-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో పెరుగుతున్న దోమల సమస్యలను నివారించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ “స్పాట్ మస్కిటో ఎలిమినేటర్” మెషిన్ను ట్రయిల్ లో భాగంగా కరెన్సీ నగర్, 14వ సచివాలయంలో ఏర్పాటు చేశారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. బుధవారం సాయంత్రం కరెన్సీ నగర్ లో ఏర్పాటు చేసిన ఈ యంత్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న దోమల సమస్యలను ఆధునిక సాంకేతికతతో నివారించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ అడుగులు వేస్తుందని అన్నారు. అందులో భాగంగా స్పాట్ మస్కిటో ఎలిమినేటర్ యంత్రం పనితీరు పరిశీలించారని, యంత్రం దోమల నివారణకు బాగా పనిచేస్తుందని, ఈ యంత్రాన్ని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల ముఖ్యమైన ప్రదేశాలలో ఎక్కడైతే దోమలు ఎక్కువగా ఉన్నాయో, అక్కడ ఈ యంత్రాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆధునిక సాంకేతికతలో మరో అడుగు ముందుకు వేస్తూ “స్పాట్ మస్కిటో సెన్సార్ ట్రాపర్” మెషిన్ను కూడా వాడేటట్టు చర్యలు తీసుకుంటున్నామని ఈ మెషిన్ ద్వారా దోమల గురించి పూర్తి విషయాలు తెలుస్తాయని, అది ఆడదోమ లేదా మగదోమా, మురికి నీళ్లలో నివసించే దోమ లేదా మంచినీరు లో ఉండే దోమ అని తెలుసుకొని ఆ దోమల వల్ల కలిగే డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా, ఫైల్ ఏరియా వంటి వ్యాధులను నివారించవచ్చు అని అన్నారు. అటువంటి యంత్రాలు వివిధ ప్రదేశాలలో అమర్చడం వలన ఆ యంత్రాల పనితీరు ఒక డాష్ బోర్డు ద్వారా తెలుస్తుందని ఆ డాష్ బోర్డులో ఎన్ని మగదోమలు ఉన్నాయి ఎన్ని ఆడ దోమలు ఉన్నాయి ఎన్ని డెంగ్యూ కలిగించే దోమలు ఉన్నాయి అవి ఎక్కడున్నాయో తెలుసుకొని అక్కడ డ్రోన్ల ద్వారా స్ప్రేలు నిర్వహించి ఆ దోమలను నివారించి ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా విజయవాడ నగరపాలక సంస్థ అడుగులు వేస్తుందని తెలిపారు. దోమలపై దండయాత్ర చేసేందుకు విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బందితోనే కాకుండా ఆధునిక సాంకేతికత యంత్రాలతో దోమల నివారణకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు,అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపాల నాయక్, బయాలజిస్ట్ వి. కామేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News