-ఉత్తీర్ణత శాతం పెంచితే డిసివోలు, ప్రిన్సిపాళ్లకు సన్మానాలు, ఉత్తీర్ణతా శాతం తగ్గితే మెమోలు
-మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
-అంబేద్కర్ గురుకులాల డీసీవోలు, ప్రిన్సిపాళ్ళతో మంత్రి డా. స్వామి జామ్ వీడియో కాన్ఫరెన్స్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
డా.బి ఆర్ అంబేద్కర్ గరుకులాల్లో 100 శాతం ఉత్తీర్ణత,100 శాతం అడ్మిషన్లే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం తాడేపల్లి APSWREIS కార్యాలయంలో డీసీవోలు, ప్రిన్సిపాళ్ళతో మంత్రి జామ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పది, ఇంటర్ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధం, వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్లపై సుమారు 3 గంటల పాటు ఈ సమావేశంలో మంత్రి సమీక్షించారు. పాఠశాలల వారీగా ఎంత మంది విద్యార్థులు పాస్ అవుతారు, ఎంతమంది విద్యార్థులు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…ప్రతి పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి. ఉత్తీర్ణత శాతం పెంచితే డిసివోలు, ప్రిన్సిపాళ్లకు సన్మానాలు చేస్తాం, ఉత్తీర్ణతా శాతం తగ్గితే మెమోలు జారీ చేస్తాం. వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్లపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలి. ప్రభుత్వ కార్యాలయాలు, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. అడ్మిషన్ల పెంపునకు ఆయా జిల్లాల కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేల సహకారం తీసుకోవాలి. పేద విద్యార్థుల భవిష్యత్తు, సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రస్తుతం ఉన్న నీట్, ఐఐటీ ఎక్సలెన్సీ సెంటర్లను మరిన్ని ఏర్పాటు చేస్తాం. ప్రిన్సిపాళ్లు విద్యార్థుల చేత ఎంసెట్, ఐఐటీ, నీట్, పలు ప్రఖ్యాత యూనివర్సిటీలకు దరఖాస్తులు చేయించాలి. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సిబ్బంది బాద్యతయుతంగా పనిచేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కృషి చేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఈ సమావేశంలో APSWREIS సెక్రటరీ IAS వి. ప్రసన్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News