Breaking News

శ్రీవారి నైవేద్యంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై జగన్ బ్యాచ్ సమాధానం చెప్పాలి…

-ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీవారి నైవేద్యంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న విషయం అత్యంత ఆందోళనకరమని తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు పేర్కొన్నారు. కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీకైన శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జనసేన పార్టీ శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించింది. తిరుపతి హరే రామ హరే కృష్ణ టెంపుల్ వద్ద నుండి అలిపిరి పాదాల వరకు నాయకులు, కార్యకర్తలు నడుచుకుంటూ నిరసన తెలియజేశారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, నగర నాయకులు, కూటమి నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు మాట్లాడుతూ… “శ్రీవారి నైవేద్యం అత్యంత పవిత్రమైనది. అలాంటి పవిత్ర నైవేద్యంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న విషయం బయటపడటం భక్తుల విశ్వాసానికి దెబ్బ. ఇది కేవలం పరిపాలనా లోపం కాదు- ఇది ఆధ్యాత్మిక విలువలకు జరిగిన అవమానం. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. టిటిడి కొనుగోలు, సరఫరా విధానాలపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలి. భక్తులకు పూర్తి పారదర్శక నివేదిక విడుదల చేయాలి” అని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ… “శ్రీవారి నైవేద్యం కోట్లాది హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక. అలాంటి పవిత్ర వ్యవహారంలో నిర్లక్ష్యం చోటుచేసుకుంటే అది క్షమించరాని విషయం. వైసీపీ నాయకులు ఈ ఘటన నుంచి పాఠం నేర్చుకోవాలి. ధర్మం, దేవాలయాల పవిత్రత వంటి అంశాల్లో రాజకీయ లాభనష్టాలు చూడాలనే ఆలోచన పూర్తిగా మారాలి. ఇలాంటి పనులు చేసిన వారి బుద్ధులు మారేలా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరు ఎంత పెద్దవారైనా చట్టం ముందు సమానమే. ఈ వ్యవహారంపై హై లెవల్ జ్యుడీషియల్ ఇన్క్వైరీ లేదా సీబీఐ విచారణ జరిపి పూర్తి నిజాలు ప్రజల ముందుంచాలి” అని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిజాలను బయటపెట్టగానే జగన్ మోహన్ రెడ్డి బ్యాచ్‌లో ఆందోళన మొదలైందని నేతలు ఆరోపించారు. నిజాన్ని ఎదుర్కోలేక దారి మళ్లించే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ధర్మాన్ని, భక్తుల విశ్వాసాన్ని కాపాడే పోరాటంలో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *