గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అంగన్వాడి టీచర్లు,హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గతంలో ఎన్నడు లేని విధంగా చరిత్రలో తొలిసారి అంగన్వాడీ టీచర్ల వేతనాలను రెండుసార్లు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. అంగన్వాడీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు స్పష్టం చేశారు. అంగన్వాడి కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.86.68 కోట్లు విడుదల చేసి చేసిన సంగతి గుర్తు చేశారు. అంగన్వాడీలకు ప్రతినెలా ఒకటో తేదీని వేతనాలు ఇస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు రూ.75 కోట్ల వ్యయంతో 5జి స్మార్ట్ఫోన్లు అందచేసినట్లు చెప్పారు. గ్రాట్యూటీ చెల్లింపుల కోసం 2025 రాష్ట్ర బడ్జెట్లో రూ. 20 కోట్లు కేటాయించి అంగన్వాడీలకు అండగా నిలిచామన్నారు. అంగన్వాడి కేంద్రాలకు టీవీ, ఆర్వో, టాయిలెట్ సౌకర్యాలు కల్పించడంతోపాటు టీచర్లకు, ఆయాలకు వేసవిలో 15 రోజులు సెలవులు ఇస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐదువేల మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తిస్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేసి మినీ అంగన్వాడి కార్యకర్తలకు టీచర్లుగా పదోన్నతులు కల్పిస్తున్నామని, 5 వేల మంది అంగన్వాడి సహాయకులను నియమించబోతున్నట్లు యార్లగడ్డ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అంగన్వాడీల్లో హాజరు 70 నుంచి 96 శాతానికి పెరగటం శుభ పరిణామం అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వారికి ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నామని వెంకట్రావు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో వేధింపులు, ఇబ్బందులకు గురైన ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ హామీ ఇచ్చారు.
Prajavartha Online Telugu News