-రాజానగరం సమీపంలో సంచరిస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ముమ్మరంగా గాలింపు ప్రయత్నాలు చేస్తోందని వెల్లడి
-బోనులు, ట్రాప్ కెమెరాలు, డ్రోన్లతో అటవీశాఖ అప్రమత్తంగా ఉందని, ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని మంత్రి దుర్గేష్ సూచన
-ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, ప్రజల రక్షణే తమ ప్రాధాన్యత అని మంత్రి దుర్గేష్ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలో పెద్ద పులి సంచారంపై ఆందోళన అక్కర్లేదని, పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ట్రాప్, డ్రోన్ కెమెరాలు, బోనులు ఏర్పాటు చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రజలకు సూచించారు. మంగళవారం కేబినెట్ అనంతరం మంత్రి దుర్గేష్ ఈ విషయమై జిల్లా అటవీ శాఖ అధికారితో ఫోన్ లో మాట్లాడారు. పులి సంచారానికి సంబంధించిన తాజా సమాచారాన్ని అడిగి తెలుసుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. గత కొన్ని రోజులుగా తొర్రేడు, సీతానగరం సమీపంలో పులి సంచరిస్తుందని, దాని ఆనవాళ్లు గుర్తించామని, త్వరలోనే పట్టుకుంటామని అధికారి చెప్పారన్నారు. గతంలో ఇదే ప్రాంతంలో ఒకసారి పులి సంచారం చేసిందని మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. తగిన జాగ్రత్తలు తీసుకొని త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు తక్షణమే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వెంటనే సంబంధిత ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అటవీ శాఖ పులిని పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని ఈ సందర్భంగా పెద్దపులి పట్టుబడేంత వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లొద్దని, రాత్రి సమయాల్లో పశువుల పాక చుట్టూ ఎక్కువ కాంతినిచ్చే దీపాలు ఏర్పాటు చేసుకోవాలని మంత్రి దుర్గేష్ సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, ప్రజల రక్షణే తమ ప్రాధాన్యత అని మంత్రి దుర్గేష్ తెలిపారు. త్వరితగతిన పులిని పట్టుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు మంత్రి దుర్గేష్ ప్రజలకు భరోసానిచ్చారు.
Prajavartha Online Telugu News