-ఎంపీ సానా సతీష్ బాబు
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఢిల్లీలో ఎంపీల బృందం సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఎంపీ సానా సతీష్ బాబు మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
గతంలో జగన్ మోహన్ రెడ్డి సతీమణిపై తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంటనే తక్షణమే అరెస్ట్ చేయడం జరిగింది. అదే మా పార్టీ నిబద్ధతకు నిదర్శనం. మహిళల పట్ల ఎలాంటి అసభ్య వ్యాఖ్యలు చేయకూడదని మా పార్టీ నాయకత్వం మాకు స్పష్టమైన క్రమశిక్షణ, శిక్షణ ఇచ్చిందన్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక పార్టీ నాయకుడిని, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని అత్యంత దారుణంగా దూషించడం సభ్య సమాజానికి తగిన ప్రవర్తన కాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ ప్రోత్సహిస్తున్నట్టుగా వ్యవహరించడం విచారకరమని వ్యాఖ్యానించారు.
లడ్డు అంశంలో తప్పు బయటపడడంతో దాన్ని డైవర్ట్ చేయడానికి కుల రాజకీయాలను తెరపైకి తీసుకొస్తున్నారు. అందుకే అంబటి రాంబాబు క్షమాపణ చెప్పడం లేదని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఒక అంశాన్ని వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే—వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు కులాన్ని ముందుకు తెచ్చి హైలైట్ చేస్తున్నారని, నేరాలు చేసే వారిని, ఘోరాలకు పాల్పడే వారిని, హత్యలు చేసే వారిని కులం చూసి తేల్చరని స్పష్టం చేశారు.
వైఎస్సార్సీపీ కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను ఈ విషయంలో కూడా ప్రయోగించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇటువంటి అంశాలను లేవనెత్తడం వల్ల వారే దిగజారుతారు తప్ప, ఆ కులం ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి అండగా నిలవదని తేల్చి చెప్పారు.
మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ—
వంగవీటి రాధా గారికి అంబటి రాంబాబుకి పోలిక ఏమిటి?
ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కులం పేరుతో సమర్థించకుండా, సమాజమే వ్యతిరేకించి బహిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
150 సీట్లు ఉన్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తన ప్రజలంతా చూశారని, అదే ప్రవర్తన కారణంగానే ఈ రోజు ఆయన పార్టీ 11 సీట్లకు పరిమితమైందని గుర్తు చేశారు.
మా పార్టీ నాయకత్వం ఇచ్చిన క్రమశిక్షణతోనే మేము నడుస్తున్నామని, వైఎస్సార్సీపీలా పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం మేము నేర్చుకోలేదన్నారు.
మా పార్టీలో కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నారని, వారు దండయాత్రకు దిగితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ నాయకులు నిలబడలేరని, ఈ విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలన్నారు. అయినప్పటికీ మేము క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజాస్వామ్య విలువలతోనే ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.
బూతులు మాట్లాడటం, అసభ్య పదజాలం వాడటం మా పార్టీ మాకు నేర్పలేదని, రాజకీయాల్లో కూడా విలువలు, సంస్కారాలు పాటించే పార్టీమని ఎంపీ సానా సతీష్ బాబు తెలిపారు.
Prajavartha Online Telugu News