-విద్యుత్ సరఫరా ఇబ్బందులు లేకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యం
-కూటమిలో పరిశ్రమల రాకతో పెరుగుతోన్న విద్యుత్ వినియోగం
-అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, పవర్ స్టేషన్ల నిర్మాణం
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో విద్యుత్ లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి రూ.6 వేల కోట్లతో పనులు చేపట్టినట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కోళ్ల లలిత కుమారి, ముత్తుముల అశోక్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ లోడ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో 200 కు పైగా 33/11 కేవీ సబ్ స్టేషన్ల అవసరం ఉందని గుర్తించి, వాటి నిర్మాణానికి చర్యలు చేపట్టామని మంత్రి వెల్లడించారు. విజయనగరం జిల్లా వేణుగోపాలపురం సబ్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రస్తుతం రీటెండరింగ్ దశలో ఉన్నాయని, 2027 మార్చి నాటికి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే విజయనగరం జిల్లాలో రూ.46 కోట్ల వ్యయంతో 220 కేవీ, 132 కేవీ లైన్ల పనులు పూర్తి అయ్యాయని, వాటిని త్వరలో చార్జ్ చేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అదేవిధంగా వేణుగోపాలపురంలో రూ.77 కోట్లతో సబ్ స్టేషన్ పనులు కొనసాగుతున్నాయని మంత్రి గొట్టిపాటి సభకు వివరించారు. విజయనగరంలో కూడా విశాఖపట్నం తరహాలో అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు కోరగా, ఆ వ్యవస్థ ఖర్చుతో కూడుకున్నదని మంత్రి గొట్టిపాటి తెలిపారు. నిధుల లభ్యత, అవసరాన్ని బట్టి ఆ అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. గిద్దలూరు నియోజకవర్గంలో 220 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కోరగా, విద్యుత్ శాఖ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన పెరిగిందని, దీంతో రోజువారీ విద్యుత్ వినియోగం 263 మిలియన్ యూనిట్ల నుంచి 280 మిలియన్ యూనిట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఉత్పత్తి పెంపుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. అలాగే రైతులకు పెద్దఎత్తున వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని, వ్యాపార, పారిశ్రామిక, గృహ అవసరాల కారణంగా విద్యుత్ వినియోగం పెరిగిందని చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కొరత లేకుండా చూడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలు, పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని లోడ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో 33/11 కేవీ సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్ల నిర్మాణాన్ని రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News