Breaking News

విద్యార్థి సంఘ నేతలను కిడ్నాప్ చేసిన మోహన్‌బాబు యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలి

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
తిరుపతి జిల్లాలోని మోహన్‌బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలు, ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరుతూ శాంతియుత ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘ నేతలను యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లు అడ్డుకుని, కొట్టి, కిడ్నాప్ చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. కిడ్నాప్‌కు పాల్పడిన మోహన్‌బాబు యూనివర్సిటీపై చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఈశ్వరయ్య నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. తిరుపతి జిల్లాలోని మోహన్‌బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీని, అక్రమాలను అరికట్టాలని కోరుతూ విద్యార్థి సంఘాలు పదే పదే ఆందోళనలు చేస్తున్నాయి. మోహన్‌బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుండి రూ.26 కోట్లు అధికంగా ఫీజులు వసూలు చేసిందని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమీషన్ స్పష్టం చేస్తూ, యూనివర్సిటీ అక్రమంగా వసూలు చేసిన రూ.26 కోట్లు వెంటనే విద్యార్థులకు చెల్లించాలని ఆదేశించింది. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేయడంపై యూనివర్సిటీకి రూ.16 లక్షలు జరిమానా విధించింది.
అయినప్పటికీ మోహన్‌బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ ఆగలేదు. దీంతో ఎఐఎసఎఫ్, ఎసఎఫఐ, ఎనఎస్‌యుఐ వంటి పలు విద్యార్థి సంఘాలు ఈరోజు తిరుపతి కలెక్టరేట్ వద్ద శాంతియుత ఆందోళనకు పిలుపునిచ్చాయి. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో మోహన్‌బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లు, గూండాలు దాదాపు 40 మంది కార్లలో వచ్చి, ఎసఎఫఐ జిల్లా కార్యదర్శి అక్బర్, జిల్లా నాయకులు వినోద్‌లను నిర్భంధించి, వారి ద్విచక్ర వాహనాన్ని పడదోసి, వాళ్లని కొట్టి, కారులో బలవంతంగా ఎక్కించుకుని కిడ్నాప్ చేయడం జరిగింది. మోహన్‌బాబు యూనివర్సిటీ బౌన్సర్ల దురాగతాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థులకు, విద్యార్థి సంఘ నాయకులకు ఏమాత్రం ప్రాణహాని జరిగినా అందుకు మోహన్‌బాబే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నాం.
రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరినొకరు తిట్టుకుంటుంటే, ప్రైవేట్ శక్తులు చట్టాన్ని అతిక్రమిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. దౌర్జన్యాలు, బెదిరింపులు, కిడ్నాప్‌లతో బెంబేలెత్తిస్తున్నాయి. చట్టాలను అతిక్రమిస్తున్నాయి. రాష్ట్ర విద్యాశాఖామంత్రి శ్రీ నారా లోకేష్ విద్యా వ్యవస్థలో, ప్రైవేటు యూనివర్సిటీలలో లోపాలను, అక్రమాలను ఏమాత్రం పట్టించుకోకుండా, రెడ్‌బుక్‌ను వెంటబెట్టుకుని తిరుగుతున్నట్లుగా ఉంది. మోహన్‌బాబు యూనివర్సిటీ అక్రమాలపై గతంలో శ్రీ నారా లోకేష్‌కు తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడం విచారకరం. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మోహన్‌బాబు యూనివర్సిటీ వంటి ప్రైవేటు యూనివర్సిటీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఫలితంగా విద్యార్థుల భవిత ప్రశార్థకమయ్యే ప్రమాదముంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ ఘటనపై స్పందించాలి. చట్టాలను తోసిరాజని మోహన్‌బాబు యూనివర్సిటీ చేస్తున్న ఫీజుల దోపిడీ అక్రమాలను అరికట్టాలి. విద్యార్థి నేతలను కొట్టి, కిడ్నాప్ చేసిన బౌన్సర్లను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలి. విద్యార్థి సంఘ నేతలకు రక్షణ కల్పించి, ఇటువంటి ఘటనలు పునరావతం కాకుండా చూడాలి. విద్యార్థి సంఘాల నేతలను కిడ్నాప్ చేసిన మోహన్‌బాబు యూనివర్సిటీపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *