– సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు శాంతిని కోరుకుంటున్న నేపథ్యంలో యుద్ధాన్ని ఆపేయాలని, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఖండించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఈ మేరకు కె. రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. గత 3 రోజుల నుండి యుద్ధం జరుగుతున్నది. అమెరికా యుద్దోన్మాదం ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా బెంబేలెత్తే పరిస్థితి దాపురించింది. ప్రత్యేకించి గల్ఫ్ దేశాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌లు యుద్ధోన్మాదంతో ప్రత్యర్థులపైన దాడులకు తెగబడడం, బెదిరించడం జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు టారీఫ్‌ల పెంపు పేరుతో ప్రపంచాన్ని బెదిరిస్తూ, మరోవైపు ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ, ఆయా దేశాల అధ్యక్షులు, నాయకులను కిడ్నాప్ చేయడం, హతమార్చడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన సతీమణిని దుర్మార్గంగా కిడ్నాప్‌చేసి, అమెరికన్ కోర్టులలో కేసులు మోపడం, ఇరాన్ సుప్రీం నేత ఖమీనేను చంపి, ఇరాన్‌పై యుద్ధానికి తెగబడడాన్ని ప్రపంచ వ్యాప్తంగా తప్ప్పుబడుతున్నారు. యుద్ధాన్ని ప్రకటించే ముందు కాంగ్రెస్‌తో చర్చించలేదని, కాంగ్రెస్‌కు మాత్రమే ఆయా అధికారం ఉందని, ట్రంప్ ఏకపక్షంగా యుద్ధం ప్రకటించారని అమెరికాలో ఉన్న సెనెటర్స్ చెబుతున్నారు. ట్రంప్ దురాగతాలపై అమెరికాలో సైతం నిరసనలు మిన్నంటుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశానికి చెందిన వారైనప్పటికీ శాంతిని కోరుకుంటున్నారు. దాదాపు 1 కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నారు. వారంతా యుద్ధ భయంతో ఆందోళన చెందుతున్నారు. కాబట్టి యుద్ధాన్ని ఇకనైనా ఆపాలి. అమెరికా తన యుద్ధోన్మాద చర్యలను ఉపసంహరించుకోవాలి. తక్షణమే వివిధ దేశాల సార్వభౌమత్వాలను గుర్తించాలి. అంతర్జాతీయంగా యునైటెడ్ నేషన్స్ ఉన్నారా లేరా అనే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో అమెరికా యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా గళమెత్తాలి. అమెరికా దుశ్చర్యలను ఆపాలి. పాలస్తీనాపై ఇజ్రాయెల్ యొక్క దుశ్చర్యలను ఖండించాలని కోరుతున్నాం.
మన దేశ ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ఈ యుద్ధోన్మాద చర్యలను ఖండించేందుకు ఏమాత్రం ముందుకు రాకుండా, పరోక్షంగా దీన్ని సమర్థించే వైఖరి అవలంభించడం సరైందికాదు. ఇటీవలనే ప్రధాని మోడీ ఇజ్రాయెల్‌లో పర్యటించి, ఇజ్రాయెల్ పార్లమెంటులో మాట్లాడడం, వెనువెంటనే యుద్ధం ప్రారంభం కావడం పలు అనుమాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ప్రధాని నరేంద్రమోడీ స్పందించి అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని భారతదేశం తరఫున ఖండించాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నదన్నారు.
Prajavartha Online Telugu News