-సాగునీటి సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతీ ఎకరాకు సాగు నీరు అందేలా సాగునీటి సంఘాలు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. సాగు నీటి సంఘాలు చేసే పనులకు జీఎస్టీ లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఒకప్పుడు రైతు ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న ఏపీని సమర్థ పాలన, నిర్దిష్ట ప్రణాళికలతో రైతు సానుకూల రాష్ట్రంగా మార్చామని స్పష్టం చేశారు. గురువారం అమరావతిలోని నేలపాడు వద్ద ఉన్న పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన నీరు-ప్రగతి, జల హారతి సాగునీటి సంఘాల భాగస్వామ్యం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ముందుగా సమావేశ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన వివిధ ప్రాజెక్టుల నిర్మాణ పురోగతి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తూ….”మన జీవన విధానంలో నీరు చాలా ముఖ్యం. రాయలసీమలో ఊట కాల్వలు ఉండేవి. వాటిలో నీరు సమృద్ధిగా ఉండటంతో పంటలు పండేవి. కాలక్రమంలో నీటిపై నిర్లక్ష్యంతో సమస్యలు వచ్చాయి. సీమ ఎడారిగా మారుతుందని చాలామంది అనేవారు. సీమను రతనాల సీమ చేయాలని ఎన్టీఆర్ సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ సహా అనేక ప్రాజెక్టులు రావడానికి నాడు తెలుగుదేశం పార్టీ చూపిన చొరవే కారణం. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నీరు-చెట్టు వంటి కార్యక్రమాలు చేపట్టాం. భూగర్భ జలాలు పెంచేందుకు ఇంకుడు గుంతలు సహా అనేక కార్యక్రమాలు చేపట్టాం. దేశంలోనే తక్కువ వర్షపాతం నమోదయ్యే రెండో జిల్లాగా ఉన్న అనంతపురం నేడు పండ్ల తోటల వనంగా మారిందంటే అందుకు ప్రభుత్వ దూరదృష్టే కారణం. ఒక్క ఏడాదిలోనే 10 లక్షల ఇంకుడు గుంతలు తవ్వాం. మైక్రో ఇరిగేషన్ కింద 90 శాతం సబ్సిడీ ఇచ్చి పండ్ల తోటలకు శ్రీకారం చుట్టాం. రాయలసీమను రతనాల సీమగా చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిది. భవిష్యత్ లో సీమకు బంగారు భవిష్యత్ ఉంటుంది. హార్టికల్చర్ పై శ్రద్ధ పెట్టాం. నీటిని మనం సమర్థవంతంగా ఉపయోగించుకుంటే కరువు అనే మాటే వినపడదు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. పరిగెత్తే నీటిని నడిపించాలి. నడిచే నీటిని నిలబెట్టాలి. నిలిచిన నీటిని భూగర్భ జలాలుగా మార్చి భూమినే జలాశయంగా మార్చాలి. ఒకప్పుడు సీమ అంటే నీరు లేని ప్రాంతం. ఇప్పుడు కోస్తాంధ్రతో పోటీ పడి నీటి వృద్ధి చెందుతోంది.”అని సీఎం చెప్పారు.
*క్షేత్రస్థాయిలో సాగునీటి సంఘాల పనితీరు బాగుంది*
“ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేలా తాగు నీటి సంఘాల అధ్యక్షులు కృషి చేయాలి. సమర్థ నీటి వినియోగంలో రైతుల భాగస్వామ్యం కీలకం. ఈ ఉద్దేశంతోనే 1997లో దేశంలోనే మొదటిసారిగా సాగు నీటి సంఘాలు ఏర్పాటు చేశాం. ఈ వ్యవస్థ ద్వారా 14 లక్షల నీటి సంరక్షణ కట్టడాలు నిర్మించాం. ఎంతో ప్రాధాన్యత కలిగిన సాగునీటి సంఘాలు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురయ్యాయి. గత పాలకులు సాగునీటి సంఘాలు చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వంలో వారి బిల్లులన్నీ క్లియర్ చేశాం. 2024 డిసెంబర్లో 6,047 నీటి వినియోగదారుల సంఘాలకు, 267 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 58 ప్రాజెక్ట్ కమిటీలకు ఎన్నికలు నిర్వహించాం. నీటి సంఘాల అధ్యక్షులు పనులు సమర్థవంతంగా చేస్తున్నారు. నీటి వినియోగదారుల సంఘాలకు చెందిన ప్రతినిధులు 60 వేల మంది ఉన్నారు. సాగునీటి సంఘాల ప్రతినిధులంతా ఓ సైన్యం తలుచుకుంటే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయగలరు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.344 కోట్లతో 7,197 ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ పనులు రైతు సంఘాల ద్వారా చేపట్టాం. సాగు నీటి నిర్వహణ పనులను నామినేషన్ పద్దతిలో అప్పగించే పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. కాలువల నిర్వహణ, నీటి పన్నుల వసూలు, వివాదాల పరిష్కారంలో నీటి వినియోగదారుల సంఘాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. సాగునీటి సంఘాలు చేపట్టే పనులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తాం. సమర్థ నీటి నిర్వహణతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది నారు మళ్లకు మే 15 నాటికే నీరు అందిస్తాం.”అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
*ప్రతి ఎకరాకు నీరివ్వడమే నిజమైన జల హారతి*
