-దహన సంస్కారాల చెల్లింపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది
-కొత్త చరవాణులు, యూనిఫాంలు త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం.
-ఇతర అంశాలపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తా
-ఆశా యూనియన్ ప్రతినిధులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ హామీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆశాల వర్కర్ల కోర్కెల పరిష్కారంపట్ల కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ముఖ్య ప్రతినిధులతో సచివాలయంలోని తన ఛాంబరులో గురువారం సాయంత్రం సమావేశమై వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆశాల పనితీరు సంతృప్తికరంగా ఉందని, క్షేత్రస్తాయిలో వైద్య సేవలు మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచిందన్నారు ప్రసూతి సెలవులు (6 నెలలు) మంజూరు చేసిందని పేర్కొన్నారు అంతేకాకుండా ఉద్యోగ విరమణ చేసిన వారికి గ్రాట్యూటీ కూడా ఇస్తున్నామని తెలిపారు. ఆశాల పనితీరును గుర్తించి, వారి నుంచి అభ్యర్ధనలు రాక మునుపే ప్రభుత్వం సానుకూల ఉత్తర్వులు జారీచేసిందన్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమని పేర్కొన్నారు.
1,234 ఆశాల ఖాళీలను భర్తీ చేశాం
దహన సంస్కారాల కింద రూ 15,000 చెల్లించే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇతర ఉద్యోగులకు మాదిరిగా సాధారణ సెలవులు మంజూరు విషయమై జాతీయ ఆరోగ్య మిషన్ మార్గదర్శకాలు అనుసరించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అశాల విజ్ఞప్తి మేరకు కొత్త చరవాణులు, రెండు చీరెలను (జార్జటు మెటీరియల్) ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వం నిర్దేశించిన జాబు చార్టు ప్రకారమే విధులు నిర్వర్తించేలా జిల్లాలకు ఆదేశాలు పంపుతామని తెలిపారు. ఖాళీగా ఉన్న ఆశాల ఖాళీలను (1,363) భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం గడిచిన 20 నెలల్లో 1,234 అశాల ఖాళీలను భర్తీచేసిన విషయాన్ని ప్రతినిధులకు మంత్రి గుర్తుచేశారు. బీమా సౌకర్యం వర్తింపచేయడంలో సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామన్నారు. ఆశాల సమస్యల గురించి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని మంత్రి వారికి వివరించారు.
ప్రభుత్వ నిర్ణయాలపై సంతోషంగా ఉన్నాం.. ఆశా ప్రతినిధులు
ఈ సందర్భంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి, ఇతర ప్రతినిధులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసు పెంపు, ప్రసూతి సెలవుల మంజూరు, గ్రాట్యూటీ చెల్లింపులపై ఉత్తర్వులు ఇవ్వడంపట్ల ఆశాలు సంతోషంగా ఉన్నారని తెలిపారు ప్రసూతి సెలవులు మహిళలకు బాగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు ఆశాలకు కనీస వేతనం చెల్లించాలని, జాబుచార్టు ప్రకారమే విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని, ఖాళీగా ఉన్న ఆశాల పోస్టులు భర్తీచేయాలని, బీమా సౌకర్యాన్ని కల్పించాలని మంత్రికి విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, ఆశాల విధుల పర్యవేక్షణ అధికారి, సీఏఓ ప్రకాష్ రావు, మరో సీనియర్ అధికారి శ్యామల కూడా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News