Breaking News

2024-26 ఏపీ పర్యాటక రంగంలో స్వర్ణయుగం

-రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
-20 నెలల్లో రూ.30,000 కోట్ల పర్యాటక పెట్టుబడులు, 1.22 లక్షల ఉద్యోగాలు సృష్టించామని స్పష్టం
-“ప్రతి కుటుంబానికి ఒక పర్యాటక ఉద్యోగం” కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి
-సీఎం చంద్రబాబు సూచనలతో “హెల్తీ, వెల్తీ, హ్యాపీ” నినాదంతో అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతున్నామన్న మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం 2024-26 మధ్యకాలంలో ఒక అపూర్వమైన స్వర్ణ యుగాన్ని ఆవిష్కరించిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం చంద్రబాబునాయుడు సూచనలతో “హెల్తీ, వెల్తీ, హ్యాపీ” నినాదంతో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.2047కి వికసిత్ భారత్ గా దేశాన్ని చేయాలని ప్రధాని మోదీ ఆలోచన అయితే, 2047నాటికి ఏపిని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచన అని తెలిపారు. నాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీని అభివృద్ధి చేసి నేడు అమరావతిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన చేయడం గొప్ప విషయమన్నారు.

ఆర్థిక వృద్ధికి ఇంజిన్‌గా పర్యాటక శాఖ:మంత్రి కందుల దుర్గేష్

సీఎం నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థిక వృద్ధికి వెన్నెముకగా మారుస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. 2019-24 మధ్య గత ప్రభుత్వం కుదేలు చేసిన పర్యాటక రంగాన్ని ప్రస్తుతం పట్టాలెక్కిస్తున్నామని, నూతన పర్యాటక పాలసీ (2024-29) ద్వారా పారిశ్రామిక హోదా కల్పించామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సులో, సీఐఐ సదస్సులో వేలాది మంది ఇన్వెస్టర్లు పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారన్నారు. దీనివల్ల 117 ప్రఖ్యాత సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని, కేవలం 20 నెలల్లో ₹30,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని స్పష్టం చేశారు. హయత్, తాజ్, మారియట్, మేఫేర్ వంటి స్టార్ హోటళ్లు రాష్ట్రంలో నిర్మాణాలకు ముందుకు వచ్చాయన్నారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో పెట్టుబడులు రాలేదన్నారు.పర్యాటక రంగంపై కూటమి ప్రభుత్వ శ్రద్ధకు ఇవి నిదర్శనమన్నారు. సీఎం చంద్రబాబునాయుడు దూరదృష్టి, కళలు, భాష, పర్యాటక రంగంపై పట్ల ఆయనకు ఉన్న శ్రద్ధ, ఆయనకు సహకారం అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. పర్యాటక రంగం ద్వారా ఆర్థికాభివృద్ధితో పాటు ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పెట్టుకున్నామన్నారు.రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఇందులో ప్రధాన పాత్ర పర్యాటక రంగానిదే అన్నారు. చిన్న పెట్టుబడితో పదుల సంఖ్యలో ఉపాధి కల్పించే రంగం పర్యాటక రంగం అన్నారు. భవిష్యత్ అంతా టూరిజందే అన్న మంత్రి దుర్గేష్ ప్రస్తుతం తాము రైట్ ట్రాక్ లో ఉన్నామన్నారు.

నిధులు, ప్రాజెక్టుల వెల్లువ

రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా కేంద్ర ప్రభుత్వం నుండి 8 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ₹428 కోట్ల గ్రాంట్‌ను సాధించామని మంత్రి దుర్గేష్ వివరించారు.శాస్కి ద్వారా అఖండ గోదావరికి రూ.94.44 కోట్లు, గండికోట అభివృద్ధికి రూ. 77.91 కోట్లు, స్వదేశీ దర్శన్ 2.0 ద్వారా సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్లు, బొర్రా గుహల అభివృద్ధికి రూ.29.88 కోట్లు, ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్ మెంట్ స్కీమ్ ల ద్వారా అహోబిలం అభివృద్ధికి రూ.25 కోట్లు, నాగార్జున సాగర్ బౌద్ధ వారసత్వ కేంద్రాల అభివృద్ధికి రూ.25 కోట్లు, ప్రసాద్ ద్వారా అన్నవరం దేవస్థానంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.25.32 కోట్లు మంజూరు అయ్యాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో శరవేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా పుష్కర్ ఘాట్ అభివృద్ధి, హేవలాక్ వంతెన ఆధునికీకరణ, బ్రిడ్జిలంకలో సాహక క్రీడలు, కడియం నర్సరీలో ఎక్స్ పీరియన్స్ సెంటర్, నిడదవోలు కోట సత్తెమ్మ ఆలయం అభివృద్ధి, శెట్టిపేటలో బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.

విశాఖపట్నం, అరకు, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, తిరుపతి మరియు గండికోట వంటి 7 యాంకర్ హబ్‌లు, రాష్ట్రంలో 2 బుద్ధిస్ట్, 10 టెంపుల్, 5 బీచ్, 4 రివర్ క్రూయిజ్, 3 ఎకో, 2 సీ క్రూయిజ్, సీప్లేన్ టూరిజం సర్క్యూట్ లు తదితర 25కి పైగా థీమాటిక్ సర్క్యూట్లు, మరియు 90కి పైగా ప్రదేశాలలో అడ్వెంచర్ టూరిజంకు అనుమతులు లభించాయని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.కేరళ తరహాలో రాజమండ్రి, విజయవాడ సహా 8 ప్రాంతాల్లో హౌస్ బోట్లు, విశాఖ- చెన్నై- పుదచ్చేరికి కార్డెలియా క్రూయిజ్ సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు.సీప్లేన్ కు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తామని కేంద్రం తెలిపిందన్నారు. రాజమహేంద్రవరం, విజయవాడ తదితర ప్రాంతాల్లో నది లో కూడా క్రూయిజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీ క్రూయిజ్, హెలీ టూరిజం, కారవాన్ టూరిజం, టెంట్ సిటీలు మరియు హౌస్‌బోట్ సేవలను విస్తరించామన్నారు. 1,855 హోమ్‌స్టేలను అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్‌లతో అనుసంధానించామని, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాలో ఉన్న మండువా లోగిళ్లను దీని కింద అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రమంతటా ఈ తరహా విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. పర్యాటక శాఖ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ద్వారా రూ.115 కోట్ల వ్యయంతో 15 హరిత హోటళ్లను ఆధునీకరించి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామన్నారు. ఈ సందర్భంగా విశాఖలోని యాత్రినివాస్ ను ఉదహరించారు. అరకు కాఫీ తరహాలో ‘అరకు కౌని’ (చిరుధాన్యాల తాలీ)ని పర్యాటకులకు పరిచయం చేస్తున్నామన్నారు. ఈ విషయంలో అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రయత్నం అభినందనీయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 21 ప్రధాన పుణ్యక్షేత్రాలను గుర్తించి టెంట్ సిటీలు ఏర్పాటు చేసి యాత్రికులకు తక్కువ ఖర్చుకే వసతి కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు.

పెట్టుబడిదారులకు ఏపీలో అనువైన వాతావరణం

ప్రస్తుతం 27 ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ అనుమతులు లభించగా, 3 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, 12 పురోగతిలో ఉన్నాయని, 5 ప్రాజెక్టులు శంకుస్థాపనకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మరో 7 ప్రాజెక్టులకు భూ కేటాయింపులు పూర్తి అయ్యాయని అన్నారు.వీటన్నింటి ద్వారా 4,839 రూమ్స్ అందుబాటులోకి రానున్నాయని, ఐదేళ్లలో 50,000 రూమ్స్ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వీటి ద్వారా పర్యాటక రంగంలో 1,22,637 ఉద్యోగాల సృష్టికి మార్గం సుగమం చేశామన్నారు. 2025-26లో దేశవ్యాప్తంగా 11,272 రూమ్స్ ఏర్పాటైతే మూడింట ఒక వంతు హోటళ్లు ఏపీలోనే ఏర్పాటు కావడం కూటమి ప్రభుత్వంపై నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. నూతన పర్యాటక పాలసీ ప్రకారం ఇన్వెస్టర్లకు క్యాపిటల్ సబ్సిడీలు, ఎస్జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ మరియు స్టాంపు డ్యూటీ మినహాయింపు వంటి ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు. దీనికి తోడు పర్యాటక భూ కేటాయింపు విధానం, కారవాన్ టూరిజం పాలసీ, హోమ్‌స్టే మరియు బ్రెడ్ &బ్రేక్ ఫాస్ట్ పాలసీలను రూపొందించి, పెట్టుబడిదారులకు అనువైన వాతావరణాన్ని కల్పించాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ లో అనుమతులు ఇస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో పర్యాటక రంగానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయన్నారు.

