోబిలం, అరకు, అన్నవరం తదితర ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ 2.0 పథకం ద్వారా రూ. 29.88 కోట్లతో బొర్రా గుహలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి దుర్గేష్ ప్రకటించారు. అందులో భాగంగా అత్యాధునిక లైటింగ్, ఫ్లోరింగ్, ప్రొజెక్ట్ మ్యాపింగ్, సేఫ్టీ రేయిలింగ్స్, పార్కింగ్, విజిటర్స్ ఎమినిటీస్, రెస్టారెంట్స్, సావనీర్ షాప్స్, ఈవీ బగ్గీలు, పర్యాటక సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. హరిత రిసార్ట్స్ ఆధునీకరణకు రూ. 42.30 కోట్లు వెచ్చిస్తున్నామని, అరకు, మయూరి, తైడ జంగిల్ బెల్స్‌లో గదుల సంఖ్యను భారీగా పెంచామని తెలిపారు. మారేడుమిల్లి క్లస్టర్‌లోని 5 గ్రామాల్లో 33 గిరిజన హోమ్‌స్టేల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించామన్నారు.. తద్వారా ఎకో టూరిజం అభివృద్ధి చేయడంతో పాటు గిరిజనుల జీవన ప్రమాణాలు పెంపుకు కృషి చేస్తున్నామన్నారు. లంబసింగిలో రూ. 6.50 కోట్లతో రాష్ట్రంలోనే తొలిసారిగా 15 జియోడెసిక్ టెంట్లతో కూడిన ‘టెంట్ సిటీ’ని, రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ ద్వారా రూ.5 కోట్లతో క్యారవాన్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తద్వారా అరకు పైనరీ, చింతపల్లి కాఫీ ఎస్టేట్, ముంచింగిపట్టు, మారేడుమిల్లి, గాంధీ నగర్ రిజర్వాయర్ వంటి ప్రాంతాల్లో రోడ్డు ఆధారిత గ్రామీణ పర్యాటకం కోసం క్యారవాన్ మరియు క్యాంపింగ్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా క్యారవాన్ బస్సుల తీరును వివరించారు. పీఎం జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ద్వారా రూ.1.23 కోట్లతో గిరిజన హోమ్‌స్టేలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తద్వారా గిరిజన ప్రాంతాల్లో ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే ఏటికొప్పాక వారసత్వాన్ని చాటేలా రూ. 3 కోట్లతో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అరకు, పాడేరు, లంబసింగిలలో 60 హోమ్ స్టేలను గుర్తించామని తెలిపారు. అరకు కాఫీ తోటలను పర్యాటకంతో అనుసంధానం చేసి, గిరిజన రైతులకు లాభం చేకూర్చేలా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆదివాసీలకు ఉపాధి కల్పన చేసే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి కల్పన చేపట్టామన్నారు.

ఈ సందర్భంగా పర్యాటక ఉత్సవాల తీరుపై విమర్శలు చేస్తోన్న విపక్ష పార్టీని మంత్రి దుర్గేష్ ఘాటుగా హెచ్చరించారు. ఇటీవల నిర్వహించిన గండికోట, విజయవాడ, అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్, ఫ్లెమింగో ఫెస్టివల్ తదితర ఉత్సవాలకు భారీ ఎత్తున జనం తరలి వస్తున్నారంటే అది కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్న సంతృప్తి అన్నారు. 2019-24 వరకు పర్యాటకం, పర్యావరణం పూర్తిస్థాయిలో నాశనమైందని, కనీసం పర్యాటక ఉత్సవాలను కూడా గత ప్రభుత్వం నిర్వహించకుండా విస్మరించిందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పర్యాటక రంగం నిర్వీర్యమైందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పండుగ వాతావరణం నెలకొందని మంత్రి దుర్గేష్ విమర్శించారు. గతంలో పర్యాటకం అంటే విలాసవంతమైన హోటళ్లు, రిసార్టులకే పరిమితం అనే భావన ఉండేది. కానీ, నేటి పర్యాటకులు ‘అథెంటిక్’ (సహజమైన) అనుభూతిని కోరుకుంటున్న నేపథ్యంలో మారుతున్న ధోరణిని అందిపుచ్చుకుంటూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల దిశానిర్దేశంలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పనతో పాటు నూతన పర్యాటక విధానం 2024–2029 రూపొందించబడిందని వివరించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీలను వివరించారు. ప్రజల కోసం సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్రంలు పనిచేస్తున్నాయని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఆదివాసీల నృత్యాలు సహా అంతరించిపోతున్న సాంస్కృతిక కార్యక్రమాలను నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. గడిచిన ఐదేళ్లలో కళా సాంస్కృతిక వైభవం నీరుగారిందని విమర్శించారు. విశాఖ మన్యంలోని గిరిజన యువతకు తమ సొంత ఇళ్లే ఆదాయ వనరులుగా మారడం, స్థానిక వంటకాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం మేం సాధించిన అతిపెద్ద విజయమని తెలిపారు. ఆంధ్రుడి ఆతిథ్యం ఇప్పుడు ప్రపంచ పర్యాటకులకు ‘సరికొత్త చిరునామా’గా మారుతోందని మంత్రి కందుల దుర్గేష్ ఆనందం వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *