గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థకు బకాయి ఉన్నమేజర్ డిఫాల్టర్లకు రెడ్ నోటీసులు జారీ చేయాలని, పన్నువసూళ్లకు ఆర్ఐల వారీగా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లు, అడ్మిన్ కార్యదర్శులతో పన్ను వసూళ్ల పురోగతిపై సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత రోజువారీ వసూళ్లు చేయాల్సిన లక్ష్యంపై సమీక్షించి, పన్ను వసూళ్లలో పురోగతి లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా చేయాల్సిన పన్ను వసూళ్లలో పురోగతి లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. గతేడాది వసూళ్ల కంటే 30 శాతం విధిగా పన్ను వసూళ్లు జరగాలన్నారు. మేజర్ డిఫాల్టర్లకు రెడ్ నోటీసులు జారీ, ట్యాప్, డ్రైనేజి మరియు ఎస్న్షీయల్ సర్వీస్ ల తొలగింపుకు, కమర్షియల్ సంస్థలు అయితే సీజ్ చేయడానికి డిప్యూటీ కమిషనర్లు భాధ్యత తీసుకోవాలన్నారు. మార్చి మొదటి వారం గడిచినా ఆస్తి, ఖాళీ స్థల పన్నులు, ట్యాప్ చార్జీలు, మీటర్ల చార్జీలు వసూళ్లలో అలసత్వం వీడకుంటే ఎలా అని ప్రశ్నించారు. బకాయిదారులకు పన్ను చెల్లింపుపై జిఎంసి నుండి ఇప్పటికే మెసేజ్ లు పంపామని, నోటీసులు, స్లిప్స్ ఇచ్చామని, అయినా స్పందించకుంటే ట్యాప్, డ్రైనేజి కనెక్షన్ లు డిస్ కనెక్షన్ చేయడంలో ఆర్ఐలు నిర్లక్ష్యంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లు తమ పరిధిలోని అడ్మిన్ కార్యదర్శులు పన్ను వసూళ్లలో నూరు శాతం ఉండేలా భాధ్యత తీసుకోవాలన్నారు. నీటి మీటర్ల డిమాండ్ కూడా ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయడం జరిగిందని, వసూళ్ళలో బాగా లోపం ఉందన్నారు. పన్నువసూళ్లపై ఎంత మంది బకాయిదారులను కలిసింది రోజువారీ నివేదిక తమకి అందించాలని ఆదేశించారు. పన్నుని పురమిత్ర యాప్ లేదా ఆన్ లైన్ లో www.cdma.ap.in వెబ్సైట్ ద్వారా కూడా చెల్లించవచ్చని తెలిపారు.
పన్ను చెల్లించడానికి అనువుగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, బృందావన్ గార్డెన్స్ లోని సర్కిల్ కార్యాలయంతో పాటుగా భారత్ పేట సచివాలయం (140), ఎల్ఆర్ కాలనీ మెయిన్ రోడ్ లోని సచివాలయం (53), వసంతరాయపురంలోని సచివాలయం (148), గోరంట్ల వినాయకుని గుడివద్ద సచివాలయం (183), గుజ్జనగుండ్లలోని సచివాలయం (106), సుద్దపల్లి డొంకలోని సచివాలయం (26)ల్లో ఏర్పాటు చేసిన అదనపు కౌంటర్లపై ప్రజలకు అవగాహన కల్గించాలన్నారు. పన్ను చెల్లింపుదారులకు సౌకర్యార్ధం త్రాగునీరు, టెంట్లను ఏర్పాటు చేశామన్నారు.
సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, జి.సాంబశివరావు, రెవెన్యూ అధికారులు రవికిరణ్ రెడ్డి, మదన్ గోపాల్, రెహ్మాన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, అడ్మిన్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News