– అవినీతికి తావులేకుండా పనిచేయాలి
– సేవల దరఖాస్తులను సత్వరం పరిష్కరించండి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రవాణా శాఖ ద్వారా ప్రజలకు అత్యంత పారదర్శకమైన, నాణ్యమైన అవినీతిరహిత సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ డా. జి.లక్ష్మీశ రవాణా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (IVRS) ద్వారా ప్రజల నుండి వచ్చిన అభిప్రాయాల సేకరణపై చర్చించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వాహనదారులకు రవాణాశాఖ నుండి అందించే సేవలు పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, అవినీతికి ఎలాంటి ఆస్కారం లేకుండా చూడాలని స్పష్టం చేశారు.. డ్రైవర్లు, వాహన యజమానులు కోరుకునే సేవలను సత్వరమే అందించేలా, సేవా దరఖాస్తులను సత్వరము పరిష్కరించేలా అధికారులు పనిచేయాలని ఆయన సూచించారు. ప్రజల నుండి వచ్చే అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని, శాఖకు మంచి పేరు తెచ్చే విధంగా అంకితభావంతో పనిచేయాలని అధికారులకు కోరారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఏ శాఖలోనైనా అవినీతి జరుగుతున్నట్లు తేలితే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ప్రతి అధికారి, ఉద్యోగి అవినీతికి దూరంగా ఉండి, నిజాయితీగా పనిచేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు క్యూఆర్ కోడ్‌తో కూడిన పోస్టర్లను అతికించాలని కలెక్టర్ సూచించారు. అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News