-ఈ నెల 03 నుండి 05 వ తేదీ వరకు తిరుమల తిరుపతి లో ఎన్.ఎస్.జి. బృందం ద్వారా యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ నిర్వహణ.
-మాక్ డ్రిల్ లో పాల్గొంటున్న ప్రతి శాఖ ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలి.
-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
-ఆక్టోపస్ దళాలు, ఎన్ ఎస్ జి బృందాల సమన్వయం తో యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ నిర్వహణ.
-అత్యవసర పరిస్థితులను వాస్తవంగా భావించి ప్రతి చర్యలు చేపట్టాలి.
-జిల్లా ఎస్. పి. ఎల్. సుబ్బారాయుడు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో సమన్వయాన్ని పెంపొందించడం లక్ష్యంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న యాంటీ టెర్రరిస్ట్ మాక్ ఎక్సర్సైజ్ సందర్భంగా జిల్లా స్థాయి సమన్వయ సమావేశం జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ, NSG అధికారులు, పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, రవాణా మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎన్.ఎస్.జీ. బృందం నిర్వహించనున్న మాక్ డ్రిల్స్, సెక్యూరిటీ రిహార్సల్స్, అత్యవసర ప్రతిస్పందన చర్యలపై సమగ్ర చర్చ నిర్వహించారు. ముఖ్యంగా భారీ జనసమ్మర్థం ఉండే ప్రాంతాలు, ముఖ్య ఆధ్యాత్మిక మరియు ప్రభుత్వ సంస్థల వద్ద భద్రతా ఏర్పాట్లు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, కమ్యూనికేషన్ సమన్వయం, అత్యవసర వైద్య సహాయం వంటి అంశాలపై దృష్టి సారించారు.
ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ యాంటీ టెర్రరిస్ట్ ఎక్సర్సైజ్ మాక్ డ్రిల్ ద్వారా అత్యవసర సమయంలో వివిధ శాఖల మధ్య సమన్వయంతో వేగవంతంగా, సమర్ధవంతంగా చేపట్టవలసిన చర్యల పై అవగాహన పెరుగుతుందన్నారు. మార్చి 03 న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద, 04 మరియు 05 వ తేదీలలో తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం, శ్రీవారి ఆలయం వద్ద మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మెరుగైన భద్రతా ప్రమాణాల నిర్వహణలో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమం పట్ల ప్రజలు భయబ్రాంతులకు గురి కావలసిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్, ఆక్టోపస్ దళాలు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందం, రెవెన్యూ, పంచాయతీ రాజ్, విద్యుత్ శాఖ, రవాణా శాఖ, ఎయిర్పోర్టు సిబ్బంది తదితరులు పాల్గొంటున్నారని, మాక్ డ్రిల్ లో పాల్గొంటున్న ప్రతి శాఖ ముందస్తు ప్రణాళికతో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.
జిల్లా ఎస్పి మాట్లాడుతూ మాక్ డ్రిల్ కార్యక్రమం ను పకడ్భందీగా నిర్వహించాలని మాక్ డ్రిల్ లో పాల్గొంటున్న ప్రతి శాఖ సిబ్బంది పరిస్థితిని వాస్తవంగా భావించి ప్రతిచర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర పరిస్థితికి సంబంధించి పోలీస్ శాఖ ద్వారా జిల్లా కలెక్టర్ కు ప్రాథమికంగా సమాచారం అందించడం జరుగుతుందని, అనంతరం భద్రతా చర్యల్లో పాల్గొనే శాఖలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు చేపడతారన్నారు. ఈ కార్యక్రమంలో లోకల్ పోలీస్ తో పాటు ఆక్టోపస్ భద్రతా దళాలు పాల్గొననున్నాయన్నారు. ఎన్.ఎస్.జి. కమాండో ఆపరేషన్ చేపట్టడం జరుగుతుందన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పూర్తి కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుమల శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ ల వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నియమ నిబంధనలకు అనుగుణంగా మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, లోకల్ పోలీస్ తో పాటు టిటిడి విజిలెన్స్ వింగ్, ఎన్.ఎస్.జి. బృందం సమన్వయంతో కమాండో ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందని, సిసి కెమెరాలు, అవకాశం ఉన్న చోట డ్రోన్ లను ఉపయోగించడం జరుగుతుందన్నారు.
టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ మాట్లాడుతూ, దేవస్థానాల భద్రత అత్యంత ప్రాధాన్యమైనదని, ఎన్.ఎస్.జీ. సూచనల మేరకు సీసీటీవీ నిఘా, యాక్సెస్ కంట్రోల్, సిబ్బంది శిక్షణ వంటి అంశాలను బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ యాంటీ టెర్రరిస్ట్ ఎక్సర్సైజ్ మాక్ డ్రిల్ ద్వారా భద్రతా వ్యవస్థల సామర్థ్యాన్ని పరీక్షించి, లోపాలను గుర్తించి, సమర్థవంతమైన చర్యలు చేపట్టడం లక్ష్యమని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది కేవలం భద్రతా సాధన కార్యక్రమమని స్పష్టం చేశారు.
ఈ మాక్ డ్రిల్ ను కేవలం భద్రతా చర్యలు పెంపొందించే చర్యలో భాగంగా మాత్రమే నిర్వర్తించడం జరుగుతూ ఉంది. mock drill exercises జరుగు సమయములో ఎవరు కూడా video లు, photo లు తీయవద్దని, ఒకవేళ ఎవరైనా వాటిని తీసి, social media లో పెట్టడం మీడియాలో వక్రీకరించి రాయడం, దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని తెలియజేయడమైనది.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులు, ఎన్.ఎస్.జి. మేజర్ మరియు అధికారులు, రీజనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వెంకటరాముడు, డిటిసి మురళి మోహన్, ఆర్ టి సి అధికారి విశ్వనాథ్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి రమణయ్య, జిల్లా వైద్యశాఖ అధికారి బాలకృష్ణ నాయక్, టీటీడీ, రెవెన్యూ, CISF, ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు, ఆక్టోపస్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News