-వేతన సవరణ కమీషన్ నియామకాన్ని ప్రకటించాలి.
-మధ్యంతర భృతి ప్రకటిస్తూ బడ్జెట్లో నిధులు కేటాయించాలి.
-ఇంకమా మంజూరు కావలసిన 4 విడతల డి.ఎ.లు, పేరుకుపోయిన సరెండర్లీవ్ లు తక్షణమే మంజూరు చేయాలి.
-సి.పి.ఎస్. / జి.పి.ఎస్. ను సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపిస్తామన్న ఎన్నికల హామీ అమలు చేయాలి.
-వచ్చే బడ్జెట్ సమావేశాలలో అన్ని అంశాలపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలి.
-నిధులు కేటాయించలేకపోతే ప్రత్యామ్నాయంగా ‘బాకీకి భూమి’ పేరుతో ఉద్యోగులకు నివాస స్థలాల కేటాయింపులపై స్పష్టమైన విధాన ప్రకటన చేయాలి….. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు హక్కుగా సంక్రమించి ఇప్పటికే మంజూరుకాబడిన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు దాదాపు 35 వేల కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. ఇంకనూ, మంజూరు కావలసిన వేతన సవరణ, 4 విడతల డి.ఎ., సరెండర్ లీవ్లు తదితర ప్రయోజనాలు, వాటి అంచనా మరికొన్ని వేలకోట్లు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇన్ని వేల కోట్ల రూపాయల చెల్లింపు ప్రభుత్వానికి అసాధ్యంగా మారిన నేపధ్యంలో ప్రత్యామ్నాయ పరిష్కార మార్గంగా మన సంఘం “బాకీకి భూమి” అనే ప్రతిపాదనను అటు ప్రభుత్వానికి నివేదించి, ఇటు “రండి- టీ తాగుతూ మాట్లాడుకుందాం” అనే కార్యక్రమం ద్వారా ఉద్యోగుల దగ్గరకు తీసుకువెళ్ళిన విషయం మీ అందరికీ తెలిసిందే.
ప్రభుత్వం నుండి ఎటువంటి నిర్దిష్టమైన స్పందన అధికారికంగా లేనందున ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో పేరుకుపోయిన బకాయిల చెల్లింపు విషయంలో తీవ్ర ఆవేదన నెలకొనియున్నది. మరోప్రక్క వందిమాగదులుగా తయారయిన భజన సంఘాలు ప్రభుత్వంతో చర్చించేసాం…. వేల కోట్ల బకాయిల చెల్లింపులు అయిపోయాయి…. వరాల జల్లులు కురిసిపోయాయి…. అంటూ యథావిధిగా తమ భజన కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లుకు తీవ్ర గందరగోళం, అయోమయం నెలకొని ఉన్నది. ఈ శతభిషలకు తావు లేకుండా ఎప్పటిలాగే “భజనతో కాదు బాధ్యతతో -పార్టీలతో కాదు ప్రభుత్వంతో ” అన్న మన సంఘ మూలసూత్రాన్ని అనుసరించి యావత్తు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పక్షాన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించదలిచాం. అందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తేదీలను రాష్ట్రమంత్రిమండలి నిన్న ఖరారుచేసిన నేపథ్యంలో, ఉద్యోగులకు ఇప్పటికే మంజూరు చేసి పెండింగ్లో ఉన్న బకాయిలు, అలాగే మంజూరుచేయవలసిన ఆర్థిక ప్రయోజవాలు సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో పి.ఆర్.సి. కమీషన్ ఏర్పాటు, నాలుగు విడతల డి.ఎలు, మధ్యంతర భృతి మొదలగు అంశాలు 2026-2027 ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి 14వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్లో నిర్దిష్టమైన కేటాయింపులు చూపాలి లేదా ప్రత్యామ్నాయ పరిష్కారంపై ప్రభుత్వం తమ విధాన ప్రకటనను బడ్జెట్ ద్వారా తెలియపరచాలి అని డిమాండ్ చేయదలిచాము.
