-ప్రత్యేక కోర్టు, ఆస్తుల బహిరంగ వేలం, బాధితులకు సత్వర న్యాయం
-విలేకరుల సమావేశంలో ముప్పాళ్ళ నాగేశ్వరరావు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్రిగోల్డ్ బాధితులకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని, కంపెనీ ఆస్తులను బహిరంగ వేలం వేయాలని, బాధితులకు సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 2వ తేదీ నుంచి విజయవాడ ధర్నా చౌక్‌లో తలపెట్టిన రిలే, నిరవధిక నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని ఏపీ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు కోరారు. విజయవాడ దాసరి భవన్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ముప్పాళ్ళ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారంపై మరోసారి అసోసియేషన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ ఏడాది జనవరి నాటితో తమ అసోసియేషన్ చేపట్టిన ఉద్యమం పుష్కరకాలానికి చేరిందని గుర్తుచేశారు. ఒక కంపెనీ 32 లక్షల మంది నుంచి రూ.7.5 వేల కోట్లు వసూలు చేసి, పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలను నిలువు దోపిడీ చేసిందన్నారు. వివిధ లిటిగేషన్ల పేరుతో అటాచ్‌మెంట్ చేసిన ఆస్తులను అమ్మకుండా అడ్డుకుంటుందని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం, దానికి తోడు ప్రభుత్వం అలసత్వం, యాజమాన్యం మోసపూరిత విధానాలను నిరసిస్తూ ఈ నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు రిలే దీక్షలు, 5వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభిస్తామని తెలిపారు. గత కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో బాధితులకు కంపెనీ ఆస్తులు అమ్మి సొమ్ము చెల్లిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారన్నారు. కోర్టు లీగల్ లిటిగేషన్లను పరిష్కరించి లక్షలాది మందికి మేలు చేకూర్చడానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడమే ఏకైక మార్గమని సీఎం చంద్రబాబుకు అసోసియేషన్ సూచించగా..అందుకు అంగీకరించినప్పటికీ ఆచరణలో కోర్టు ఏర్పడకపోవడాన్ని ఆక్షేపించారు. సమర్థత కలిగిన పోలీసు అధికారుల బ ందంతో సత్వరం కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆర్థిక కుట్రలకు పాల్పడిన కారణంగా రాష్ట్రంలో 600 మంది, వివిధ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 1500 మంది ఆత్మహత్యలు, గుండెపోట్లకు గురయ్యారని తెలిపారు. ఇప్పటికైనా చైర్మన్ అవ్వా వెంకట రామారావు, అవ్వా సీతారామరావులు విజ్ఞత ప్రదర్శించి ప్రభుత్వం వద్దకుగాని, లేదా హైకోర్టుకు ముందుకు వచ్చి తాము దాచిన బినామీ ఆస్తులపై అన్ని రకాల అధికారాలను దఖలు పరచి సత్వర విక్రయాలకు బాధితులకు సొమ్ము చెల్లించడానికి సహకరించాలని డిమాండ్ చేశారు. నిరవధిక నిరాహార దీక్షలో అగ్రిగోల్డ్ బాధితులు భాగస్వాములు కావాలని కోరారు. ఈ సమావేశంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు అఫ్సర్, కె. విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News