Breaking News

2027 నాటికి పోలవరం పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతిలో ఘనంగా జరిగిన సాగునీటి వినియోగదారుల సంఘాల సమావేశంలో పాల్గొన్న గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి కందుల దుర్గేష్
-పడకేసిన నీటిపారుదల రంగానికి సీఎం చంద్రబాబు జవజీవాలు అందించారని వెల్లడి
-నదుల అనుసంధానంతోనే రాష్ట్ర సస్యశ్యామలం అవుతుందని తెలిపిన మంత్రి దుర్గేష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రైతాంగ శ్రేయస్సే ధ్యేయంగా నదుల అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే దక్కుతుందని రాష్ట్ర పర్యాటక మంత్రి, గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. గురువారం అమరావతి పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సాగునీటి వినియోగదారుల సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖపై కనీస అవగాహన లేని మంత్రులను చూశామని, నేడు 24 గంటలు కష్టపడే మంత్రి నిమ్మల రామానాయుడు నేతృత్వంలో నీటిపారుదల శాఖ పరుగులు పెడుతోందని హర్షం వ్యక్తం చేశారు. గతంలో ‘సోమవారం-పోలవరం’ కార్యక్రమం ద్వారా ప్రాజెక్టును పరుగులు పెట్టించిన చంద్రబాబునాయుడు, 2027 నాటికి పోలవరం పూర్తి చేసి తీరాలన్న పట్టుదలతో ఉన్నారని తెలిపారు.కూటమి ప్రభుత్వం నీటిపారుదల వ్యవస్థను గాడిలో పెట్టి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తూ పూర్తి చేస్తోందని తెలిపారు. ఈ క్రమంలో గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం ద్వారా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను సుసంపన్నం చేస్తున్నామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. నదుల అనుసంధానం వల్లే నేడు అనంతపురం జిల్లా కోనసీమను మించిన ప్రగతిని సాధిస్తోందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ సహకారం అందిస్తూ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా నీటి సరఫరా రంగంలో విశేషమైన ప్రగతిని సాధిస్తున్నారని కొనియాడారు. అనివార్య కారణాల వల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సభకు రాలేకపోయారని, వారి ప్రతినిధిగా తాను హాజరైనట్లు తెలిపారు.

తుంగభద్ర డ్యామ్ 19వ గేట్ కొట్టుకుపోయినప్పుడు సీఎం చంద్రబాబునాయుడు తక్షణమే స్పందించి, మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌లను పంపించి కేవలం 5 రోజుల్లోనే సమస్యను పరిష్కరించడం అసామాన్యమని కొనియాడారు. 786 కిలోమీటర్ల పొడవైన హంద్రీనీవా కాలువను బాగు చేసే పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 6,047 నీటి సంఘాలు, 267 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 58 ప్రాజెక్టు కమిటీలు అత్యంత బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నీటి యాజమాన్య నిర్వహణ, చెరువులు నింపడం, భూగర్భ జలాల పెంపు వంటి అంశాల్లో సీఎం చంద్రబాబునాయుడు దిశానిర్దేశం ప్రకారం పనిచేసి ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేయడంలో భాగస్వాములు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ మాధవ్, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నీటి సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

*జారీ చేసిన వారు: పీఆర్ఓ, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు*

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *