– అత్యంత పారదర్శకంగా ప్రక్రియ
– కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ప్రత్యక్ష పరిశీలన
– ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం పాలసీ (2025-28) ప్రకారం జిల్లాలో అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో లాటరీ ద్వారా బార్ల కేటాయింపు జరుగుతోందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు తెలిపారు.
గురువారం జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బార్ల కేటాయింపునకు లాటరీ ప్రక్రియ జరిగింది. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ వారి ప్రత్యక్ష పరిశీలనలో ఈ ప్రక్రియ పూర్తయింది. ఈ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో మిగిలిపోయిన 55 బార్లకు నోటిఫికేషన్ ఇవ్వగా తాజాగా 21 బార్లను లాటరీ ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్తో పాటు కొండపల్లి, తిరువూరు మునిసిపాలిటీల పరిధిలోని ఈ బార్లకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి, అర్హత ఉన్న వాటికి దరఖాస్తుదారుల సమక్షంలో ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో లాటరీ ద్వారా బార్లను కేటాయించినట్లు టి.శ్రీనివాసరావు వివరించారు.
కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్.శ్రీనివాసరావు, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్వీ రామశివ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News