గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ-దిశ

-ప్రజా సాధికారత, సంపద సృష్టి లక్ష్యంగా పనిచేస్తున్నాం
-బిల్ గేట్స్‌తో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
-స్వర్ణాంధ్ర లక్ష్యాలు, పాలనా విధానాలపై సీఎం ప్రజెంటేషన్
-కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలుపై బిల్ గేట్స్ ప్రశంసలు
-డిజిటల్ విప్లవంలో చంద్రబాబుది కీలక పాత్రగా గేట్స్ కితాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశ-దిశ ఏర్పడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్‌ అమరావతి రాక చారిత్రాత్మకంగా నిలుస్తుందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల సాధికారతకు ఇది దోహదపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. సోమవారం బిల్ గేట్స్ అమరావతి పర్యటనలో భాగంగా సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి… ముందుగా గేట్స్‌, ఆయన బృందానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్‌తో తన అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. 1997లో మొదటిసారి తాను బిల్ గేట్స్‌ను కలిశానని… హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించానని… మైక్రోసాఫ్ట్ రాకతో ఇప్పుడు హైదరాబాద్‌ ఐటీ రంగంలో మేటిగా నిలబడిందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. ఏపీలో వనరులకు లోటు లేదని, సంపద సృష్టి జరగాల్సి ఉందన్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో 2047 నాటికి రాష్ట్రాన్నినెంబర్‌వన్ చేస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

చంద్రబాబు విజనరీ అని ఆనాడే తెలిసింది

సమావేశంలో మాట్లాడిన బిల్ గేట్స్…డిజిటల్ విప్లవానికి భారత్‌లో బలమైన పునాదులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారని కితాబిచ్చారు. తాను మొదటిసారి చంద్రబాబును కలిసినప్పుడు ఆయన ఆలోచనల్లో ముందుచూపు ఉందనే విషయాన్ని ఆనాడే గ్రహించినట్టు వెల్లడించారు. ఈ విషయంలో నాటి సింగపూర్ ప్రధాని మాత్రమే చంద్రబాబుకు కొంత దగ్గరగా ఉన్నారని చెప్పారు. గేట్స్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాల్లో ఆరోగ్య రంగానికి చెందిన ప్రాజెక్టులే మెజార్టీ ప్రాజెక్టులని తెలిపారు. ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నది తన ఆశయమన్నారు. కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని అభినందించారు. విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకోవడానికి, వారికి సరైన రీతిలో… తగిన స్థాయిలో విద్యా బోధన చేయడానికి ఏఐ సహాయపడుతుందన్నారు. విద్యారంగంలో మార్పు తీసుకురావడానికి ఏఐ-టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్పిన బిల్ గేట్స్, వ్యవసాయం రంగం చాలా ముఖ్యమైనదిగా అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ సాయంతో ఏపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం…టెక్నాలజీని రైతులకు అందించేందుకు… ఏఐను వ్యవసాయంతో ఇంటిగ్రేట్ చేస్తూ కృషి చేయడాన్ని అభినందించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వ్యవసాయంలో ఏఐని ఇంతలా వినియోగంచడం లేదని… కానీ ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో ముందుండటం మంచి పరిణామమని చెప్పారు. విపత్తుల నిర్వహణ కోసం టెక్నాలజీతో ముందస్తు అంచనాలు వేసి… ప్రాణ నష్టం జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకునే వ్యవస్థ ఏర్పాటు చేయడం బాగుందన్నారు. చంద్రబాబు తనకు గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ అని సమావేశంలో బిల్ గేట్స్ సరదాగా వ్యాఖ్యానించారు.