సంస్కృతి – ఉత్సవాలు – పుష్కరాలు

రాష్ట్ర సంస్కృతిని చాటిచెప్పేలా విజయవాడ, విశాఖ, అరకు చలి ఉత్సవం, గండికోట, అమరావతి ఆవకాయ్ వంటి అనేక ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించామని, ఇవి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు “సక్సెస్ స్టోరీ”గా నిలిచాయని మంత్రి దుర్గేష్ తెలిపారు. 2019-24 వరకు గత ప్రభుత్వం ఏనాడూ ఈ తరహా ఉత్సవాలను నిర్వహించలేదని విమర్శించారు. పర్యాటకాన్ని తమ స్వంత లాభాలకే వినియోగించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్నదే తమ ఉద్దేశమన్నారు. తద్వారా ఏపీ బ్రాండ్ పెరిగి పర్యాటకుల రాక పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక్కో పర్యాటక ఉత్సవాన్ని ఒక్కొక్క ఈవెంట్ సంస్థతో నిర్వహిస్తున్నామన్నారు.

2027లో జూన్ 26 నుండి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో టెంట్ సిటీలు, ప్రత్యేక ప్యాకేజీలతో ఘనంగా నిర్వహిస్తామన్నారు.సమిష్టి కృషితో పుష్కరాలను విజయవంతం చేయాలని నిర్ణయించామన్నారు.డా.బి.ఆర్ అంబేద్కర్, కాకినాడ, రాజమహేంద్రవరం, ఏలూరు, పశ్చిమగోదావరి తదితర 6 జిల్లాల్లో ఏ ఘాట్ లో స్నానం చేసిన అదే పుణ్యఫలం దక్కుతుందని ప్రవచనకర్తలతో విస్తృత ప్రచారం నిర్వహించనున్నామన్నారు. నవ జనార్థన పారిజాతం(వైష్ణవాలయాలు), పంచారామాలు, రాష్ట్రంలోని జ్యోతిర్లింగాలు చూసేలా ప్యాకేజీలు రూపొందిస్తున్నామన్నారు. నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను పునరుద్ధరిస్తున్నామని, రాజమండ్రిలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా బ్రాంచ్ ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని వెల్లడించారు.ఈ విషయమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినీనటుడు బాలకృష్ణతో చర్చించామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు సూర్యరాయ ఆంధ్ర నిఘంటువును పునర్ముద్రించనున్నామని తెలిపారు. పర్యాటక రంగంతో పాటు కళా, సాంస్కృతిక రంగాలను గత ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. గడిచిన ఐదేళ్లలో కళాకారులను గౌరవించలేదన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఉగాది, కందుకూరి పురస్కారాలు ప్రదానం చేశామన్నారు. త్వరలోనే మళ్లీ ఈ పురస్కారాలు ఇవ్వనున్నామన్నారు. ప్రతి సంవత్సరం ఈ అవార్డులను ఇస్తామన్నారు. ఇప్పటికే పర్యాటక, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన అకాడమీలకు ఛైర్మన్లను, సభ్యులను నియమించుకున్నామని త్వరలోనే వారితో సమావేశమై ముందుకు వెళ్తామన్నారు.

పర్యాటక ప్రాంతాల్లో డిజిటల్ పేమెంట్స్ వల్ల పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సాక్ష్యాత్తు నాటి టీటీడీ ఛైర్మన్ గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డే చెప్పారన్నారు. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం..తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జరిగిన తప్పును సమర్థించుకోవడానికి ఎదురుదాడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న యాత్రలు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమన్నారు. ఆయన చేయాల్సింది ఓదార్పు యాత్రలు కాదు ప్రాయశ్చిత యాత్రలు అన్నారు.

