-రహదారి భద్రతపై విస్తృత అవగాహన ప్రచారం
– జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
NCORD (నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ) కార్యకలాపాలలో భాగంగా బుధవారం రాజమహేంద్రవరం నగరంలోని పలు ప్రాంతాలలో రవాణా కార్మికులకు మాదకద్రవ్యాల నివారణ, రహదారి భద్రత మరియు బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌పై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ ప్రచారం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (GGH) పరిధిలోని గణపతి ఆటో & అంబులెన్స్ యజమానులు/ కార్మికుల సంఘం, అనం కళా కేంద్రం సమీపంలోని శ్రీ శివ గణేష్ కార్ టాక్సీ స్టాండ్, రైల్వే స్టేషన్ ఆటో & టాక్సీ స్టాండ్ యూనియన్, అలాగే RTC కాంప్లెక్స్ ఆటో వర్కర్స్ యూనియన్‌లలో జరిగింది. రవాణా రంగంలో పనిచేసే డ్రైవర్లు ప్రజల ప్రాణాలకు బాధ్యత వహించే స్థితిలో ఉంటారని, కాబట్టి మాదకద్రవ్యాల దుర్వినియోగం సమాజానికి తీవ్రమైన ప్రమాదం కలిగిస్తుందని అధికారులుచెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు మరియు మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు కుటుంబాలకు, సమాజానికి, దేశానికి అపార నష్టాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. Motor Vehicles Act, 1988 లోని సెక్షన్ 185 ప్రకారం మద్యం సేవించి వాహనం నడిపితే విధించే శిక్షలు, జరిమానాలు మరియు లైసెన్స్ రద్దు వంటి చట్టపరమైన చర్యలపై ఆర్ సురేష్ వివరించారు. అదేవిధంగా Narcotic Drugs and Psychotropic Substances Act, 1985 (NDPS చట్టం) కింద మాదకద్రవ్యాల కలిగి ఉండటం, రవాణా చేయడం, పంపిణీ చేయడం వంటి నేరాలకు కఠినమైన శిక్షలు మరియు భారీ జరిమానాలు విధించబడతాయని తెలియజేశారు. చట్టాల కఠినత్వం ద్వారా యువతను రక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న రవాణా కార్మికులకు మాదకద్రవ్యాలు లేని ఆరోగ్యకర జీవనశైలిని అవలంబించాల్సిన అవసరాన్ని, కుటుంబ బాధ్యతలను గుర్తుంచుకుని సురక్షిత డ్రైవింగ్ అలవాటు చేసుకోవాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. మాదకద్రవ్యాల వల్ల ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టం, కుటుంబ విభేదాలు, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా మాత్రమే ఈ సామాజిక సమస్యను తగ్గించవచ్చని పేర్కొన్నారు. రవాణా కార్మికులు సమాజానికి ఆదర్శంగా నిలిచి, సురక్షితమైన మరియు బాధ్యతా యుతమైన రహదారి వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News