-మీకోసం’ PGRS వేదికతో పాటు భూమి సమస్యలకు ప్రత్యేక పరిష్కారం
-కలెక్టరేట్‌కు హాజరు కానున్న ఆర్డీవోలు, తహశీల్దార్లు
-జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం జిల్లా స్థాయి PGRS (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్) కార్యక్రమంతో పాటు రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
భూమి సమస్యల పరిష్కార వేదిక పై ప్రత్యేక దృష్టి, అందులో భాగంగా రెవెన్యూ క్లినిక్ నిర్వహణలో భూమి సంబంధిత ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
బొమ్మూరు లోని జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే రెవెన్యూ క్లినిక్‌లకు రెవెన్యూ డివిజనల్ అధికారులతో పాటు సంబంధిత తహశీల్దార్లు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఈ క్లినిక్‌లు ఇకపై ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం (PGRS)’ కార్యక్రమంతో పాటు కొనసాగుతాయని తెలిపారు.
ఆర్డీవోలు, తహశీల్దార్లకు ఆదేశాలు
ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం మరియు కొవ్వూరు డివిజన్ల రెవెన్యూ డివిజనల్ అధికారులతో పాటు జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన తహశీల్దార్లు ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 09.30 గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహించే రెవెన్యూ క్లినిక్‌కు ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఆపరేటర్ మరియు అవసరమైన రెవెన్యూ రికార్డులతో తప్పని సరిగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
యథాతథంగా PGRS
‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక జిల్లా కలెక్టరేట్ నుంచి డివిజన్, మండల, మున్సిపల్, గ్రామ, వార్డు సచివాలయాల వరకు యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
సంబంధిత డివిజన్ పరిధిలో పరిపాలన అధికారి, మండల పరిధిలో డిప్యూటీ తహశీల్దార్ / రీ-సర్వే డిప్యూటీ తహశీల్దార్లు PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు హాజరై అర్జీలు స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వాటికి తక్షణ పరిష్కార చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రజలు తమ వినతులను నేరుగా Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని, అలాగే నమోదు చేసిన అర్జీల స్థితిగతులు తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం పొందవచ్చని తెలిపారు.
వాట్సాప్ గవర్నెన్స్ – ‘మన మిత్రా’ యాప్ ద్వారా పౌర సేవలు
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, వేగంగా అందించేందుకు 9552300009 వాట్సాప్ గవర్నెన్స్ ‘మన మిత్రా’ యాప్ ద్వారా 36 ప్రభుత్వ శాఖలకు చెందిన 700కు పైగా పౌర సేవలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకొని ప్రభుత్వ సేవల ప్రయోజనాలను పొందాలని కోరారు.
Prajavartha Online Telugu News