అలాగే, సి.పి.ఎస్. రద్దు చేసి ఓ.పి.ఎస్. పునరుద్దరించాలన్న ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి. తాము అధికారంలోకి వస్తే సి.పి.ఎస్. / జి.పి.ఎస్. లను సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం ఒక సంవత్సర కాలంలో చూపుతామన్న అధికార పక్ష పార్టీల ఎన్నికల హామీని ప్రస్తుత శాసనసభ / శాసన మండలి వేదికగా 2026-2027 ఆర్థిక సంవత్సరానికి చేసే బడ్జెట్ ప్రతిపాదనలో ప్రభుత్వం స్పష్టం చేయాలని కూడా కోరాలని నిర్ణయించాం.
ఈ పై అంశాలన్నీ బడ్జెట్తో ముడిపడి ఉన్నందున ఫిబ్రవరి 11వ తేదీ నుండి రాష్ట్ర 2020-2027 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యి 14వ తేదీ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో పై అంశాలను డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి విజయానంద్, ఐ.ఎ.ఎస్. ని మరియు ఆర్థిక శాఖామాత్యులు పయ్యావుల కేశవ్ ని కలిసి లిఖితపూర్వకంగా విన్నవించడం జరిగింది, (ఫోటోలు జతపరచడమైనది)
సమస్య తీవ్రత మరియు తక్షణ పరిష్కార అవసరాన్ని గుర్తించేలా రాష్ట్ర శాసన వ్యవస్థలలో ప్రాతినిధ్యం వహించే 175 శాసన సభ్యులను మరియు 58 శాసనమండలి సభ్యులను, సంఘ ప్రతినిధులు నేరుగా కలిసి పై అంశాలను బడ్జెట్ సమావేశాలలో స్థానిక ప్రజాప్రతినిధులుగా వారి వారి నియోజకవర్గాల పౌరసమాజంలో అంతర్భాగమైన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల తరపున బలంగా ప్రస్తావించి, సానుకూల నిర్ణయాలు వెలువడేలా దోహదపడమని అభ్యర్థించాలని నిర్ణయించడమైనది. రాష్ట్ర కార్యవర్గ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 1, 2026వ తేదీ నుండి ఫిబ్రవరి10, 2026 వరకు రాష్ట్రంలో అన్ని జిల్లా శాఖల ప్రతినిధి బృందం వారి జిల్లా పరిధిలో ఉన్న వివిధ నియోజకవర్గ శాసనసభ్యులను / శాసనమండలి సభ్యులను నేరుగా కలిసి ఉద్యోగుల పేరుకుపోయిన బకాయిలు, ఇంకనూ మంజూరుకావలసిన ఆర్థిక ప్రయోజనాలు, అలాగే సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల వేతన సవరణ కమీషన్ ఏర్పాటుతో పాటు, మధ్యంతర భృతి తదితర ఆర్థికపరమైన అంశాలలో 2026-2027 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో తగిన కేటాయింపులు ప్రతిపాదించాలని, అలాగే సి.పి.ఎస్.రద్దుచేసి, పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండును పరిష్కరించాలని ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన రాజకీయపార్టీల ఉమ్మడి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సి.పి.ఎస్., జి.పి.ఎస్ విధానాలను పునః సమీక్షించి సంవత్సరంలోగా ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపిస్తామన్న తమ ఎన్నికల హామీ మేరకు ప్రస్తుత బడ్జెట్ సమావేశంలోనే ఈ అంశంపై ప్రభుత్వం తన విధాన నిర్ణయాన్ని ప్రకటించాలని… ఆ మేరకు రాష్ట్ర శాసనసభలో / శాసనమండలిలో మా ప్రతినిధిగా బలంగా గళం వినిపించాలని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించేలా చూడాలని అభ్యర్థించడం జరుగుతుందన్నారు.
Prajavartha Online Telugu News