పది సూత్రాలతో స్వర్ణాంధ్ర-2047 సాకారం

స్వర్ణాంధ్ర 2047 విజన్, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పాలసీలు, లక్ష్యాలు, కార్యక్రమాలపై బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు. జీరో పావర్టీ, సంపూర్ణ ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, నీటి భద్రత, రైతు-అగ్రి టెక్, ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్, ఎనర్జీ-ఫ్యూయల్, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్… ఈ 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అనేది ఏపీ ప్రభుత్వ విధానమని… దీనికి ఆధార్ ధృవీకరణ, వ్యక్తిగత, కుటుంబ డేటా లేక్, కుటుంబ సమాచారం, రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వ సమగ్ర డేటా, అవేర్ ద్వారా రియల్ టైమ్ డేటా సేకరణ, వాట్సాప్ గవర్నెన్స్, డిజి వెరిఫై వంటి అప్లికేషన్ల వినియోగం ద్వారా భవిష్యత్‌ కోసం పూర్తి సన్నద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి అన్నారు. టెక్నాలజీ ఆధారిత థీమాటిక్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే క్వాంటం వ్యాలీ-డిజైన్ – ఫౌండ్రీగా అమరావతి, డేటా-ఏఐ సిటీగా విశాఖ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా కాకినాడ, డ్రోన్ సిటీగా ఓర్వకల్లు, ఎలక్ట్రానిక్స్-ఏరో సిటీగా లేపాక్షి, ఎలక్ట్రానిక్స్-స్పేస్ సిటీగా తిరుపతిని అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలో మొత్తం 10 రంగాలు, 30 ప్రభుత్వ విభాగాల్లో ఏఐని వినియోగిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. 98 ఏఐ యూజ్ కేసులు, 43 హ్యాకథాన్లు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయన్నారు. మొత్తం 7 డేటా లెక్ ప్రాజెక్టులు ప్రారంభించినట్టు తెలిపారు.

2.4 ట్రిలియన్ డాలర్ల జీఎస్డీపీగా రాష్ట్రం

స్వర్ణాంధ్ర-2047 నాటికి ముఖ్య లక్ష్యాలు నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ‘ప్రస్తుతం 180 బిలియన్ డాలర్లుగా ఉన్న రాష్ట్ర ఎకానమీని 2.4 ట్రిలియన్ డాలర్ల జీఎస్డీపీగా తీర్చిదిద్దడం, తలసరి ఆదాయం ప్రస్తుతం 3,400 డాలర్లు ఉండగా 2047 నాటికి దీనిని 42,000 డాలర్లకు పెంచడం, ఎగుమతులు 20.7 బిలియన్ డాలర్ల నుంచి 450 బిలియన్ డాలర్లకు పెంచడం, నిరుద్యోగితను 4.1 శాతం నుంచి 2 శాతం కన్నా తగ్గించడం, మహిళా కార్మికుల సంఖ్యను 45.8 శాతం 80 శాతానికి పెంచడం, ప్రస్తుతం 72 శాతంగా ఉన్న అక్షరాస్యతను 100 శాతానికి తీసుకువెళ్లడం, 95 శాతం నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉండేలా చూడటం, సగటు ఆయుర్ధాయం 85 ఏళ్లు, ఎంఎంఆర్ ప్రతీ లక్ష జననాలకు 5, ఐఎంఆర్ ప్రతీ వెయ్యి జననాలకు 2 కన్నా తగ్గించగలగడం, గర్భిణులలో రక్తహీనత సమస్య, వైద్యంపై వ్యక్తిగత ఖర్చు 5 శాతానికి తగ్గించడమే లక్ష్యం’గా సీఎం చెప్పారు.

విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యం

విద్యారంగంలో అనుసరిస్తున్న ఆధునిక విధానాల గురించి కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా తెలియజేశారు. ఇందుకు గేట్స్ ఫౌండేషన్ అందిస్తున్న సహకారంపైనా సంతోషం వ్యక్తం చేశారు. లిటరసీ-న్యూమరసీపై రాష్ట్ర ప్రభుత్వ దృష్టి పెట్టిందని, 35,000 పాఠశాలల్లో చదువుతున్న 13.4 లక్షల విద్యార్థులకు ఉపకరించేలా ఓఆర్ఎఫ్ టూల్ వినియోగిస్తున్నామని సీఎం చెప్పారు. వ్యవసాయం, అనుబంధ రంగాలను బలోపేతం చేస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి రైతు సంక్షేమం కోసం సాంకేతిక సాయం తీసుకుంటున్నామని వివరించారు. ఏఐ ద్వారా సాగుకు సలహాలు అందించడమే కాకుండా, డ్రోన్లు సహా వ్యవసాయ యంత్రాలను అద్దెప్రాతిపదికన వినియోగించుకునేలా అందుబాటులో ఉంచామన్నారు. తెగుళ్లు, చీడపీడలపై ముందస్తు హెచ్చరికలు చేయడం ద్వారా రైతులు నష్టపోకుండా కాపాడటం సాధ్యమవుతోందని పేర్కొన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను తెలిపారు. గోధార్ ద్వారా పశువుల ఆరోగ్య సంరక్షణ చేపట్టామన్నారు. విద్యుత్-పశుగ్రాసం వినియోగంలో వృధాను తగ్గించగలిగామని చెప్పారు. భూసార పరీక్షలు, మార్కెట్ సలహాలు, సమర్ధ నీటి నిర్వహణ సాగులో పెనుమార్పులు తీసుకువస్తున్నామని వివరించారు.

