-ఏఖోన్ముఖంగా తిప్పి కొట్టాలి
-తనకు విరుద్ధంగా ఉన్న దేశాలే లక్ష్యం
-మోదీ ట్రంప్‌కు దాసోహం
-ఇజ్రాయిల్‌తో సంబంధాలు దేశానికి నష్టం
-ఇంధన ధరల పెరిగే ప్రమాదం
-సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ కె.నారాయణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్రరాజ్య అమెరికా నియంతత్వ అప్రజాస్వామిక పోకడలు, టెర్రరిజం పోకడల్ని ప్రపంచం ఏకోన్మోకంగా తిప్పికొట్టాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ కె నారాయణ పిలుపునిచ్చారు. ఏ దేశాన్నైనా లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించడం ద్వారా ప్రపంచ శాంతి సాధ్యం కాదని, ఇరాక్, వెనిజులా, ఇరాన్ వంటి దేశాలపై జరిగిన చర్యలు ప్రపంచానికి పాఠాలు నేర్పాయని చెప్పారు.
విజయవాడ దాసరిభవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావులతో కలిసి ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అంతర్జాతీయ, జాతీయ ప్రాధాన్యత అంశాల్ని నారాయణ ప్రస్తావించారు. అనేక దేశాలలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోందని, అమెరికా అనే శక్తి తన ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న దేశాలను లక్ష్యంగా చేసుకొని వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. భారత ప్రధాని మోదీ ట్రంప్‌కు దాసోహం కాకుండా, భారతదేశం స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించాలని, దేశ ప్రయోజనాలను కాపాడే విధానమే అవలంభించాలని సూచించారు. ఇరాన్‌పై యుద్ధం చేయాల్సిన అవసరం అమెరికాకు లేదని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, ఇజ్రాయిల్‌తో కలసి ఆ దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. ఇరాన్‌లో ఆయుధ శక్తుల గురించి అనవసర ఆరోపణలు చేస్తూ దానిని ఒంటరిచేయాలని ప్రయత్నిస్తోందన్నారు. ఇరాక్ దేశంలో సద్దాం హుస్సేన్‌ను పూర్తిగా నిర్మూలించి, అతనిపై అణు ఆయుధాల ఆరోపణలు మోపి, చివరకు అతనిని పట్టుకుని హతమార్చిన ఘటన ప్రపంచం మర్చిపోలేదన్నారు.
ఇదే విధంగా వెనిజులా దేశాన్ని ఉగ్రవాద దేశంగా ముద్రవేసే ప్రయత్నం చేసిందని, ట్రంప్ చర్యల కంటే..ఉగ్రవాదం మరొకటి ఉండబోదన్నారు. వాస్తవానికి వెనిజులా ప్రపంచంలో రెండవ అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశంగా నిలిచిందని అన్నారు. సౌదీ అరేబియాకంటే అధికంగా చమురు నిల్వలు ఉన్న దేశం వెనిజులా అని, అక్కడి సహజ వనరులను అమెరికా కంపెనీలకు అప్పగించకుండా స్వతంత్ర విధానాన్ని అనుసరించగా, ఆ దేశాన్ని రాజకీయంగా అస్థిరం చేసేందుకు ప్రయత్నించారని గుర్తుచేశారు. చిలీ దేశంలోను అలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయని, అక్కడి ఖనిజ సంపదను అమెరికా కంపెనీలకు ఇవ్వకుండా సోషలిస్టు విధానాన్ని అనుసరించిన ప్రభుత్వాన్ని కూలదోసి, అమెరికాకు అనుకూలమైన వ్యవస్థను నెలకొల్పారన్నారు. ఈ విధంగా అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించిన ఎన్నో దేశాలు లక్ష్యంగా మారాయని, వాటి అంతానికి తెగబడుతోందని ధ్వజమెత్తారు. బంగ్లాదేశ్‌లోను, శ్రీలంకలలోను ప్రజలు గత పాలకులపై నిరసన తెలిపి, నూతన ప్రభుత్వాలని ఏర్పాటు చేశారన్నారు. ఏ దేశంలోనైనా ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఎంత మంచివాడైనా, అతను అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండి, అమెరికా దోపిడీ వ్యవస్థను ఎదిరించినట్లయితే వాళ్లని తొలగించే ప్రయత్నాలు జరుగుతాయన్నారు. ప్రపంచ ఉగ్రవాదంపై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యల్ని ఆయన తూర్పారబట్టారు. ట్రంప్ పెద్ద ఉగ్రవాది అని మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నేతన్యాహు వంటి నాయకుల విధానాలు ప్రపంచంలో ఉద్రిక్తతలను పెంచాయన్న విమర్శలున్నాయన్నారు. చివరకు నేను చెబితేనే భారత్, పాకిస్తాన్ యుద్ధం ఆగిందని ట్రంప్ పలుమార్లు చెప్పటం సిగ్గుచేటన్నారు. భారతదేశానికి ఇజ్రాయిల్‌తో గతంలో అంతగా సంబంధాలు లేకపోయినా, ఇటీవల కాలంలో రాజకీయ, సైనిక, విధానపరమైన సంబంధాలు బలపడ్డాయని, ఇది కొత్త దిశగా తీసుకెళ్లబడిన విదేశాంగ విధానంగా కనిపిస్తోందన్నారు.
మోదీ వచ్చాకనే ఇజ్రాయిల్ నాయకత్వంతో సాన్నిహిత్యం పెంచడం, ఇరాన్‌తో ఉన్న సంబంధాలను దెబ్బతీయడం వంటి చర్యలు భారతదేశంపై ఆర్థిక ప్రభావాన్ని చూపవచ్చని ఆయన విశ్లేషించారు. ఇరాన్ ఘటన తరువాత 444 దేశీయ విమానాలు నిలిచిపోయాయని, ఆ ప్రభావం భారతీయులపైన పడిందన్నారు. భారతదేశం తన చమురు అవసరాలలో గణనీయమైన శాతం ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటోందని, 2.6 మిలియన్ బ్యారెల్స్, దాదాపు రూ.1.60 లక్షల కోట్ల రూపాయల విలువగల ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై చూపుతుందన్నారు. ఇరాన్‌తో ఉన్న వాణిజ్య సంబంధాలు దెబ్బతింటే మన దేశంలోనూ ఇంధన ధరలు పెరిగే అవకాశముందని, దాంతో జీవన వ్యయం పెరిగి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాలలోనూ లక్షలాది భారతీయులు ఉపాధి పొందుతున్నారని, అక్కడి రాజకీయ అస్థిరత భారతీయ కార్మికుల జీవితాలను ప్రభావితం చేస్తుందని, తద్వారా విదేశీ మారకద్రవ్య ప్రవాహం తగ్గిపోతే భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. వెనిజులా నుంచి చమురు దిగుమతులపై ఆంక్షలు విధించి, తరువాత మళ్లీ కొనుగోలు చేయమని ఒత్తిడి చేయడం వంటి ద్వంద్వ వైఖరిని మనం గమనిస్తున్నామన్నారు. ట్రంప్ భారత్ పై 18 శాతం మేర సుంకాలు విధించటం వంటి చర్యలు దేశ ఆర్థిక స్వావలంబనను దెబ్బతీస్తాయని అన్నారు. భారతదేశం ఐదు ప్రధాన ఆర్థిక శక్తులలో ఒకటిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందని, అభివృద్ధి శాతం పెంపు కోసం కృషి చేస్తోందని వివరించారు. అంతర్జాతీయ ఒత్తిళ్లు, వాణిజ్య సుంకాల పెంపు, చమురు దిగుమతులపై ఆంక్షలు వంటి అంశాలు దేశాభివృద్ధికి అడ్డంకిగా మారవచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్రిటన్, అమెరికా గతంలో యుద్ధాలకు వెళ్లినప్పుడు భారతదేశంపైనా ప్రభావం పడిందని, కాబట్టి ప్రపంచ రాజకీయ పరిణామాలను అందరూ జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. కేరళలో ప్రజలు ప్రకృతి సంపదను కాపాడినట్లే, మన దేశం కూడా తన ఆర్థిక, రాజకీయ స్వాభిమానాన్ని కాపాడుకోవాలని అన్నారు. అమెరికా సామ్రాజ్యవాద దుశ్చర్యలతో ఇరాన్ తిరిగి ప్రపంచ వేదికపై నిలబడుతోందని అన్నారు. అంతర్జాతీయ సంబంధాలలో సమతుల్యత, శాంతి, పరస్పర గౌరవం అవసరమని, ఇదే మా పార్టీ అభిప్రాయమని నారాయణ స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ఇరాన్ కు సంఘీభావం ప్రకటిస్తున్నామన్నారు.
Prajavartha Online Telugu News