-కృష్ణా తీరం కవితా హారం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్
-బోధిసిరి నౌకలో 51 మంది కవుల కవితా గానం – స్వయంగా వీక్షించిన మంత్రి దుర్గేష్
-రాష్ట్రవ్యాప్త నదీ తీరాల్లో ఇలాంటి సాహిత్య కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చూడతామని హామీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతి ఒడిలో సాగే సాహిత్య సమ్మేళనాలు సమాజానికి కొత్త దిశానిర్దేశం చేస్తాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ భవానిపురం సమీపంలోని హరిత బెర్మ్ పార్కు వద్ద ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, ఏపీ పర్యాటక శాఖ, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన “కృష్ణా తీరం కవితా హారం” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశతో కలిసి ‘బోధిసిరి’ నౌకలో ప్రయాణిస్తూ, 51 మంది కవులు వినిపించిన కవితలను ఆసక్తిగా ఆలకించారు. కృష్ణమ్మ అలల పైన కదులుతున్న పడవలో కవి సమ్మేళనం జరగడం ఒక కొత్త ఒరవడికి నాంది అని మంత్రి దుర్గేష్ అభివర్ణించారు. అమరావతి ఒడిలో ప్రవహించే కృష్ణమ్మకు ఈ తరం కవులు సమర్పించిన కవితా హారతి ఇది అని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ పలు కీలక అంశాలను వెల్లడించారు. త్వరలోనే నంది నాటకోత్సవాలు నిర్వహించి, నంది అవార్డులను అందజేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో కుంటుపడిన సాంస్కృతిక రంగాన్ని గాడిలో పెడుతున్నామని, ఉగాది పురస్కారాలు, కందుకూరి పురస్కారాలను ఘనంగా అందజేస్తామన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మహాకవి తిక్కన విగ్రహ ఏర్పాటుపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించామని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.ఇదే తరహాలో పెన్నా, గోదావరి నదీ తీరాల్లో సాహిత్య కార్యక్రమాలు చేపడతామని, ముఖ్యంగా దేవీపట్నం నుండి పాపికొండలు వెళ్లే లాంచీలో త్వరలోనే కవి సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. సమకాలీన సమాజంలోని అట్టడుగు వర్గాల ఆవేదనను ప్రతిబింబించేలా సాగిన ఈ కవితలను వీడియో డాక్యుమెంటేషన్ ద్వారా డిజిటలైజ్ చేసి భావితరాలకు అందించనున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. కవులు, కళాకారుల ఆత్మగౌరవాన్ని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ విమర్శల మధ్య ఇలాంటి సాహిత్య వేదికలు తమకు మానసిక శాంతిని, సమాజ సేవకు పునరంకితమయ్యే స్ఫూర్తిని ఇస్తాయని మంత్రి దుర్గేష్ చమత్కరించారు.
కవులు.. లోకానికి భావభానులు: కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
కవులు సమాజానికి వెలుగునిచ్చే భావభానులని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. రచయితలు, వారి రచనలను పరిరక్షించుకోవడం సమాజ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కళలు, సాహిత్యం మన సంస్కృతికి జీవన రేఖలని.. చెట్టు వేర్లు వంటివని.. ఇవి ఎంత బలంగా ఉంటే మన సమాజం అంత బలంగా ఉంటుందని పేర్కొన్నారు. సృజనాత్మకతకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. స్థానిక పర్యాటకాన్ని, సంస్కృతిని, కళలు, సంప్రదాయాలను ఎప్పుడూ కాపాడుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి చెబుతుంటారని పేర్కొన్నారు. రచయితలు తమ రచనల ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేస్తారని, భావజాల వికాసంలో వారి పాత్ర అనిర్వచనీయమన్నారు. కవులు, రచయితలు, రచనలు లేని సమాజాన్ని ఊహించుకోలేమని.. తెలుగు సాహిత్యాన్ని మరింతగా ప్రోత్సహించే వారందరికీ ప్రభుత్వం చేయూతగా నిలుస్తుందని.. జాతీయ సాంస్కృతిక ఉత్సవాల స్ఫూర్తితో నేడు నిర్వహించిన కృష్ణాతీరం-కవితా హారం కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన మల్లెతీగ సాహిత్య సేవా సంస్థకు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
ఏపీ సృజనాత్మక, సంస్కృతి సమితి ఛైర్‌పర్సన్ పొడపాటి తేజస్వి మాట్లాడుతూ ఒక జాతి బతకాలంటే భాష బతకాలి, సమాజం బతకాలంటే సాహిత్యం బతకాలి.. చరిత్ర అనేది రాజుల శాసనాల నుంచి కాదు.. కవుల పద్యాల నుంచి తెలుసుకున్న చరిత్రమనదని పేర్కొన్నారు. నది భూమిని సస్యశ్యామలం చేస్తుంటే, కవులు మనుషుల మనసులను సస్యశ్యామలం చేస్తారని పేర్కొన్నారు. వేమన పద్యాలు, సుమతీ శతకం అందించే జ్ఞానం ప్రపంచమంతా తిరిగినా దొరకదని, సాహిత్యం అనేది తరతరాలకు విజ్ఞాన వారధి అని పేర్కొన్నారు. మనం ఎంత ఆధునికమైన ఏఐ యుగంలో జీవిస్తున్నప్పటికీ మూలాలను మరచిపోకూడదని, భాష–సాహిత్యాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తేజస్వి స్పష్టం చేశారు. కవులు, కళాకారులను రక్షించుకోవడం ద్వారా మాత్రమే సంస్కృతి నిలుస్తుందని.. ఈ విషయంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ అహర్నిశలు కృషిచేస్తోందని, ఇలాంటి గొప్ప కార్యక్రమాలకు ఎప్పుడూ తమ సహకారం ఉంటుందని తేజస్వి పేర్కొన్నారు. సంప్రదాయాలు, విలువలు, కళలను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశగారు ప్రోత్సహిస్తున్న తీరు, ఆయన కళాత్మక హృదయం.. జీవనదీ ప్రవాహమని అన్నారు. కొండపల్లి బొమ్మలు, కళాకారుల సంక్షేమానికి కృషిచేస్తున్న తీరు ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కళలు, కళాకారులను ప్రతిఒక్కరూ గౌరవించుకోవాల్సిన అవసరముందని.. ఈ విషయంలో ప్రభుత్వం ముందుంటోందని ఆమె పేర్కొన్నారు.
మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ అధ్యక్షులు కలిమిశ్రీ మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు, ముఖ్యంగా సరికొత్తగా రూపాంతరం చెందిన, చెందుతున్న నేటితరం కవిత్వాన్ని కాలగర్భంలో కలిసి పోకుండా భద్రపరిచి, ముందుతరాలకు అందించేందుకు రికార్డు చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ముంబై నుంచి వచ్చిన 51 మంది కవులను మంత్రి దుర్గేష్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం, మల్లెతీగ సంస్థ ప్రతినిధులు మరియు సాహిత్య అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News