-శ్రీవారి ప్రసాదం నెయ్యి కల్తీని తీవ్రంగా పరిగణిస్తూ దోషులపై కఠిన చర్యలు-
-స్వల్పకాలిక పరిపాలనా కమిటీని ఏర్పాటు చేసి ఈ అంశాన్ని సమగ్రంగా సమీక్షిస్తాం
-రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి వారు కొలువైవున్న తిరుమల తిరుపతి దేస్థానం పవిత్రతను కాపాడటం ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం అని, శ్రీవారి ప్రసాదం నెయ్యి కల్తీని తీవ్రంగా పరిగణిస్తూ దోషులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని సమగ్రంగా సమీక్షించి సత్వరమే తుది నివేదికను ప్రభుత్వానికిని సమర్పించేందుకు స్వల్పకాలిక పరిపాలనా కమిటీని ప్రభుత్వం నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారధి, నాదెండ్ల మనోహర్ మరియు సత్యకుమార్ యాదవ్ తో కలిసి మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ నేడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో అజండా అంశాలను ప్రక్కనబెట్టి మరీ తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) లడ్డు ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిలో జరిగిన కల్తీలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సమర్పించిన నివేదికను సమగ్రంగా పరిశీలించడం జరిగిందన్నారు. ఈ నివేదిక, భారత సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ పర్యవేక్షణలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా సమర్పించబడినదన్నారు. సిట్ నుండి ప్రభుత్వానికి రెండు పత్రాలు అందాయని, వాటిలో ఒకటి ఇప్పటికే కోర్టులో దాఖలు చేయబడిన చార్జ్ షీట్, మరొకటి ప్రభుత్వానికి ప్రత్యేకంగా పంపిన 11 పేజీల గోప్య నివేదిక అని తెలిపారు. కోర్టు చార్జ్ షీట్‌ను అధికారికంగా కాగ్నిజెన్సు లోకి తీసుకున్న తర్వాతనే అది ప్రభుత్వానికి మరియు సంబంధిత కక్షిదారులకు అందుబాటులోకి రానుందన్నారు. క్యాబినెట్ ముందు ఈ నివేదికను ఉంచి, అందులో పేర్కొన్న ప్రధాన అంశాలు మరియు తేలిన లోపాలపై విస్తృత స్థాయిలో చర్చ జరిగిందన్నారు. ప్రభుత్వానికి అందిన నివేదిక ప్రకారం, నెయ్యి సరఫరా, టెండర్ నిబంధనల సడలింపు, నాణ్యత లోపాలు మరియు తప్పుడు పత్రాల సమర్పణ వంటి తీవ్రమైన అవకతవకలు చోటుచేసుకున్నట్లు తేలిందన్నారు. సిట్ నివేదిక ప్రకారం, 2019 తర్వాత టిటిడి నెయ్యి కొనుగోలు విధానంలో అనవసరమైన సడలింపులు చేయడం ద్వారా నాణ్యతకు విరుద్ధమైన సరఫరాలు జరగడానికి అవకాశం కల్పించబడిందన్నారు. టెండర్ నిబంధనల్లో రూ.250 కోట్ల టర్నోవర్ షరతును రూ.150 కోట్లకు తగ్గించడం, కనీస పాల ప్రొక్యూర్మెంట్ అనుభవం లేకున్నా అర్హత కల్పించడం వంటి చర్యలు ఉద్దేశపూర్వకంగా చేపట్టబడ్డాయని నివేదిక స్పష్టం చేసిందన్నారు. నెయ్యి నమూనాలను పరిశీలించిన NDDB–CALF ల్యాబ్ నివేదికలో పలు సస్పెక్టెడ్ అడల్ట్రెంట్స్ (కల్తీ పదార్థాలు) సోయాబీన్, సన్‌ఫ్లవర్, రేప్‌సీడ్, కాటన్‌సీడ్, ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, లార్డ్ మొదలైనవి ఉన్న అవకాశం ఉన్నట్లు తేలిందన్నారు. ఈ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి ఆ రోజు ప్రజా వేదికపై ఈ అంశాన్ని ప్రస్తావించారన్నారు. అదే విధంగా టెండర్ నిబంధనలు ఉద్దేశపూర్వకంగా సడలింపులకు గురయ్యాయని, 2022లో CFTRI ల్యాబ్ ఇచ్చిన హెచ్చరికలను పట్టించుకోలేదని, సుమారు రూ.58 లక్షల లీటర్ల వరకు కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లు ఈ నివేదికలో వెల్లడించడం జరిగిందన్నారు. టెండర్‌లో పాల్గొన్న కొంత మంది సంస్థల తప్పుడు పత్రాలు సమర్పించి అర్హత పొందినట్లు స్పష్టమైందన్నారు. నివేదికలో ఏ.వి. ధర్మారెడ్డి (AEO), అనిల్‌కుమార్ సింహాల్ (మాజీ EO), మరియు ఓ. బాలాజీ (F&CAO) వంటి సీనియర్ అధికారుల పేర్లు ప్రస్తావించబడ్డాయన్నారు. వీరు టెండర్ నిబంధనలను సడలించడం మరియు నాణ్యత నియంత్రణలో విఫలమవడం ద్వారా బాధ్యత వహించాల్సినవారుగా సిట్ నివేదికలో పేర్కొనబడ్డారన్నారు. నివేదికలో పేర్కొన్న దోషులపై తగిన చట్టపరమైన మరియు పరిపాలనాత్మక చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే, భవిష్యత్తులో ఇలాంటి లోపాలు మరల జరగకుండా సంస్థాగత సంస్కరణలు, నాణ్యత నియంత్రణ వ్యవస్థ బలోపేతం చేపట్టాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ అంశాన్ని సమగ్రంగా సమీక్షించడానికి ఒక స్వల్ప కాలిక పరిపాలన కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ కమిటీ నిర్ణీత కాలవ్యవధిలో విచారణ పూర్తి చేసి తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుందని మంత్రి తెలిపారు. క్యాబినెట్‌లో ముఖ్యమంత్రి పేర్కొన్నట్లుగా, తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడటం ప్రభుత్వ పరమ కర్తవ్యమని, శ్రీవారి సేవలో ఏ భక్తుడి విశ్వాసం, భక్తి, పవిత్రత ఏ విధంగానూ దెబ్బతినకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా, శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడుతూ దోషులపై కఠిన చర్యలు తీసుకోవడమే తమ ధ్యేయమని క్యాబినెట్ ఏకగ్రీవంగా అభిప్రాయపడినట్లు ఆయన తెలిపారు. తిరుమల నెయ్యి కల్తీపై క్యాబినెట్ లో సుదీర్ఘ చర్చ….