-ఎపీలో ఇన్నోవేటివ్ స్కీమ్ కింద 74 హోస్ట్ ఇన్స్టిట్యూట్లకు ఆమోదం, 36 సంస్థలకు నేరుగా మద్దతు
-కేంద్ర ఎమ్.ఎస్.ఎమ్.ఈ, కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే వెల్లడి
-ఎమ్.ఎస్.ఎమ్.ఈ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్.ఎస్.ఎమ్.ఈ చాంపియన్స్ పథకం కింద అమలు చేస్తున్న ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇన్నోవేటివ్ స్కీమ్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో 74 హోస్ట్ ఇన్స్టిట్యూట్లు ఆమోదం పొందగా, 36 సంస్థలకు నేరుగా మద్దతు లభించి, మొత్తం 129 ఇన్నోవేటివ్ ఆలోచనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర ఎమ్.ఎస్.ఎమ్.ఈ, కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. దేశవ్యాప్తంగా 773 హోస్ట్ ఇన్స్టిట్యూట్లు ఆమోదించబడ్డాయని, వీటిలో 410 సంస్థలకు నేరుగా మద్దతు అందుతోందని, ఇప్పటివరకు 1,418 ఇన్నోవేటివ్ ఆలోచనలకు ఆమోదం లభించిందన్నారు.
లోక్ సభలో గురువారం ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్.ఎస్.ఎమ్.ఈ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలపై కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖను ప్రశ్నించగా,కేంద్ర ఎమ్.ఎస్.ఎమ్.ఈ, కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఎమ్.ఎస్.ఎమ్.ఈ లపై అనుసరణ భారం తగ్గింపే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.డిజిటలైజేషన్, నియంత్రణ సరళీకరణ, ఇన్నోవేషన్ ద్వారా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను బలోపేతం చేసే దిశగా పలు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఎమ్.ఎస్.ఎమ్.ఈ లపై నియంత్రణ నిబంధనలు, పన్నులు, నాణ్యత ప్రమాణాలు, నివేదికల బాధ్యతల వల్ల ఏర్పడుతున్న అనుసరణ భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటలైజేషన్ తో పాటు నియంత్రణ సరళీకరణ చర్యలను విస్తృతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఎమ్.ఎస్.ఎమ్.ఈ ల నమోదు ప్రక్రియను సులభతరం చేయడానికి 01 జూలై 2020న ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రారంభించామని, ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో, కాగితరహితంగా, స్వీయ ప్రకటన ఆధారంగా జరుగుతోందని కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే వివరించారు. అలాగే అసంఘటిత సూక్ష్మ పరిశ్రమలను అధికారిక వ్యవస్థలోకి తీసుకురావడానికి 11 జనవరి 2023న ఉద్యోగం అసిస్ట్ ప్లాట్ఫామ్ ప్రారంభించామని, దీని ద్వారా ఈ సంస్థలు ప్రాధాన్య రంగ రుణాల లాభాలు పొందుతున్నాయని తెలిపారు.
2012 నాటి ప్రజా కొనుగోలు విధానంలో అనుసరణల సంఖ్యను 7 నుండి 4కి తగ్గించామని, ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ (GeM) పోర్టల్ ద్వారా ఎమ్.ఎస్.ఎమ్.ఈ లకు ప్రభుత్వ కొనుగోళ్లలు మరింత సులభతరంగా జరిగాయని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ శాఖల అనుమతి ప్రక్రియలను ఒకే ప్లాట్ఫామ్లో కలిపే విధంగా నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ అభివృద్ధి చేయబడిందని తెలిపారు.
రూ.40 లక్షల వరకు సరుకుల సరఫరాకు, రూ.20 లక్షల వరకు సేవల సరఫరాకు జి.ఎస్.టి నమోదు అవసరం లేదని, కాంపోజిషన్ స్కీమ్, త్రైమాసిక రిటర్న్లు వంటి విధానాలు ఎమ్.ఎస్.ఎమ్.ఈ లకు భారీ ఉపశమనం కలిగిస్తున్నాయని మంత్రి తెలిపారు.
దేశ వ్యాప్తంగా 31 జనవరి 2026 నాటికి 7.61 కోట్లకు పైగా ఎమ్.ఎస్.ఎమ్.ఈ లు నమోదు అయ్యాయని, వీటి ద్వారా సుమారు 33.5 కోట్ల మందికి ఉపాధి లభిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. స్టార్టప్ ఇండియా (Startup India), అటల్ ఇన్క్యుబేషన్ కేంద్రాలు (Atal Incubation Centres), ఎస్.టి.పి.ఐ (STPI), టి.పి.డి.ఈ 2.0 (TIDE 2.0, ), బి.ఐ.ఆర్.ఎ.సి (BIRAC), ఎ.ఎస్.పి.ఐ.ఆర్.ఈ (ASPIRE) వంటి పథకాల ద్వారా ఐటీ ఆధారిత ఎమ్.ఎస్.ఎమ్.ఈలకు ఆర్థిక, సాంకేతిక, మెంటారింగ్ మద్దతు అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ విధానాలన్నింటి ద్వారా ఎమ్.ఎస్.ఎమ్.ఈ లకు సంబంధించిన కాల వ్యయం, ఆర్థిక భారం, పేపర్ వర్క్ గణనీయంగా తగ్గి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపడిందని తెలిపారు.
Prajavartha Online Telugu News