– ఆర్థిక స్వావలంబనకు ఈ కేంద్రంతో దిశానిర్దేశం
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజ సమగ్రాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, ముఖ్యంగా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగినప్పుడు ఆర్థిక స్వావలంబనతో పాటు కుటుంబ, సమాజ ప్రగతి వేగవంతమవుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
గుంటుపల్లిలోని రూరల్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ సెంటర్ (రైజ్)ను కలెక్టర్ లక్ష్మీశ గురువారం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక రంగ ప్రతినిధులతో కలిసి సందర్శించారు. మహిళలను ఆర్థిక సాధికారత దిశగా నడిపించేందుకు ఏర్పాటుచేసిన ఈ కేంద్ర కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల్లోని ఆసక్తి ఉన్న మహిళలకు కూడా అవసరమైన శిక్షణ ఇచ్చి పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు ద్వారా తమతో పాటు మరో పదిమందికి ఉపాధి ఇవ్వగలిగే స్థాయికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. మహిళలు పారిశ్రామిక రంగంలోకి వస్తే ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా స్థానిక వనరుల సమర్థ వినియోగం జరుగుతుందని అన్నారు. దీనివల్ల గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో సమతుల్య అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. ఈ దిశగా ప్రభుత్వం మహిళలకు బలమైన చేయూతనందిస్తూ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు రుణ సదుపాయాలు, సబ్సిడీలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెటింగ్ సహాయం వంటి అనేక ప్రయోజనాలను కల్పిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, సీపీవో వై.శ్రీలత, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు, ఏబీపీ బ్లాక్ కోఆర్డినేటర్ పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)
Prajavartha Online Telugu News