-కేంద్ర ఆర్ధిక శాఖ జారీ చేసిన గెజిట్ కు మద్దతు తెలిపిన ఏపీ
-రాష్ట్రంలోని పొగాకు రైతులు, చిరువ్యాపారులకు ప్రయోజనమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎలాంటి బ్రాండ్ లేని ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని సున్నాకు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. ఇది రాష్ట్రంలో జరిగే అన్ బ్రాండెడ్ పొగాకు వాణిజ్యానికి ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈమేరకు కేంద్ర ఆర్ధిక శాఖ జారీ చేసిన గెజిట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. శుద్ధి చేయని పొగాకుకు(హెచ్ఎస్ కోడ్ 2401) వర్తించే సుంకం విధానాన్ని స్పష్టం చేస్తూ ఆర్ధిక శాఖ ఈ గెజిట్ ను జారీ చేసింది. ఇక నుంచి అన్ బ్రాండెడ్ పొగాకు రీటైల్ విక్రయాలకు ఎక్సైజ్ సుంకం సున్నా గా పేర్కొంటూ ఈ గెజిట్ ను కేంద్రం విడుదల చేసింది. పొగాకు విక్రయాలపై పన్నుల విషయంలో ఏకరూపత, స్పష్టత, పారదర్శకంగా ఉండేలా ఈ గెజిట్ ను కేంద్ర ఆర్ధిక శాఖ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కీలకమైన ముందడుగని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో ఎలాంటి బ్రాండ్ లేని బల్క్ పొగాకు క్రయ విక్రయాలు, వాణిజ్యానికి స్పష్టమైన తేడా లేకపోవటంతో చట్టంలోని వేర్వేరు నిబంధనల కారణంగా ఇబ్బందులు తలెత్తేవి. ఈ తరహా అస్పష్ట విధానాల కారణంగా రైతులు, వ్యాపారులు నష్ట పోతున్న నేపథ్యంలో అన్ బ్రాండెడ్ ఉత్పత్తుల సుంకాన్ని సున్నా శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ గెజిట్ ద్వారా ఎక్సైజ్ డ్యూటీ విధింపులో వేర్వేరు వర్గీకరణల వల్ల జరిగే ఇబ్బందులు తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పొగాకు రైతులందరికీ మేలు చేసే నిర్ణయమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రైతులకు మంచి ధర దక్కటంతో పాటు వ్యాపారులకు, ఎగుమతులకు కూడా ప్రయోజనం చేకూర్చనుందని వివరించారు. స్పష్టమైన మార్గదర్శకాలు, నిబంధనల కారణంగా ఎక్సైజ్ డ్యూటీ ఎగవేత గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తప్పుడు మార్గాల్లో పన్ను ప్రయోజనాలు పొందకుండా అడ్డుకునేలా ఉన్న ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థిస్తుందని అన్నారు. ఈ నోటిఫికేషన్‌ను దేశవ్యాప్తంగా ఒకేలా కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచే ఈ మార్పులు అమలు
పొగాకు హెచ్ఎస్ 2401 కోడ్ కిందకు వచ్చే బ్రాండ్ లేని, రీటైల్ విక్రయాలకు కోసం ప్యాక్ చేయని పొగాకు ఉత్పత్తులకు సున్నా శాతం ఎక్సైజ్ సుంకం వర్తించనుంది. రైతులు సంచులలో విక్రయించే పొగాకు ఈ పరిధిలోకి రానుంది. ఇక దుకాణాల కోసం చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసిన పొగాకు ఉత్పత్తులకు, కంపెనీ బ్రాండ్ పేరు ముద్రించిన పొగాకు సంచులు, ప్యాకెట్లకు కూడా 18 శాతం ఎక్సైజ్ సుంకం వర్తిస్తుందని కేంద్ర ఆర్ధిక శాఖ తన గెజిట్ లో పేర్కొంది. ఎక్సైజ్ సుంకంలో తాజా మార్పులతో ముడి పొగాకు సరఫరా వ్యవస్థకు ఉపశమనం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వాణిజ్య ప్రయోజనాల కోసం విక్రయించే ఉత్పత్తుల నుంచి ప్రభుత్వ ఆదాయానికి కూడా ఇబ్బంది ఉండదని వెల్లడించింది. ముడి పొగాకు రీటైల్ విక్రయాలు పన్ను పరిధిలోకి వస్తుందా లేదా ప్యాకింగ్ వల్ల పన్ను రేటు మారుతుందా అన్న అంశాలపై నిబంధనలు అస్పష్టంగా ఉండేవని.. ప్రస్తుత గెజిట్ నోటిఫికేషన్ తో సందేహాలు తొలగిపోయాయని ఆర్ధిక శాఖ వెల్లడించింది. బ్రాండ్ లేని ప్యాకింగ్ లేని పొగాకు రీటైల్ విక్రయాలపై 2026 ఫిబ్రవరి 1 తేదీ నుంచి సున్నా ఎక్సైజ్ సుంకం వర్తిస్తుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మిగిలిన పొగాకు ఉత్పత్తులన్నిటి పైనా 18 శాతం మేర ఎక్సైజ్ సుంకం వర్తిస్తుందని తద్వారా ఆడిటింగ్, బిల్లింగ్ సమయంలో తలెత్తే వివాదాలు తగ్గనున్నాయని ప్రభుత్వం తెలియచేసింది. ఈ నిర్ణయం ద్వారా రైతులు, చిరువ్యాపారులకు ప్రయోజనం కలుగనుంది. రైతులు సాగు చేసిన పొగాకును యథాతథంగా ఎలాంటి బ్రాండ్ లేకుండా సంచుల్లో బల్క్ గా విక్రయిస్తున్నందున దీనికి ఎలాంటి సుంకమూ ఇక వర్తించదని నోటిఫికేషన్ పేర్కొంది. తద్వారా వారికి నేరుగా ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో అస్పష్టమైన నిబంధనల వల్ల అధికారులు రైతులను కూడా ప్రశ్నించే పరిస్థితి ఉండేది. ప్రస్తుత నిర్ణయంతో రైతులకు ఇబ్బందులు తప్పాయి. బల్క్ పొగాకుపై ఎలాంటి పన్నూ లేకపోవటంతో రైతులకు మెరుగైన ధర కూడా లభించే అవకాశం ఉందని రాష్ట్రప్రభుత్వం తెలియచేసింది. దీంతో పాటు బ్రాండెడ్ ఉత్పత్తుల రీటైల్ విక్రయాల్లో ముడి పొగాకు పేరుతో జరిగే దుర్వినియోగానికి కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలు అడ్డుకట్ట వేయనున్నాయి.
Prajavartha Online Telugu News