-రచయిత – కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ ఏడాది జరుగుతున్న ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం మన దేశ విద్యా ప్రయాణంలో ఒక నిశ్శబ్దమైన, చాలా బలమైన మార్పును తీసుకొస్తోంది. ప్రధానమంత్రి నాయకత్వంలో 2018లో ఒక చిన్న సమావేశంగా మొదలైన ఈ కార్యక్రమం, నేడు ప్రజలందరూ భాగస్వాములయ్యే ఒక పెద్ద ఉద్యమంగామారింది. విద్యార్థుల సంపూర్ణ ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కూడా ఇందులో ముఖ్యమైన భాగస్వాములయ్యారు.
ఈసారి ఏకంగా 4.5 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు జరగి, మునుపటి గిన్నిస్ వరల్డ్ రికార్డును అధిగమించడం, ఈ కార్యక్రమం కేవలం ప్రభుత్వం చేసేది కాదని, ప్రజలందరూ తమ సొంత బాధ్యతగా తీసుకున్నారని అర్థమవుతోంది. ప్రతి చిన్నారి స్వేచ్ఛగా నేర్చుకుని, వృద్ధితో వికసించేందుకు తగిన అనుకుాల వాతావరణాన్ని కల్పించాలనే మనందరి నిబద్ధతకు ఇది ఒక నిదర్శనం.
విద్యార్థులతో చదువు, అభ్యాసించడం, పరీక్షల ఒత్తిడి గురించి ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించే తీరులో ఆయన నాయకత్వ లక్షణాలు, సానుభూతి స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన ఎంతో సామాన్యంగా, క్రమశిక్షణతో, ఆశావహ దృక్పథంతో ఉంటూనే.. యువ మేధా శక్తిపై నమ్మకాన్ని కలిగిస్తారు. ఒక ప్రధానిలా కాకుండా, ఒక ఆత్మీయమైన గురువులా, మార్గదర్శిలా పిల్లలతో ఆయన కలిసిపోయే తీరు అద్భుతం. ఆయన మాటల్లో ఉండే ఆత్మీయత, చమత్కారం, నిజాయితీ వల్ల విద్యార్థులకు తమ బాధలు చెప్పుకోవచ్చనే ధైర్యం కలుగుతుంది. తన జీవితంలోని అనుభవాలను ఉదాహరణలుగా చెబుతూ.. పట్టుదల, ఏకాగ్రత మరియు సమస్యలను తట్టుకుని నిలబడటం గురించి ఆయన వివరిస్తారు. దీనివల్ల పరీక్షలంటే ఉండే భయం పోయి, పిల్లల్లో ఒక భరోసా కలుగుతోంది.
ప్రతి చిన్నారి ప్రత్యేకమైనదని గుర్తించడమే ఈ ప్రయత్నంలోని అసలైన ఉద్దేశం. ప్రతి చిన్నారి నేర్చుకునే విధానం వేరుగా ఉండటంతోపాటు వారి ఎదుగుదల్లో వేగం కూడా వేరుగా ఉంటుంది. వారి ప్రతిభను కేవలం ఒక పరీక్ష మార్కుతోనో లేదా ర్యాంకుతోనో కొలవలేము. పరీక్షలు అనేవి పిల్లల లోపల ఉన్న అనంతమైన శక్తుల్లో ఒక చిన్న భాగాన్ని మాత్రమే చూపిస్తాయి. నిజమైన సృజనాత్మకత అనేది పిల్లల సంపూర్ణ ఎదుగుదలలోనే బయటకు వస్తుంది. ఒక విద్యార్థి లెక్కల్లో మెరుగ్గా ఉండొచ్చు, మరొకరికి కళలంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకొకరికి ఇతరుల బాధను అర్థం చేసుకుని సేవ చేసే గుణం ఉండొచ్చు. ఈ తేడాలు లోపాలు కావు, అవే బలమైన మన సమాజానికి పునాదులు.
జాతీయ విద్యా విధానం-2020
ఈ ఆలోచనా విధానమే జాతీయ విద్యా విధానం (NEP-2020)లో కూడా కనిపిస్తుంది. బోధనా పద్ధతులు, సిలబస్ మరియు పరీక్షల విధానాన్ని పిల్లల అవసరాలకు తగ్గట్టుగా ఉన్నాయి. కేవలం చదువులు మార్కుల కోసం కాకుండా పిల్లల్లో సృజనాత్మకత, ఆలోచనా శక్తి, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, శారీరక దృఢత్వం మరియు నైతిక విలువలను పెంచేలా ఈ విధానం ఉంది. చిన్న వయసులో ఆడుకుంటూ నేర్చుకునే పద్ధతి వల్ల పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రాథమిక దశలో మాతృభాషలో బోధించడం వల్ల పిల్లలు విషయాలను బాగా అర్థం చేసుకోగలరు. అలాగే మన సంస్కృతిని గౌరవిస్తూనే, ప్రపంచ స్థాయి జ్ఞానాన్ని పొందేలా అనేక భాషలను నేర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తున్నాము.
