-మహిళా రక్షణ మరియు సైబర్ భద్రతపై అవగాహన పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
-జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు నిర్వహించిన మార్చి 08న International Women’s Day సందర్భంగా జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, పోలీసు, ఐసిడిఎస్, మెప్మా, డీఆర్‌డీఏ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. మహిళల సాధికారత, భద్రత, ఆరోగ్య పరిరక్షణ, ఆర్థిక స్వావలంబన అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రపంచ మహిళా దినోత్సవాన్ని కేవలం ఉత్సవంగా కాకుండా మహిళల హక్కులు, అవకాశాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అవగాహన ర్యాలీలు, సదస్సులు, ఆరోగ్య శిబిరాలు, విజయవంతమైన మహిళల సన్మాన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
అలాగే స్వయం సహాయక సంఘాల ప్రదర్శనలు, మహిళల తయారీ ఉత్పత్తుల స్టాల్స్, నైపుణ్యాభివృద్ధి శిక్షణలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విద్యాసంస్థల్లో బాలికల హక్కులు, భద్రత, లింగ సమానత్వంపై చర్చలు చేపట్టాలని తెలిపారు.
మహిళలకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించి అర్హులైన ప్రతి మహిళకు సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
భద్రతా పరమైన అంశాలపై పోలీసు శాఖ సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని, కార్యక్రమాలు సజావుగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమిష్టిగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, మహిళల రక్షణ మరియు ముఖ్యంగా పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో రూపొందించిన ప్రత్యేక పోస్టర్లను ఆవిష్కరించారు.
నేటి డిజిటల్ యుగంలో మహిళలు సాంకేతికతను వినియోగించుకుంటూనే, ఆన్‌లైన్ వేదికలపై పొంచి ఉన్న సైబర్ ముప్పుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియా వేధింపులు, లోన్ యాప్ మోసాలు మరియు ఇతర ఆన్‌లైన్ ఆర్థిక నేరాల నుండి మహిళలు తమను తాము ఎలా కాపాడుకోవాలో ఈ పోస్టర్ల ద్వారా వివరించడం జరిగిందన్నారు. సైబర్ నేరాలకు గురైన వారు భయం వీడి వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా లేదా ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. జిల్లాలోని ప్రతి మహిళకు భద్రత మరియు సాధికారత కల్పించడమే మన లక్ష్యం,” అని ఆయన పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మరియు అంగన్‌వాడీ కేంద్రాలలో ఈ పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం కల్పించి మహిళలను చైతన్యపరచాలని కలెక్టర్ గారు అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఆర్డిఏ పిడి శోభన్ బాబు, ఐ సి డి ఎస్ పి డి వసంత భాయ్, డిఎంహెచ్వో బాలకృష్ణ నాయక్, డిజేబుల్ వెల్ఫేర్ ఏడి వినోద్ కుమార్, ఎల్ డి ఎం రవికుమార్ వివిధ శాఖల ఉన్నతాధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News