భవిష్యత్ ప్రణాళికలు

సింగపూర్ విజిటర్ సెంటర్, దుబాయ్ టూరిజం హబ్ ల మాదిరిగా రాష్ట్రంలో పర్యాటక మౌలిక సదుపాయాలు, సందర్శకుల సౌకర్యాలు మరింత బలోపేతం చేసేందుకు,అంతర్జాతీయ పర్యాటక డెస్క్ లు, ప్రధాన పర్యాటక అగ్రిగేటర్లకు స్థలాలు, వీసా ఫెసిలిటేషన్ కౌంటర్లు ఏర్పాటు కోసం రూ.100 కోట్లతో అమరావతిలో ఇంటిగ్రేటెడ్ ఎక్స్ పీరియన్స్, ఇంటర్ ప్రెటేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరామని మంత్రి దుర్గేష్ అన్నారు. అమరావతిలో పర్యాటక భవన్ కు సంకల్పించామన్నారు. . రాష్ట్రవ్యాప్తంగా 60కి పైగా ప్రదేశాలలో వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ టూరిజం ప్రారంభించనున్నట్లు తెలిపారు. బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు, ఎకో-టూరిజం మరియు టెంట్ సిటీలను విస్తరించడం తమ ప్రాధాన్యత అన్నారు. బీచ్ షాక్, మైస్, ఫిల్మ్ టూరిజం కోసం కొత్త విధానాలను ఖరారు చేస్తామన్నారు. ఈ విషయమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చర్చించామన్నారు. కేవలం సినిమాలకే పరిమితమైన వినోదాన్ని ప్రజల చెంతకు, ప్రకృతి ఒడిలోకి చేర్చి, రాష్ట్ర గౌరవాన్ని పెంచేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు..2047 నాటికి ఏపీని అంతర్జాతీయ పర్యాటక చిత్రపటంలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. గత ప్రభుత్వం పర్యాటక, సాంస్కృతిక రంగాలను నాశనం చేసిందని, తాము పారదర్శకతతో భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.మిషన్ -2029కి అనుగుణంగా ఆర్థిక వృద్ధి, ఉపాధి, సాంస్కృతిక మార్పిడికి కీలకమైన పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. రాష్ట్ర పర్యాటక విధా నాలు, నిర్దేశిత లక్ష్యాలపై చర్చించి బ్రాండింగ్‌, మార్కెటింగ్‌, ఉత్పత్తి, ప్రాజెక్టులు, పెట్లుబడులు, భాగస్వామ్యం, టెక్‌ ఎనేబుల్‌మెంట్‌, క్రియేటివ్‌ ఎకానమీ, కెపాసిటీ బిల్డింగ్‌ తదితర ఆరు అంశాలపై ఏపీ పర్యాటక రంగం ముందుకు తీసుకువెళ్తోందని భావిస్తున్నామన్నారు.ఇటీవలే పర్యాటక శాఖకు బ్రాండింగ్, మార్కెటింగ్, ఈవెంట్స్ నిర్వహణ కోసం రూ.150 కోట్ల బడ్జెట్ కేటాయించాలని ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పెట్టామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు సూచనల మేరకు ఏడాదంతా కార్యక్రమాలతో పర్యాటక రంగానికి కొత్త శోభ తెచ్చేదిశగా 8 మెగా ఈవెంట్స్, 11 నేషనల్ ఫెయిర్స్, 10 ఇంటర్నేషన్ ఫెయిర్స్ కు రూపకల్పన చేస్తున్నామన్నారు. ఏపీలో వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తే తాము పెట్టుబడులు పెడతామని జర్మనీ దేశం ఐటీబీ బెర్లిన్ సదస్సులో తెలిపిందన్నారు. వియత్నాం దేశం రాష్ట్రంతో అనుసంధానం కోసం చర్యలు ప్రారంభించిందన్నారు.

పర్యాటకుల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట:మంత్రి దుర్గేష్

అటవీ, పర్యాటక, దేవాదాయ, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ వంటి శాఖలతో కూడిన సబ్ కమిటీ భేటీలో పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు. గతంలో దేవీపట్నం, పాపికొండలు తదితర ప్రాంతాల్లో జరిగిన దుష్పరిణామాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రాజమహేంద్రవరంలో పులిని పట్టుకోవడంలో అటవీ అధికారులు సక్సెస్ అయ్యారని వారిని అభినందించారు. పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు, యాత్రికుల భద్రతా ప్రమాణాల దృష్ట్యా ముందుకు వెళ్తూ నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ సిద్ధం చేశామన్నారు.

నిడదవోలు నియోజకవర్గ ప్రగతి

మంత్రిగా దుర్గేష్ తన నియోజకవర్గమైన నిడదవోలు అభివృద్ధిని ప్రస్తావిస్తూ, 20 నెలల్లో ₹500 కోట్లతో సమగ్రాభివృద్ధి చేపట్టామని తెలిపారు. నిడదవోలుకు ‘స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ’ హోదా సాధించామన్నారు. పట్టణ అభివృద్ధికి రూ.110 కోట్లు, అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రూ.3 కోట్లు కేటాయింపులకు కృషి చేశానన్నారు. తద్వారా కోట సత్తెమ్మ ఆలయ అభివృద్ధి చేపడుతామన్నారు. నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం మరియు జల్ జీవన్ మిషన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *