మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ముందస్తు వైద్య పరీక్షలతో క్యాన్సర్ ను అరికట్టగలమని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ, మచిలీపట్నం జిజిహెచ్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని కోనేరు సెంటర్ నుండి బెల్ కంపెనీ వరకు వైద్య కళాశాల విద్యార్థులు, వైద్యాధికారులు, వైద్యులు తదితరులతో కలసి నిర్వహించిన అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఖైనీ గుట్కా నమలొద్దు.. క్యాన్సర్ బారిన పడొద్దు, ముందస్తు పరీక్ష .. క్యాన్సర్ కు రక్ష, కలిసి పోరాడుదాం.. క్యాన్సర్ ను ఓడిద్దాం అంటూ జిల్లా కలెక్టర్ వారి చేత పలు నినాదాలు చేయిస్తూ ర్యాలీగా సాగారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం, నివారించడం, చికిత్స చేయడం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పాటిస్తామని తెలిపారు.
క్యాన్సర్ దేశంలో అతి వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రమాదకరమైన జబ్బు అని పేర్కొంటూ అసంక్రమిత వ్యాధులు (నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్) అంటే ఒక వ్యక్తి నుండి మరొకరికి నేరుగా సంక్రమించని గుండె జబ్బులు, క్యాన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, మధుమేహం వంటి వ్యాధులలో ఇది ప్రథమ స్థానంలో ఉందన్నారు. ముందస్తు పరీక్ష ద్వారా ఈ క్యాన్సర్ ను అరికట్టగలమని చెబుతూ, తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడితే గనుక అభివృద్ధి చెందిన అత్యాధునిక వైద్య చికిత్స పద్ధతులతో రోగి జీవితకాలం గణనీయంగా పెంచవచ్చన్నారు. అలాకాకుండా అవగాహన రాహిత్యంతో క్యాన్సర్ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరిస్తూ తొలి దశలోనే గుర్తించి ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గత సంవత్సరం బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి కృషి, బెల్ కంపెనీ వారి సౌజన్యంతో క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఒక ప్రత్యేక మొబైల్ బస్సును ఏర్పాటు చేశామని, ఇది ఇప్పటికే జిల్లాలోని పలు మండలాల్లోని గ్రామాలలో 31 ప్రాంతాలలో తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. దీని ద్వారా ఇప్పటి వరకు దాదాపు రెండు వేలకు పైగా వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 110 మందిని హయ్యర్ సెంటర్ కు రిఫర్ చేయడం జరిగిందని, వారిలో 28 మందికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, వ్యాధి చివర దశలో ఉన్న వారందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో మచిలీపట్నం జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆశాలత, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, ఆర్ ఎం ఓ డాక్టర్ నిరంజన్, నర్సింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వరలక్ష్మి, ఎంబిబిఎస్ కళాశాల వసతి గృహ వార్డెన్ డాక్టర్ నవీన్ చౌదరి, వైద్య కళాశాల విద్యార్థులు, వైద్యులు, వైద్య సిబ్బంది, ఫిజికల్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News