Breaking News

నున్నలో రూ.4.36 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ

-విజయవాడ రూరల్ 9 గ్రామాలు వీఎంసీలో విలీనం చేయాలి
-రూరల్ గ్రామాల సమస్యలకు వీఎంసీ లో విలీనమే పరిష్కారం
-తిరుమల లడ్డూ అంశంలో రాజకీయాలు సరికాదు
-సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి అరెస్ట్ సమంజసమే
-రాజకీయాల్లో భాషా నియంత్రణ అవసరం

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త:
గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలంలోని తొమ్మిది గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలని ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్ చేశారు. గతంలో ఈ గ్రామాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న సమయంలో తగిన నిధులు అందేవని, ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఉండటంతో నిధుల కొరత ఏర్పడి అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విజయవాడ రూరల్ మండలం నున్న పంచాయతీ పరిధిలో నున్న బైపాస్ రోడ్డు అభివృద్ధికి 2.36 కోట్ల రూపాయలు, విజయవాడ–నుజివీడు రోడ్డులో 10వ కిలోమీటర్ నుంచి 16వ కిలోమీటర్ వరకు రోడ్డు పనుల కోసం 2.70 కోట్ల రూపాయలు, మొత్తం 4.36 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పనులకు ఆయన స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామవరప్పాడు వంటి గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, మురుగునీటి సమస్యతో పాటు తాగునీటిలో TDS స్థాయి ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో విజయవాడ రూరల్‌లోని తొమ్మిది గ్రామాలను వీఎంసీలో విలీనం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. నున్న సెంటర్ విస్తరణ కోసం మరో 4.5 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని మంత్రిని కోరామని, త్వరలోనే ఆ నిధులు కూడా విడుదల అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నున్న సెంటర్ వద్ద రోడ్డు వెడల్పు కేవలం 30 నుంచి 35 అడుగుల వరకు మాత్రమే ఉండటంతో నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని 80 నుంచి 90 అడుగుల వరకు విస్తరించడమే లక్ష్యమని చెప్పారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియలో ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా, అందరికీ నచ్చజెప్పి ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తామని హామీ ఇచ్చారు.వీఎంసీలో విలీనం చేస్తే పన్నులు పెరుగుతాయనే అపోహలు అవసరం లేదని… సీఆర్‌డీఏ పరిధిలో ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ఒకే విధమైన పన్నులు అమలులో ఉన్నాయని తెలిపారు.

తిరుమల లడ్డూ అంశంలో రాజకీయాలు చేయడం సరికాదని యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యానించారు. దేవుడు అందరికంటే పైన ఉంటాడని, ఆయన్ను వివాదాల్లోకి లాగడం తన మనస్సాక్షికి నచ్చదని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు వంటి వారిని అరెస్ట్ చేయడం సమంజసమేనని ఆయన సమర్థించారు. రాజకీయ నాయకులు భాషా నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని, గతంలో పత్రికలు ఇలాంటి బూతు వ్యాఖ్యలను ప్రచురించేవి కావని, ఇప్పుడు లైవ్ మీడియా కారణంగా హద్దులు దాటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుంటేనే పరిశ్రమలు వస్తాయని పేర్కొన్న ఆయన, తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గన్నవరం నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం ఏర్పడిందన్నారు. అందుకే మల్లవల్లి, వీరపనేని గూడెం వంటి ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తున్నాయని, వాటి ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. దొంగ శంకుస్థాపనలు చేయడం, కేవలం శిలాఫలకాలకే పరిమితమవ్వడం తనకు ఇష్టం లేదని, అభివృద్ధినే అజెండాగా తీసుకుని ముందుకు సాగుతానని యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు . ఈ కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండల టిడిపి అధ్యక్షులు గొడ్డళ్ల చిన్న రామారావు, నున్న గ్రామ టిడిపి అధ్యక్షులు కలకోటి శ్రీనివాస్ రెడ్డి, విజయవాడ రూరల్ మండల తెలుగుయువత అధ్యక్షులు గంపా శ్రీనివాస్ యాదవ్, టిడిపి నాయకులు గుజ్జర్లపూడి బాబురావు, మాదు శివరాంప్రసాద్, పోలా రెడ్డి సాంబి రెడ్డి, యార్కరెడ్డి కోటిరెడ్డి, బొకినాల తిరుపతిరావు, పామర్తి శ్రీనివాసరావు, మాదు మహేష్, భీమవరపు సుదీప్ రెడ్డి, నుక్కెళ్ళ సురేష్, యార్కరెడ్డి వెంకట్ రెడ్డి, పాలడుగు మల్లికార్జునరావు, రామినీడు బసవపూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *