విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ రూపకల్పన జరిగిందని, అందులో భాగంగానే నేడు జేఏసీ రాష్ట్రస్థాయి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని కమిటీ చైర్మన్ రవీంద్ర రాజు భూపతి రాజు స్పష్టం చేశారు. ఆదివారం, ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్రస్థాయి సమావేశం గాంధీనగర్ లోని చాంబర్ ఆఫ్ కామర్స్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ రవీంద్ర రాజు భూపతి రాజు మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకునేందుకై ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ రాష్ట్రస్థాయి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ పనిచేస్తుందన్నారు. సమస్యల సాధన కోసం రెవెన్యూ ఉద్యోగస్తులు సంఘటితంగా ఐకమత్యంతో ప్రతి ఒక్కరూ మెలగాలన్నారు. రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ బిల్డింగును త్వరలోనే ప్రారంభించుకోనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లేందుకు జేఏసీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రెవెన్యూ ఉద్యోగులు, కమిటీ సభ్యులంతా కలిసి సమస్యల సాధన కోసం జేఏసీ నిర్వహించే కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులు, జేఏసీ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News