–బాలల సంక్షేమ శాఖ సంచాలకులు ఎం. వేణుగోపాల్ రెడ్డి.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లైంగిక వేధింపులకు గురైన బాలలకు అండగా నిలిచేందుకు, వారికి న్యాయపరమైన, మానసిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. పోక్సో (POCSO) చట్టం-2012, సెక్షన్ 39 ప్రకారం.. బాధితులకు కేసు విచారణకు ముందు, విచారణ సమయంలో మార్గదర్శకత్వం మరియు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు “సపోర్ట్ పర్సన్స్” (Support Persons)ను నియమించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బాలల సంక్షేమం, సంస్కరణల సేవలు మరియు వీధిబాలల సంక్షేమ శాఖ సంచాలకులు (FAC) శ్రీ ఎం. వేణుగోపాల్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మార్గదర్శకాల మేరకు ఈ నియామకాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 28 మంది సపోర్ట్ పర్సన్స్‌ను నియమిస్తారని ప్రతి జిల్లాకు ఒకరు చొప్పున ఈ నియామకాలు ఉంటాయన్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ సంచాలకులు, సంబంధిత జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించబడుతుందన్నారు.
లైంగిక వేధింపులకు గురైన పిల్లలకు న్యాయ విచారణ సమయంలో తోడుగా ఉంటూ, వారికి అవసరమైన కౌన్సెలింగ్ అందించడం వీరి ప్రధాన బాధ్యత అని అన్నారు. పోస్టులకు కావాల్సిన విద్యార్హతలు, విధులు , ఇతర నిబంధనలతో కూడిన ప్రత్యేక నోటిఫికేషన్లను ఆయా జిల్లాల కలెక్టర్లు త్వరలోనే విడుదల చేస్తారన్నారు.
బాధితులైన బాలలకు భరోసా కల్పించి, వారి హక్కులను కాపాడటమే ఈ నియామకం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని శ్రీ వేణుగోపాల్ రెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News