-మద్దూరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ
-రూ. 1.30 కోట్లతో కొవ్వూరు నియోజకవర్గం మద్దూరులో గ్రామ సచివాలయ భవనం ప్రారంభం; రైతు సేవా కేంద్రం, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి దుర్గేష్
-సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ పరుగులు – డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే సాధ్యమన్న మంత్రి దుర్గేష్
-సూపర్ సిక్స్ పథకాలతో పేదల ముఖాల్లో చిరునవ్వు చూస్తున్నామని వెల్లడి
-గోదావరి పుష్కరాల నాటికి ఘాట్లన్నీ అభివృద్ధి చేసి గోష్పాద క్షేత్రాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం
-గత ఐదేళ్ల దోపిడీని చెరిపివేస్తూ అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్న మంత్రి దుర్గేష్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గ్రామ స్వరాజ్యానికి పెద్దపీట వేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో శనివారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విస్తృతంగా పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గారితో కలిసి సుమారు రూ. 1.30 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు నిర్వహించారు. మొదటగా, ఉపాధి హామీ పథకం కింద రూ. 43.60 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా ఈ భవనాన్ని అత్యాధునిక వసతులతో నిర్మించినట్లు ఆయన తెలిపారు. అనంతరం, రూ. 23.94 లక్షలతో నిర్మించనున్న రైతు సేవా కేంద్రానికి మరియు గ్రామంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా రూ. 62.35 లక్షలతో వివిధ ప్రాంతాల్లో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్ల పనులకు మంత్రి దుర్గేష్ భూమి పూజ చేశారు.రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు మరియు సాంకేతిక సలహాలు ఒకే చోట అందించే లక్ష్యంతో రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కూటమి నాయకులు మంత్రి దుర్గేష్ కి ఘనస్వాగతం పలకగా, శాస్త్రోక్తంగా కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. “2019-24 మధ్య గత ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుని ఖాళీ ఖజానాను అప్పజెప్పిందన్నారు. ఐదేళ్ల పాటు ఏ అభివృద్ధికి నోచుకోని ఏపీని, నేడు అనుభవజ్ఞుడైన సీఎం చంద్రబాబు నాయుడు తన పరిపాలనతో తిరిగి పట్టాలెక్కించారని తెలిపారు. పీఎం నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కేంద్ర సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ లా పరుగులు పెడుతోందని పేర్కొన్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి అన్ని ఘాట్లను అభివృద్ధి చేస్తామని, ముఖ్యంగా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దుతామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు చేస్తున్న కృషిని అభినందిస్తూ, తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు. మద్దూరు సర్పంచ్ బాబ్జి ప్రజాసేవలో చూపిస్తున్న చొరవను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. మద్దూరు గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం” అని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలను మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా వివరించారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు.గతంలో ఆరేడు నెలలు అయినా డబ్బు జమ కాకపోవడం వల్ల రైతులకు జరిగిన ఇబ్బందిని వివరించారు. ‘అన్నదాత సుఖీభవ’ ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రూ.3 వేల నుండి రూ. 4 వేలకు పెంచామని, దివ్యాంగులకు రూ. 6 వేలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ. 15 వేలు అందిస్తున్నామన్నారు. మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ఉచిత బస్సు సౌకర్యంతో మహిళల ముఖాల్లో చిరునవ్వు చూస్తున్నామన్నారు. కుటుంబంలో ఎంత మంది చదువుకుంటే అంతమందికి ‘తల్లికి వందనం’ ద్వారా ఒక్కొక్కరికి రూ. 15 వేలు అందించామన్నారు.మెగా డీఎస్సీ ద్వారా 16వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీ చేపట్టామని వివరించారు.పేదవాడి కంట కన్నీరు తుడవడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తన శాఖల ద్వారా ప్రజలకు విస్తృత ప్రయోజనం చేకూరుస్తున్నారన్నారు.ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ నిధులు సమీకరించి అభివృద్ధిని చేస్తున్నామన్నారు. పోలవరం, అమరావతి అభివృద్ధికి, ఇతర కార్యక్రమాలకు ఇతోధికంగా నిధులు సమకూరుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మంత్రి దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి పార్టీల ముఖ్య నాయకులు మరియు భారీ సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News