విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్.టి.ఆర్.జిల్లా బి.ఆర్.టి.ఎస్.రోడ్డు నందు ఈ రోజు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఉమెన్ సేఫ్టీ వీక్ 2026 కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత, మహిళా ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఐ.జి. బి.రాజ కుమారి ఐ.పి.ఎస్, జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మి శా ఐ.ఏ.ఎస్. పాల్గొన్నారు
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ…మహిళా అభ్యున్నతి గురించి మాట్లాడుతూ ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’ వంటి సూక్తులు మనం వింటూనే ఉంటాం. ఒక ఇంట్లో ఆడది ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. మహిళ చదువుకుని సాధికారత సాధిస్తే ఇల్లంతా సాధికారత సాధించినట్టే, మహిళ భద్రంగా ఉంటే సమాజం భద్రంగా ఉన్నట్టే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చెప్పినట్టు, మహిళల అభివృద్ధియే ఆ దేశ అభివృద్ధికి కొలమానం. మన ఇంట్లో మగపిల్లలకు చిన్నప్పటి నుండే ఆడపిల్లలను గౌరవించడం, వారిని తల్లిలా, చెల్లిలా చూడటం నేర్పించాలి. అప్పుడు మనం ప్రత్యేకంగా రక్షణ టీములు, శక్తి టీములు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే, అసలు నేరం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి కుటుంబంపై ఉంది.మహిళల శక్తి అపారం. ఒక బిడ్డను కనేటప్పుడు మహిళ పడే ప్రసవ వేదన వర్ణనాతీతం.అంతటి శక్తివంతురాలైన మహిళకు మనం భరోసానివ్వాలి.ఒక క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు దాన్ని ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలో నేర్పించండి. అదే మీరు ఇచ్చే కోట్లాది రూపాయల ఆస్తితో సమానం. నేను చాలా గర్వంగా మాట్లాడగలిగే విషయం విజయవాడ కమిషనరేట్ లో ఉమెన్ క్రైమ్ చాలా తగ్గింది, ఎన్.టి.ఆర్.జిల్లాలో ఎక్కడైనా మిస్సింగ్ కేసు వచ్చినా 24 గంటల్లో ట్రేస్ అవుట్ చేస్తున్నాం అని సీపీ చెప్పారు, ఇంతకన్నా మన మహిళలకు, మన పిల్లలకు రక్షణ ఏముంటుంది చెప్పండి,ఈ రోజు విజయవాడ కమిషనరేట్ లో ఏ మూలకు ఎటు తిరిగినా కూడా సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. ఈరోజు సుమారుగా ఐదుగురు ఆడబిడ్డలు తమ తల్లిదండ్రుల్ని పిల్లల్ని కూడా వదిలి 34 రోజులు సైకిల్ తొక్కారు, ప్రతి గ్రామానికి వెళ్లి ఆ గ్రామంలోని డ్రగ్స్ మీద అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు, మా విజయవాడ కమిషనర్ సక్సెస్ వెనుక కూడా మహిళలే ఉన్నారని నేను నమ్ముతాను.
మహిళా కమీషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ…మహిళా సాధికారత అనే అంశం నేడు కాలానికి తగ్గట్టుగా చాలా ముఖ్యమైనది. మహిళల పట్ల సమాజం మరియు వ్యవస్థల ఆలోచనా విధానం మారినప్పుడే నిజమైన సాధికారత సాధ్యమవుతుంది. అలాగే పని ప్రదేశాల్లో గౌరవప్రదమైన వాతావరణం ఉంటేనే మహిళలు తమ ప్రతిభను చాటుకోగలరు,మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగంగా మహిళా పని శక్తిని 80%కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహిళలు ఎప్పుడైతే ఇంటి నుండి బయటకు అడుగు పెట్టి, తిరిగి వచ్చే వరకు సురక్షితంగా భావిస్తారో, అప్పుడే ఈ లక్ష్యం సాధ్యమవుతుంది.కేవలం రోడ్లపైనే కాకుండా, నేటి డిజిటల్ ప్రపంచంలో కూడా మహిళలకు భద్రత కల్పించడం అత్యవసరం. ఏపీ ప్రభుత్వం, పోలీస్ విభాగం తీసుకుంటున్న ప్రోయాక్టివ్ చర్యలు మహిళల్లో ఎంతో నమ్మకాన్ని నింపుతున్నాయి. ఏపీ పోలీస్ యంత్రాంగం ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తోంది. ఇటీవలే ‘నారీ 2025’ ద్వారా విశాఖపట్నం ‘సురక్షిత నగరం’గా గుర్తింపు పొందింది. మేము ఇప్పుడు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ తో కలిసి, వైజాగ్‌లో చేసిన సర్వే లాగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించి, మహిళల భద్రత మరియు సాధికారతలో ఏపీని ఒక రోల్ మోడల్ గా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… డ్రగ్స్ పై దండయాత్ర పేరుతో ర్యాలీ చేసిన ఐదుగురు మహిళలకు అభినందనలు, 34 రోజులపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ ఒక మాస్ క్యాంపెన్ నిర్వహించి డ్రగ్స్ పై అవగాహన కల్పించడం జరిగింది. పోలీసు కమీషనరేట్ పరిధిలో మహిళ భద్రతకోసం ఈవ్ టీజర్స్ పని పట్టేలా 42 డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నాం, నేడు 10వేల సీసీ కెమెరాలు పెట్టుకోవడం ద్వారా మహిళలకే కాదు…ప్రజలకుభద్రత కల్పిస్తున్నాం, మహిళలు,పిల్లలు అధృశ్యం అయితే 24 గంటల్లోచేదిస్తున్నాం, ఇటీవల కాలంలో చాలావరకు నేరాల సంఖ్య తగ్గించకలిగాం, టెక్నాలజీని అనుసంధానం చేసి మంచి ఫలితాలు సాధించాం. కమిషనరేట్ పరిధిలో ముగ్గురు మహిళా డి.సి.పి.లు షిరిన్ బేగం ఐ.పి.ఎస్., కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్., కృష్ణ ప్రసన్న ఐ.పి.ఎస్. మంచి పని తీరుతో ప్రజల మన్ననలు పొందుతున్నారు. 2026 లో సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాం, శక్తి యాప్ లో ఒక్క బటన్ నొక్కితే డ్రోన్ ఆ మహిళకు రక్షణగా వస్తుంది, ఆటోల్లో కూడా క్యూర్ కోడ్ ఏర్పాటు చేసి ప్రజలకు భద్రత ఇచ్చే చర్యలు చేపట్టాం, మహిళల పట్ల నిబద్దతో మా పోలీసు శాఖ పని చేస్తుందని తెలిపారు.
ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ వింగ్ ఐ.జి. బి.రాజ కుమారి ఐ.పి.ఎస్.మాట్లాడుతూ… సేప్టీ ఆఫ్ ఉమెన్ అనేది అందరూ బాధ్యతగా భావించాలి, నేడు రాజకీయ నేతలుగా, పారిశ్రామిక వేత్తలుగా, కుటుంబాలను నడిపే మూల స్తంభాలుగా మహిళలు ఉన్నారు, మహిళలు నిర్భయంగా తిరిగేలా ఏపీ పోలీసు భద్రత, భరోసా కల్పిస్తుంది, కష్టం వచ్చి పోలీస్టేషన్ కు వచ్చిన మహిళ పట్ల మర్యాదగా ఉండటం, వారి కన్నీరు తుడిచే విధానాలకు శ్రీకారం చుట్టారు, అరవై రోజుల్లోనే విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చేస్తున్నాం, ఏపీ సీఎం చంద్రబాబు గారి చేతుల మీదుగా గత యేడాది మార్చి 8న శక్తి యాప్, ఉమెన్, చైల్ట్ సేప్టిని ప్రారంభించారు. ప్రతి మహిళ కూడా శక్తి యాప్ లో ఉన్న అంశాలపై అవగాహన పెంచుకోవాలి, డి.జి.పి. హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో అనేక అంశాలను మహిళల కోసం తీసుకు వచ్చారు .
ఉమెన్ అండ్ చైల్డ్ సేప్టీ వింగ్ ఏర్పడిన తర్వాత నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా శిక్ష పడేలా చేస్తున్నాం, మరణ శిక్షలు,జీవిత ఖైదులతో సహా 550 మందికి శిక్షలు ఇప్పటి వరకు పడ్డాయి,ఉమెన్ అండ్ చైల్డ్ సేప్టీ వీక్ వారోత్సవాలను రాష్ట్రం మొత్తం ఘనంగా నిర్వహిస్తున్నాం.
సైకిల్ ర్యాలీలు, డ్రాయింగ్, వ్యాస రచన పోటీల ద్వారా అవగాహన కలిగిస్తున్నాం, 1165 శక్తి వెహికల్స్ రాష్ట్రంలో ఉండగా, శక్తి టీమ్స్ డ్రోన్ కెమెరాలను ఆపరేట్ చేస్తున్నాయి,15,293ప్రదేశాలలో డ్రోన్ లద్వారా ఈవ్ టీజర్స్, బహిరంగంగా మద్యం తాగేవారిపై చర్యలు తీసుకున్నాం
శ్రీకాకుళంజిల్లాలో మూడేళ్లుగా కనిపించకుండా పోయిన మహిళను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు,బాపట్లలో తప్పిపోయిన రెండు గంటల్లోనే ఒక బాలికను తల్లి చెంతకు , ఇలా ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు భద్రత, భరోసా కల్పించేలా ఏపీ పోలీసు శాఖ పని చేస్తుంది. RESPECT అంటే ఏడు అక్షరాలు కాదు.. ఏడు రకాల విధానాలు, మహిళలకు RESPECT ఇవ్వాల్సిన అవసరం ఉంది.. అది అందరూ తెలుసుకోవాలి.
జిల్లా కలెక్టర్ లక్ష్మి శా ఐ.ఏ.ఎస్.మాట్లాడుతూ… ఎన్.టి.ఆర్. జిల్లాను మహిళా భద్రతలో నెంబర్ వన్ గా నిలపాలనేది పోలీస్ కమిషనర్ గారి లక్ష్యం, దీనికి ప్రజలు, మీడియా సహకారం చాలా అవసరం, ఏపీ సీఎం కలలుగన్న “హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్” మరియు “స్వర్ణాంధ్రప్రదేశ్” సాధించాలంటే, మహిళా భద్రత, సాధికారత అత్యంత ముఖ్యం, దుర్గగుడి దసరా ఉత్సవాల వంటి సందర్భాల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది మహిళా సిబ్బందిని నియమించడం వల్ల భద్రతపై నమ్మకం పెరుగుతుంది. మహిళా సాధికారత అనేది జాలి, దయతో ఇచ్చేది కాదు, అది వారి శక్తిని గుర్తించడం, ఆడపిల్లలే కదా ఏం చేస్తారు అనే చిన్నచూపు చూడకుండా, వారి సామర్థ్యాన్ని నమ్మాలి. ఎన్.టి.ఆర్. జిల్లాలో జరుగుతున్న ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రానికే కాకుండా దేశానికే ఆదర్శంగా నిలవాలి, మహిళలకు భద్రత కాదు,మహిళల వల్లే సమాజానికి భద్రత.
ఈ కార్యక్రమం లో డి.సి.పి.లు , ఇతర అధికారులు, సిబ్బంది సుమారు 2000 మంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News