పరీక్షల విధానంలో కూడా మార్పులు తెచ్చాము. మొదటిసారిగా 10వ తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించనున్నాము. దీనివల్ల విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకే పరీక్షపై ఉండే ఒత్తిడి తగ్గుతుంది. కేవలం మార్కులు మాత్రమే కాకుండా, విద్యార్థుల ప్రవర్తన మరియు ఎదుగుదలను తెలిపే ‘360 డిగ్రీల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్’ను ప్రవేశపెట్టాము. పిల్లల మానసిక ఆరోగ్యం కోసం ప్రతి సీబీఎస్ఈ పాఠశాలలో కౌన్సెలర్లను నియమించడం తప్పనిసరి చేశాము. పిల్లలను ఒకే మూస విధానంలో ఉండేలా కాకుండా, వారిలో ఉన్న ప్రత్యేకతలను గుర్తించి ప్రోత్సహించడమే మా బాధ్యత.
చదువు అంటే కేవలం పుస్తకాలు, పరీక్షలు, బట్టీ పట్టడం మాత్రమే కాదు. నేటి కాలంలో 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కోవాలంటే పిల్లలకు మానసిక ప్రశాంతత ముఖ్యం. భయం, ఆందోళనల మధ్య పిల్లలు సరిగ్గా నేర్చుకోలేరు. అందుకే మన భారతీయ సంప్రదాయాలైన యోగా, ప్రాణాయామం వంటి పద్ధతులు ఎంతో అవసరం. ఇవి పిల్లల్లో ఏకాగ్రతను, ప్రశాంతతను పెంచుతాయి. ఇవి కేవలం పరీక్షలకే కాదు, జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి, ప్రకృతితో మమేకం కావడానికి అవసరమైన జీవన నైపుణ్యాలను, విజ్ఞానాన్ని కూడా అందిస్తాయి.
నేటి కాలంలో మన ముందు ఉన్న అతిపెద్ద సవాలు.. అతిగా డిజిటల్ పరికరాలను, ఫోన్లను వాడటం. ఫోన్లు, స్క్రీన్ల ముందు గంటల తరబడి గడపడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత తగ్గుతోంది, నిద్ర లేమి, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ వల్ల నిరంతరం ఇతరులతో పోల్చుకుంటూ పిల్లలు పరీక్షల సమయంలో ఇంకా ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలి. ఫోన్ వాడకానికి కొన్ని పరిమితులు విధించి, పిల్లలు ఆరుబయట ఆడుకునేలా, కుటుంబంతో గడిపేలా ప్రోత్సహించి మళ్ళీ వారిలో తిరిగి ఉత్సాహాన్ని నింపాలి.
వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రతి రంగంలోనూ ప్రతిభావంతులు కావాలి. పిల్లలు తమకు నచ్చిన రంగంలో స్వేచ్ఛగా ఎదిగినప్పుడే దేశం పురోగమిస్తుంది. నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో కొత్త విషయాలను కనుగొనడం చాలా సులభమైంది. ఒక గురువుగా, తల్లిదండ్రులుగా మన బాధ్యత పిల్లలకు సరైన మార్గం చూపడం. వారికి అవసరమైన వసతులు కల్పిస్తూనే, ప్రయోగాలు చేసే స్వేచ్ఛను ఇవ్వాలి. ఓడిపోయినా భయపడకూడదని వారికి నేర్పించాలి. నేటి విద్యార్థులే 2047 నాటికి వికసిత భారత్ రూపశిల్పులు. భయం లేకుండా నేర్చుకునే, ఆత్మవిశ్వాసంతో కొత్త విషయాలను కనిపెట్టే పిల్లలే దేశ భవిష్యత్తును మారుస్తారు. వారి మేధస్సుకు, మనసుకు, చేతులకు పని కల్పించే విద్యా వ్యవస్థ మనకు కావాలి. పరీక్షల భయాన్ని పోగొట్టి, పిల్లలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దడమే ‘పరీక్షా పే చర్చా’ వెనుక ఉన్న అసలు ఉద్దేశం.
Prajavartha Online Telugu News