మంత్రి కొలుసు పార్థసారధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో, ముందుగా నిర్ణయించబడిన అజెండా అంశాలన్నింటినీ పక్కన పెట్టి, కోట్లాది మంది హిందువుల మనోభావాలను గౌరవిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశంపై సుదీర్ఘ చర్చ జరిగిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో చోటుచేసుకున్న నెయ్యి కల్తీ ఘటనపై సిబిఐ సమర్పించిన నివేదికను ముఖ్యమంత్రి సమావేశంలో ఉంచి, దాని పై సుమారు మూడు గంటలపాటు చర్చ నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా వేంకటేశ్వర స్వామివారి పవిత్రతను కాపాడటం, హిందూ భక్తుల విశ్వాసాన్ని రక్షించటం ప్రభుత్వ ధర్మమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారన్నారు. సిబిఐ నివేదికలో పేర్కొన్న అంశాలపై ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చ జరగగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సహా మంత్రులు అందరూ తమ తమ అభిప్రాయాలను వివరించారన్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు మరియు దోషులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని క్యాబినెట్ ఏకగ్రీవంగా అంగీకరించిందని మంత్రి తెలిపారు. రాజకీయ కోణంలో వక్రీకరించే ప్రయత్నాలను నిరసిస్తున్నాం….మంత్రి నాదెండ్ల మనోహర్
తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు భంగం కలిగించిన నెయ్యి కల్తీ వ్యవహారంపై విస్తృత చర్చ నేటి క్యాబినెట్ సమావేశంలో జరిగిందని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సహా మంత్రులందరూ భక్తుల మనోభావాలను కాపాడే దిశగా స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారన్నారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో వక్రీకరించే ప్రయత్నాలను నిరసిస్తూ, ప్రజలకు వాస్తవాలను పారదర్శకంగా తెలియజేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సమావేశానికి అడ్వకేట్ జనరల్ ని ఆహ్వానించి చట్టపరమైన సలహాలు పొందడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి గారు భక్తుల విశ్వాసం దెబ్బతినకుండా ఉండేందుకు ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించాలనే దృఢసంకల్పాన్ని వ్యక్తం చేశారన్నారు. గత ప్రభుత్వ కాలంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంశాలను బయటపెట్టి, ప్రస్తుతం ప్రభుత్వం నెయ్యి నాణ్యతపై పలు మార్లు ల్యాబ్ టెస్టులు నిర్వహిస్తూ పారదర్శకతతో చర్యలు తీసుకుంటోందని వివరించారు. భవిష్యత్తులో ఎవరు తప్పు చేసినా వారిపై కఠిన చర్యలు తప్పవని, శ్రీవారి పవిత్రతను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని క్యాబినెట్ ఏకాభిప్రాయంగా నిర్ణయించిందని ఆయన తెలిపారు. సృష్టికి విరుద్దంగా పాలు లేకుండా నెయ్యిని తయారు చేశారు…. మంత్రి సత్యకుమార్ యాదవ్
తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి విషయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వ పాలకులు వ్యవహరించారని, రూ.250 కోట్ల అవినీతి కుంభకోణంతో పాటు పవిత్రతను నాశనం చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ కాలంలో 2022లో సిఎఫ్టిఆర్ఐ ఇచ్చిన హెచ్చరికలను దాచిపెట్టి, టెండర్ నిబంధనల్లో ఉద్దేశపూర్వక సడలింపులు చేసి తెలియని సంస్థలకు అనుకూలం కల్పించారన్నారు. సృష్టికి విరుద్దంగా అసలు పాలే లేకుండా రసాయనాలను ఉపయోగించి తయారు చేసిన నెయ్యిని ఉపయోగించడం ద్వారా భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆలయ పవిత్రతను దెబ్బతీసిన చర్యలు, అన్యమత ప్రచారం, డిక్లరేషన్ నిబంధనల ఉల్లంఘన, బ్రహ్మోత్సవాల సంప్రదాయాల పట్ల నిర్లక్ష్యం వంటి అంశాలు గత పాలనలో చోటుచేసుకున్నాయన్నారు. ప్రస్తుతం సిబిఐ ఇచ్చిన 11 పేజీల నివేదికపై విస్తృత చర్చ జరగగా, ఎవరు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా దోషులను ఉపేక్షించకూడదని క్యాబినెట్ ఏకగ్రీవంగా నిర్ణయంతీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు.
Prajavartha Online Telugu News