“నదుల అనుసంధానం జరిగి, ప్రతి ఎకరాకు నీరు ఇవ్వగలిగితే అదే నిజమైన జల హారతి. 2014-19 మధ్య సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం. సాగునీటిపైనే రూ.68 వేల కోట్లు ఖర్చు చేశాం. వ్యవసాయానికి 900 టీఎంసీలు, పరిశ్రమలకు 40 టీఎంసీలు, తాగు నీటి కోసం 200 టీఎంసీల నీరు అవసరం. ప్రతీ ఏటా 1300 టీఎంసీల నీటితో మన రాష్ట్ర అవసరాలు తీరతాయి. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి వంటి 40 నదులు, 38 వేల చెరువులు ఉన్నాయి. వీటన్నిటిలో 1300 టీఎంసీలకు పైగా నీటిని నిల్వ చేసుకోగలం. ఈ ఏడాది 862 టీఎంసీల నీళ్లు మన జలాశయాల్లో ఉంది. మన ప్రాజెక్టులను ఈ ఏడాది గరిష్టంగా 91 శాతం మేర నింపాం. ప్రస్తుతం మన జలాశయాల్లో రూ. 846 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయి. ఏపీ జీవ నాడి పోలవరాన్ని గత ప్రభుత్వం గోదావరిలో కలిపేసింది. దుర్మార్గపు పాలనలో నిర్లక్ష్యం వల్ల డయాఫ్రాంవాల్ దెబ్బతిని అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు అయ్యింది. సమయం కూడా వృధా అయ్యింది.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2027 జూన్ కంటే ముందే పోలవరం కల సాకారమై జాతికి అంకితం చేస్తాం. పోలవరం పూర్తి చేశాక నదుల అనుసంధానం చేపడతాం. పట్టి సీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరిచ్చాం. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ మార్చి లోగా పూర్తి చేసి అనకాపల్లి, విశాఖకు నీరు అందిస్తాం. తారక రామ తీర్ధసాగర్ సహా అన్ని ప్రాజెక్టులు రాబోయే మూడేళ్లలో పూర్తి చేసి ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేస్తాం. గోదావరి నీళ్లు వంశ ధారకు అనుసంధానం చేస్తాం. పోలవరం నుంచి నీటిని నల్లమల సాగర్ కు తీసుకెళ్తాం. గత పాలకులు వెలిగొండ పూర్తి చేసినట్టు భ్రమ కల్పించారు. ఈ సీజన్ లోనే ప్రాజెక్టును పూర్తి చేసి కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం.”అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
*రాయలసీమ ఎత్తిపోతలతో మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నాలు*
“ఈ ఏడాది గోదావరి నుంచి 5000 టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోయింది. 200 టీఎంసీల వరద జలాలు పోలవరం నుంచి నల్లమల సాగర్ కు తీసుకొస్తాం. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మిస్తుంటే మేము ఏనాడు అడ్డు చెప్పలేదు. ఇదే తరహా స్పందనను తెలంగాణ నుంచి కోరుకుంటున్నాం. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు చిత్తూరు, మడకశిరకు తీసుకొచ్చాం. రాష్ట్రంలోని అన్ని చెరువులు నింపితే భూగర్భ జలాలు పెరుగుతాయి. అప్పుడు కరువు అనే మాట వినపడదు. మొన్నటి వరకూ ఇంజనీర్లే ప్రణాళికలు తయారు చేసేవారు. నేడు మన సాగునీటి సంఘాల అధ్యక్షులు ఇంజనీర్లు కావాలి. వినూత్న ఆలోచనలతో నీటి సమస్యలు పరిష్కారం చేయాలి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ చేసి మహాపాపం చేశారు. ఘోర అపచారం చేశారు. రసాయనాలతో నెయ్యి తయారు చేసి ప్రసాదంలో వినియోగించారని తేలింది. వారు చేసిన అపచారం క్షమార్హం కాదు. కూటమి అధికారంలోకి వచ్చాక 20 లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తున్నాయి. 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రధాని మోదీ, మిత్రుడు పవన్ కల్యాణ్ తో కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం. ఇతరులపై బురద చల్లటం వైసీపీకి అలవాటైంది. రాయలసీమ ఎత్తిపోతల ద్వ
ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి. రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకెళుతోంది. మిత్రుడు పవన్ కల్యాణ్ తో కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం. ఇతరులపై బురద వేయడం వైసీపీ వాళ్లకు అలవాటైంది. రాయలసీమ ఎత్తిపోతల అంశంతో మళ్లీ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రారంభించిన ఆ ప్రాజెక్టును ఎన్జీటీ నిలిపేసింది. అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు మళ్లీ
ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు ద్వారా అన్ని ప్రాంతాలకూ నీరసిస్తాం. బ్రహ్మంసాగర్, గండికోట, చెర్లోపల్లి తదితర ప్రాజెక్టులకు నీరు రావటం ఎన్డీఏ ఘనతే. సీమలో నీటి ఇబ్బందులు రాకుండా చూస్తాం. అని ముఖ్యమంత్రి అన్నారు. నీటి వినియోగదారుల సంఘాల సమావేశానికి మంత్రులు నిమ్మల రామానాయుడు, కె.అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సహా పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News