రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం క్షేత్ర స్థాయిలో సమీక్షించారు. విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి.. తొలుత విమానాశ్రయ అధికారులు, ఎయిర్పోర్ట్ అధారిటీ అధికారులతో సమీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు బలరామ కృష్ణ, ఆదిరెడ్డి వాసులు పాల్గొన్నారు. విమానాశ్రయంలో జరుగుతున్న టెర్మినల్ అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో సమీక్షించి, టెర్మినల్ భవనం నిర్మాణాన్ని పరిశీలించారు. పనులను వేగవంతం చేసి మార్చి 31నలోపు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్ సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. తరువాత విమానాశ్రయ ప్రాంగణంలో “ఏక్ పెడ్ మా కే నామ్ సే” కార్యక్రమంలో భాగంగా విమానాశ్రయ ఆవరణలో మొక్కను నాటారు. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని, రాజమహేంద్రవరం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతకు అనుగుణంగా, గోదావరి ప్రాంత ప్రజలకు గేట్వేగా మారేలా ఈ విమానాశ్రయం అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ప్రాంతీయ కనెక్టివిటీ, పర్యాటకం, ఆర్థిక వృద్ధికి ఇది మరింత దోహదపడుతుందని అన్నారు. త్వరలో మరిన్ని సర్వీసులను కూడా రాజమండ్రికి చేరువ చేస్తామని స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News