గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్, కాల్ సెంటర్ కి అందే ఫిర్యాదులను కేటగిరిలుగా వేరు చేసి ఒక్కరోజులోనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పరిష్కారంకు జాప్యం జరిగితే తగిన వివరాలను అర్జీదారులకు తెలియచేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగిన పిజిఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అర్జీలను తీసుకున్నారు.
ఈ సందర్భంగా తొలుత ఆధార్ సీడింగ్, జిఆర్పీ సేవల కోసం అనేక రోజుల నుండి అర్జీలు ఇస్తున్నామని అరుణ (సాయిబాబానగర్), పద్మావతి (గోరంట్ల), రమేష్ (గుండారావుపేట) కమిషనర్ దృష్టికి తీసుకురాగా తక్షణం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి, సదరు అర్జీదారుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అర్జీదారులు కమిషనర్ దృష్టికి సమస్య రాగానే పరిష్కారం అవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ అధికారులతో మాట్లాడుతూ సచివాలయం పరిధిలో అందాల్సిన సేవల గూర్చి జిఎంసికి ఎవరైనా ప్రజలు వస్తే సంబందిత సచివాలయ కార్యదర్షులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి సోమవారం పిజిఆర్ఎస్ తో పాటు, ప్రత్యేక కౌంటర్ ని ఏర్పాటు చేసి, ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఆర్జీల పరిష్కారం చేయాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు.
అనంతరం ప్రజల నుండి అర్జీలు తీసుకొని మాట్లాడుతూ పిజిఆర్ఎస్, ఇతర వేదికల ద్వారా ప్రజలు ఇస్తున్న అర్జీల పరిష్కారం తూతూ మంత్రంగా చేస్తే సహించబోమని, ప్రతి అర్జీకి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అర్జీ అందిన 24 గంటల్లోగా పరిశీలించి, పరిష్కారం చేయాలని, చేయలేకుంటే తగు వివరాలతో ఫిర్యాదికి ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. నిర్దేశిత గడువు మేరకు పరిష్కారం చేయాలని, జీరో బియాండ్ ఎస్ఎల్ఏ నిర్వహించాలన్నారు. అర్జీలు రీ ఓపెన్ అయితే విభాగాధిపతులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
పిజిఆర్ఎస్ ద్వారా 63 అర్జీలు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 20, ఇంజినీరింగ్ విభాగం 25, రెవెన్యూ విభాగం 11, ప్రజారోగ్య విభాగం 5, అకౌంట్స్ విభాగానికి సంబందించి 2 ఫిర్యాదులు అందాయన్నారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, సిటి ప్లానర్ రాంబాబు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎస్ఈ వెంకటేశ్వరరావు, మేనేజర్ బాలాజీ బాష పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News