– ప్రత్యేక కేంద్రంతో మహిళల వ్యాపార శక్తికి సరికొత్త దిశ
– నైపుణ్య శిక్షణ, వనరులను సద్వినియోగం చేసుకోండి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రూరల్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ సెంటర్ (రైజ్)తో మహిళల వ్యాపార కలలకు రెక్కలు వస్తాయని.. ఈ కేంద్రంలోని నైపుణ్య శిక్షణతో పాటు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ స్వయం సహాయక సంఘ మహిళలకు సూచించారు.
కలెక్టర్ లక్ష్మీశ సోమవారం ఇబ్రహీంపట్నం మండలం, గుంటుపల్లిలోని రైజ్ కేంద్రాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. స్వయం సహాయక సంఘ మహిళలకు రైజ్ కేంద్ర సందర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన 331 మంది స్వయం సహాయక సంఘ మహిళలకు ఆంత్రప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఈడీపీ) కింద వర్క్‌షాప్ నిర్వహించడం జరిగిందన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది ఆర్థికంగా ఎదిగేందుకు చేయూతనివ్వనున్నట్లు తెలిపారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త సంకల్పాన్ని నేరవేర్చేందుకు ఈ రైజ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. మహిళలకు స్కిల్ డెవలప్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వినియోగం వంటి అంశాలలో పూర్తిస్థాయిలో శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. రైజ్ శిక్షణ కేంద్రం నిర్వహణకు మేనేజర్ ను కూడా నియమించామని సెంటర్‌లో ఇంటర్నెట్, కంప్యూటర్ల సౌకర్యం అందుబాటులో ఉన్నాయని.. వీటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. మహిళల్లో దాగివున్న సృజనాత్మక శక్తిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని వివరించారు.
కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, ఏబీపీ బ్లాక్ కోఆర్డినేటర్ పి.శ్రీనివాస్, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News