-గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధికి పూర్తి సహకారం
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
గిద్దలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ ఇచ్చారు. శుక్రవారం నాడు మంత్రి గొట్టిపాటి రవి కుమార్, స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తో పాటు మార్కాపురం జిల్లా గిద్దలూరులో పర్యటించారు. ఇందులో భాగంగా గిద్దలూరు నియోజకవర్గంలో వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా మార్కాపురం జిల్లాలో ఒంగోలు – నంద్యాల రోడ్డు నుంచి ఎల్. కోట వరకు రూ.50 లక్షలతో నిర్మించిన రహదారిని మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. అనంతరం తురిమెళ్ల పంచాయితీ పరిధిలోని తురిమెళ్ల గ్రామంలో రూ.50 లక్షలతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లను ప్రజలకు అంకితం చేశారు. అదే విధంగా కంభం – గిద్దలూరు ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి నర్సిరెడ్డి పల్లె గ్రామం వరకు రూ. కోటితో నిర్మించే తారురోడ్డుకు శంకుస్థాపన చేశారు. దీనితో పాటు కంభం – గిద్దలూరు ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి గౌతవరం గ్రామం వరకు రూ.73 లక్షలతో నిర్మాణం చేపట్టనున్న సిమెంట్ రోడ్డుకు కూడా మంత్రి గొట్టిపాటి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో పాటు అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News