రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం రూరల్ మండలం, కాతేరు గ్రామ పరిధిలో గల డిసిల్టేషన్ ఇసుక రీచ్ వద్ద జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి, రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో గనులు శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది, ఇరిగేషన్ శాఖ అధికారులు మరియు స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి శనివారం సంయుక్త తనిఖీలు నిర్వహించడం జరిగింది. తనిఖీల సందర్భంగా కాతేరు డిసిల్టేషన్ ఇసుక రీచ్ ఒడ్డున మూడు డ్రెడ్జింగ్ బోట్లు అలాగే వాటి సమీపంలో రెండు ఇసుక గుట్టలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డ్రెడ్జింగ్ బోట్లలో ఇసుక ఆనవాళ్లు లభించడంతో, అవి గోదావరి నదిలో నియమ విరుద్ధంగా ఇసుక త్రవ్వకాలలో పాల్గొన్నట్లు అధికారులు నిర్ధారించారు.
నియమాలను ఉల్లంఘిస్తూ డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక త్రవ్వకాలకు పాల్పడినట్లు నిర్ధారించిన మూడు డ్రెడ్జింగ్ బోట్లను సీజ్ చేసి, వాటిపై కేసు నమోదు చేయుటకు సంబంధిత శాఖ అయిన ఇరిగేషన్ శాఖ అధికారులకు అప్పగించడం జరిగింది. అదేవిధంగా డ్రెడ్జింగ్ బోట్ల సమీపంలో ఉన్న ఇసుక గుట్టలను కొలతలు వేసి, అవి సుమారు 642 టన్నుల పరిమాణంలో ఉన్నట్లు నిర్ధారించి, సదరు ఇసుక గుట్టలను సీజ్ చేసి తదుపరి చర్యలు తీసుకునే వరకు స్థానిక రెవెన్యూ అధికారుల సంరక్షణకు అప్పగించారు. భవిష్యత్తులో కాతేరు డిసిల్టేషన్ ఇసుక రీచ్‌లో నియమ విరుద్ధంగా డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులను అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే ఇసుక కార్యకలాపాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో జిల్లా గనులు మరియు భూగర్భ అధికారి డి. ఫణి భూషణ్ రెడ్డి, అసిస్టెంట్ జియాలజిస్ట్
జి. విఘ్నేశ్వరుడు, గనులు మరియు భూగర్భ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది, ఇరిగేషన్ శాఖ అధికారులు, స్థానిక రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News