-వివిధ పథకాల అనుసంధానంతో కుటుంబ సాధికారితే లక్ష్యం
-సెర్ప్, మెప్మా, ఆర్టీజీఎస్ సమన్వయంతో పేదరికంపై సమరం
-డ్వాక్రా మహిళలకు బంగారు మిత్రలుగా బాధ్యత
-జీరో పావర్టీ మిషన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పేదరికాన్ని సంపూర్ణంగా రూపుమాపి, పేదల జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా జీరో పావర్టీ మిషన్ ను సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతిలో సెర్ప్, మెప్మా, ఆర్టీజీఎస్ విభాగాలతో జీరో పావర్టీ మిషన్ కుటుంబ సాధికారితపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమీకృత వ్యూహంతో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయ సంఘాల సంస్థలు సెర్ప్, మెప్మా, ఆర్టీజీఎస్ వ్యవస్థలను సమన్వయం చేస్తూ జీరో పావర్టీ మిషన్ ను ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎస్ హెచ్ జీలకు సంబంధించి ఈ వ్యవస్థల నెట్వర్క్ ద్వారా 1.3 కోట్ల కుటుంబాల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశంపై వివిధ దేశాలు రాష్ట్రాల్లో అమలు అవుతున్న అత్యుత్తమ పేదరిక నిర్మూలన విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2047 స్వర్ణాంధ్ర మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో జీరో పావర్టీ మిషన్ సమర్ధంగా చేపట్టాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన మిషన్ కు సంబంధించి కేంద్రం అమలు చేస్తున్న నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ ద్వారా వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.1100 కోట్లును సమర్ధంగా వినియోగించుకునేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. అటు జాతీయ అర్బన్ లైవ్లీ హుడ్ మిషన్ ద్వారా పట్టణ ప్రాంతాల్లోనూ పేదరిక నిర్మూలన కోసం ప్రణాళికలు చేయాలన్నారు. వీటితో పాటు స్వయం సహాయ సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు స్వయం పేరిట బ్రాండింగ్ ఇచ్చి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
కుటుంబం యూనిట్ గా పథకాలు
ప్రభుత్వ పథకాలు, పీ4 విధానం స్వయం సహాయక సంఘాల సహకారంతో ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని మార్గదర్శి – బంగారు కుటుంబం MBK 10-20 గా పిలవాలని సూచించారు. సమాజంలో అట్టఅడుగున ఉన్న 20 శాతం మందిని ఆర్ధికంగా ఎగువన ఉన్న 10 శాతం స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. పేదరికం నుంచి బయటపడిన వారికి ఒక గౌరవ ప్రదమైన పేరును ఖరారు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలును వ్యక్తిగతంగా కాకుండా ఫ్యామిలీ యూనిట్ గా పరిగణించాలి సీఎం సూచించారు. ఆరోగ్యం, వ్యవసాయం, సంక్షేమ పథకాల ద్వారా ఒక కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరుతుందో అంచనా వేయాలని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంలో జీరో పావర్టీ మిషన్ మొదటి అడుగు అని ముఖ్యమంత్రి వివరించారు. డ్వాక్రా సభ్యుల సేవలను వినియోగించుకుని అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని, వారిని ఎంఎస్ఎంఈలు గా ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారం అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, సెర్ప్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News