జూలై కల్లా రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’

వైద్యరంగంలో తెచ్చిన మార్పులు-సాధించిన ఫలితాలను బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి తెలిపారు. హై లెవెల్ ఎక్స్‌పర్ట్ అడ్వైజరీ గ్రూప్ ఏర్పాటు చేశామన్నారు. డబ్లుహెచ్‌వో, అశోకా యూనివర్సిటీ సహకారంతో నేషనల్ హెల్త్ ఏఐ స్ట్రాటజీ వర్క్‌షాప్ నిర్వహించామన్నారు. యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్, ఏబీడీఎం (ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్) అమలు సహా తక్కువ ఖర్చుకే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 71 లక్షల మందికి 41 పరీక్షల ద్వారా స్క్రీనింగ్ పూర్తి చేశామని చెప్పారు. ‘సంజీవని’ కార్యక్రమాన్ని సమగ్ర ఆరోగ్య వేదికగా తీర్చిదిద్దుతున్నామన్నారు. కుప్పంలో ఇప్పటికే సంజీవని పైలట్ ప్రాజెక్టు చేపట్టగా, విజయవంతమైందన్నారు. 2.9 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయగా, 109 ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 5.2 కోట్ల ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా జూలై 2026 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ అమలు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికి ఏఐ డాక్టర్‌ను ఇవ్వాలనేది రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్నారు. టీబీ రోగులకు పోషకాహారం అందిస్తున్నామని, ఎన్టీఆర్ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో డీఎంఐడీసీ స్థాపించామన్నారు. ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టుగా ‘అమరావతి స్కూల్ ఆఫ్ బయోడిజైన్’ చేపట్టామన్నారు.

బిల్‌గేట్స్‌తో మంత్రుల ఇంటరాక్షన్

సమావేశంలో పలు అంశాలపై ప్రశ్నలు వేసి మంత్రులు పయ్యావుల, సత్యకుమార్ యాదవ్ గేట్స్ అభిప్రాయాలు తెలుసుకున్నారు. హైదరాబాద్‌లో మైక్రో సాఫ్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ఆలోచనకు కారణమేంటని మంత్రి పయ్యావుల అడగ్గా….. దీనికి బిల్ గేట్స్ ఆసక్తికర సమాధానం చెప్పారు. నాడు చంద్రబాబు ఐటీని ప్రమోట్ చేయడం వల్ల టెక్ నిపుణులు చాలా మంది హైదరాబాద్ నుంచే వచ్చేవారని అన్నారు. అదే సమయంలో చంద్రబాబు మైక్రో సాఫ్ట్ కార్యాలయాన్ని హైదరాబాద్ లో పెట్టాలనే ప్రతిపాదన పెట్టారని బిల్ గేట్స్ తెలిపారు. దీనిపై తమ వద్ద పని చేసే వారి అభిప్రాయం కోరితే… హైదరాబాద్ సెంటర్ ఏర్పాటు చేస్తే తాము వెళ్లడానికి సిద్దంగా ఉన్నట్టు చెప్పారని బిల్ గేట్స్ సమావేశంలో వివరించారు. ఇప్పుడు కూడా భారతదేశంలో మైక్రో సాఫ్ట్ కంపెనీల్లో పని చేసే చాలా మంది ఉద్యోగుల్లో హైదరాబాద్ వారే ఎక్కువగా ఉన్నారని బిల్ గేట్స్ అన్నారు. ఇక ఏఐ ద్వారా ఆరోగ్య సేవలు ఏ విధంగా అందించవచ్చని బిల్ గేట్స్‌ను మంత్రి సత్యకుమార్ అడిగారు. ఏఐ టెక్నాలజీతో ఆరోగ్య రంగంలో మెరుగైన సేవలు అందించవచ్చని… నాణ్యమైన, నిపుణుల వైద్య సేవలను మారుమూల ప్రాంతాలకు కూడా అందించే అవకాశం ఉంటుందని గేట్స్ వెల్లడించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి బాబు ఏ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా… AI రాకతో ఉద్యోగాలను పునర్నిర్వచించాల్సిన అవసరం ఉందని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. అలాగే ఈ వారం ఢిల్లీలో జరుగుతున్న AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో కూడా AI వల్ల వచ్చే అవకాశాలు, ఎదురయ్యే సవాళ్ల గురించి ప్రపంచంలోని AI నిపుణులంతా చర్చిస్తారని గేట్స్ వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించిన బిల్ గేట్స్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *