మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో అమృత కృష్ణ పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛమైన నీటి బాటలింగ్ యూనిట్ ను రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ రాను రాను పర్యావరణం కలుషితం అవుతుందని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చిన్నతనంలో బోరింగులు ఎక్కడపడితే అక్కడ నీరు తాగే వారమన్నారు. నేడు అలాంటి పరిస్థితి లేదన్నారు. స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహార అందేలా చూసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తమన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వాడకం పెరిగిపోయిందని హోటల్లో పార్సల్లు అన్నీ కూడా క్యారీ బ్యాగుల్లోనే సరఫరా అవుతున్నాయన్నారు. ప్లాస్టిక్ మట్టిలో కలవాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం కలెక్టరేట్లో స్వచ్ఛమైన నీటి బాటలింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం ఒక మంచి ఆలోచన అని అందుకు చొరవ తీసుకున్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని ధైర్యం చేసి బాటలింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకున్న మహిళ జీవామృతను మంత్రి అభినందించారు. ప్రభుత్వపరంగా ఆమెకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి మహిళలపై పూర్తి నమ్మకం ఉందని, వారు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లిస్తారన్నారు. ఆమె బాటిలింగ్ యూనిట్ తప్పకుండా విజయవంతం అవుతుందన్నారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం ఎక్కువైందని ప్లాస్టిక్ ఎక్కడపడితే అక్కడ పారవేయడం ముఖ్యంగా మురికి కాలువల్లో వేయడం వలన అక్కడ ఇరుక్కుపోయి మురుగునీరు ప్రవహించక దోమలు వృద్ధి చెందుతున్నాయన్నారు. దోమల వలన మానవులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. ప్లాస్టిక్ ముక్కలు ముక్కలుగా అయ్యి ఆహారంలో కలిసి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందన్నారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వాడకం నిలిపివేయాలని మనం ఎక్కువగా క్యారీ బ్యాగులు వాటర్ బాటిల్స్ ను వినియోగిస్తున్నామ ని వాటి వాడకం తగ్గించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త అనే నినాదంతో ముందుకు వెళుతుందన్నారు. ఇందులో భాగంగానే ఒక పేద మహిళలకు పీఎంఈజీపి పథకం కింద 15 లక్షల రూపాయలు రుణం మంజూరు చేయించి, ఈ బాటిలింగ్ యూనిట్ ఏర్పాటు చేయించామన్నారు. ఆ మహిళలకు స్వయం ఉపాధి లభించడంతోపాటు పర్యావరణానికి హితంగా కూడా మార్పు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు ప్రతి ఒక్కరు కూడా వారికి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఈ బాటిలింగ్ యూనిట్ నుండి మంచినీటిని కొనుగోలు చేయాలన్నారు.
ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం జరిగిన ఇదే నీటి బాటిల్ యూనిట్ నుండి నీటి సీసాలను వాడాలని నిర్ణయించుకున్నామన్నారు.
ఆర్కే హోటల్లో కూడా ఈ బాటిల్ యూనిట్ నుండి నీటి సీసాలను తీసుకొని పేద మహిళలకు అండగా నిలవాలన్నారు. సీసాలు వాడాక సీసాలను తిరిగి ఇస్తే నీటి దర 6 రూపాయిలు మాత్రం వసూలు చేయడం జరుగుతుందన్నారు. కాషన్ డిపాజిట్ గా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని నీటి ధర తగ్గించుకొని మిగిలిన డబ్బులు వారు చెల్లిస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ చంద్రశేఖర రావు, డి ఆర్ డి ఎ పిడి హరిహరనాద్, మచిలీపట్నం ఆర్డిఓ సాంబశివరావు, కె వి ఐ బి ఏ డి శ్రావణ్ కుమార్, డీసీఎంఎస్ అధ్యక్షులు బండి రామకృష్ణ, అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు దిలీప్ కుమార్, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచే నాని, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ పలువురు మహిళలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News