గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరులోని పశ్చిమ నియోజకవర్గంలో గల 34 డివిజన్లో ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద పెన్షన్ల కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) తో కలిసి గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం అందజేశారు.
మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇవ్వలేనటువంటి విధంగా పెన్షన్లను నెలకు వితంతు, ఓల్డ్ ఏజ్ పెన్షన్ల కింద రూ. 4000లను, దివ్యాంగులకు రూ. 6000లను ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇస్తున్నామన్నారు. గుంటూరు వెస్ట్, ఈస్ట్, పత్తిపాడు నియోజకవర్గాల్లో కలిపి రూ. 25 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపేనా అందిస్తున్నాము. ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రంపై విపరీతమైన భారం పడుతున్నా సరే ప్రజలకు సహకరించాలానే సదుద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్లను అందిస్తున్నారు. కొంతమంది అవగాహన లేని నాయకులు దావోస్ వెళ్ళినంత మాత్రాన పెట్టుబడులు వచ్చేస్తాయా? అని మాట్లాడుతున్నారు. ఒక కారు కొనాలంటేనే సౌకర్యాలు, పెట్టుబడి, బడ్జెట్ అని ఎన్నో రకాలుగా చూసుకుంటాము. అలాగే పెట్టుబడిదారులు కూడా పది రాష్ట్రాలలో తిరిగి ఎక్కడ బాగుంటుందనేది చూసుకుంటారు. అలాంటి పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ, మన రాష్ట్రానికి వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ వైపు పెట్టుబడులు మళ్ళే విధంగా, చలి ప్రదేశాల్లో సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు విపరీతంగా కృషి చేస్తున్నారు.
ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ఈరోజు కోబాల్ట్ పేటలో పెన్షన్లను అందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో కొందరు పెన్షన్ దారులకు కక్షపూరితంగా ఆపేశారు. అలాంటి వారికి కూడా కూటమి ప్రభుత్వం దగ్గరుండి పెన్షన్లను అందజేస్తుంది. గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రైన్లు వంటి మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడ్డారు. నేడు ఈ డివిజన్లో వాటర్ సమస్యతో సహా అనేక సమస్యలు తీర్చి, పలు సౌకర్యాలను కల్పించి ప్రజలకు అందుబాటులో ఉంటున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లను అందజేస్తామన్నారు.
మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) మాట్లాడుతూ 34 డివిజన్లో ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద పలువురు అర్హులకు పెన్షన్లను కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో అందజేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే పెన్షన్ కార్యక్రమాన్ని ఎక్కడా ఆగకుండా అందించడం జరుగుతుందన్నారు. ఒకటో తారీఖున అందాల్సిన పెన్షన్ ను ఒకరోజు ముందుగానే 31వ తేదీన అందజేయడం కూటమి ప్రభుత్వం యొక్క సమర్థతకు నిదర్శనమన్నారు.
Prajavartha Online Telugu News